సినీవినోదం రేటింగ్ : 2.5/5
స్రవంతి సినిమాటిక్స్, పి.ఆర్.సినిమాస్ బ్యానర్స్ పై కిషోర్ తిరుమల దర్శకత్వం లో కృష్ణచైతన్య, స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు .
అభి(రామ్), వాసు(శ్రీవిష్ణు) చిన్నప్పట్నుంచి కలిసే పెరుగుతారు. ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు. ఓ రాక్ బ్యాండ్‌లో అభి సభ్యుడిగా ఉంటాడు. ఓ ప్రాజెక్ట్ పని మీద వాసు రెండు నెలలు పాటు ఢిల్లీ వెళతాడు. ఆ సమయంలో అభికి, హౌస్ సర్జన్ అయిన మహా(అనుపమ పరమేశ్వరన్) పరిచయం అవుతుంది. అనుపమ డాక్టరు చదువుకున్నా, తనకు సింగర్ కావాలని, స్టేజ్‌పై పాటలు పాడాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికను తెలుసుకున్న అభి ఆమెకు తన రాక్ బ్యాండ్‌లో పాడే అవకాశం ఇస్తాడు. అంతే కాకుండా ఆమె అభిప్రాయాలకు విలువనిస్తాడు. దాంతో ఒకరంటే ఒకరికి ప్రేమ కలుగుతుంది. కానీ ప్రేమను బయటికి చెప్పుకోరు. అయితే.. మహా, తన ప్రాణ స్నేహితుడు వాసు మరదలని, ఆమెను వాసు కూడా ఇష్టపడుతున్నాడని అభికి తెలుస్తుంది. వాసు, అభిలిద్దరూ తమ మనసులోని ప్రేమను మహాకు చెబుతారు. ఎవరిని ఇష్టపడుతుందో చెప్పమని కూడా అంటారు. ఇద్దరిలో మహా, వాసునే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. ఓ కారణంగా అభి, వాసు మధ్య గొడవ జరుగుతుంది. ఇద్దరూ విడిపోతారు. అభి ఎవరికీ చెప్పకుండా మిలాన్ వెళ్లిపోతాడు. అయితే అక్కడే అనుకోని ఘటనలు ఎదురవుతాయి. మహా ఏమవుతుంది? వెడ్డింగ్ ప్లానర్ మేఘన ఎవరు? ప్రాణ స్నేహితులైన అభి, వాసు తిరిగి కలుసుకున్నారా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి ….
నేను శైలజ` సినిమాలో రామ్‌ను సరికొత్తగా ప్రెజంట్ చేసిన కిషోర్ తిరుమల మరోసారి తన వంతుగా కొత్త ప్రయోగమే చేశాడు. అభి, వాసుల స్నేహ బంధం మీదే దర్శకుడు కిశోర్ తిరుమల కథ, కథనాలను రాసుకున్నాడు. సినిమాలో కీలకమనిపించే ప్రతి సన్నివేశం వీరిద్దరి స్నేహ బంధం నైపథ్యంలోనే ఉంటుంది. దర్శకుడు కిశోర్ తిరుమల స్నేహ బంధాన్ని మాటల్లో, ఒక మూడు కీలక సన్నివేశాల్లో అయితే బాగానే చెప్పగలిగాడు కానీ, మిగతా చాలా సీన్లలో అంత ప్రభావవంతంగా కనెక్ట్ చేయలేకపోయాడు. ముఖ్యంగా అభి, వాసుల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని గొప్ప స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేదు. కీలక సన్నివేశాలలో తప్ప మిగతా సినిమా మొత్తం ఏదో ఉదాసీనంగా, అనాసక్తితో సాగుతున్న ఫీలింగ్ కలిగింది.సెకండాఫ్ వచ్చేసరికి సన్నివేశాలను ఆసక్తికరంగా రాసుకోవడంలో విఫలమయ్యాడు. సెకండాఫ్ క్లైమాక్స్ ముందు వరకు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. అసలు ఇంటర్వెల్ ఎప్పుడొస్తుందా? అని ఫస్టాఫ్‌లో ఎదురుచూసిన ప్రేక్షకుడు, సెకండాఫ్ వచ్చేసరికి థియేటర్ బయటకు ఎప్పుడు వెళ్లిపోతామా? అని ఎదురుచూస్తాడు.
ఫస్టాఫ్ లో సాగే రామ్, అనుపమ లవ్ ట్రాక్ కొంత ఎంటర్టైన్మెంట్ కలగలిసి ఆహ్లాదకరంగా అనిపించింది.లావణ్య త్రిపాఠి ట్రాక్ మరీ బలహీనంగా తోచింది. ఒకసారి ప్రేమలో విఫలమైన హీరో రెండోసారి ప్రేమలో పడాలంటే బలమైన కారణాలు, పరిస్థితులు ఖచ్చితంగా అవసరమవుతాయి. కానీ ఇక్కడ మాత్రం హీరో సులభంగా రెండోసారి ప్రేమలో పడిపోవడం కొంత నిరుత్సాహకరంగా అనిపించింది. క్లైమాక్స్ బాగుంది .అయితే , క్లైమాక్స్ లో ఎమోషన్స్ పెద్ద ఎత్తున ఎగిసిపడతాయేమో అనుకుంటే… చాలా సింపుల్ గా కొన్ని నిజాల్ని రివీల్ చేసి తేల్చేయడం లోటుగా అనిపించింది .
రామ్ పాత్ర చిత్రీకరణ, అతని లుక్స్, పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. ‘రాక్ స్టార్’ లుక్ లో రామ్ బాడీ లాంగ్వేజ్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేసాడు . రామ్ సినిమా అంటే ఫైట్స్ సంగతేమో కానీ, డ్యాన్సులు మాత్రం బావుంటాయి అనుకుంటారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమాలో వీటికి భిన్నంగా అన్నీ సాంగ్స్ మాంటేజ్ సాంగ్స్ కావడం తో రామ్ డ్యాన్సులతో మెప్పించలేదు. పెర్ఫామెన్స్ పరంగా రామ్ నటన ఓకే. ఇక వాసు పాత్రలో నటించిన శ్రీ విష్ణు ఫ్రెండ్ అంటే ప్రాణమిచ్చే స్నేహితుడిగా, ప్రియురాలు దూరమైన ప్రేమికుడిగా బాగానే చేసాడు . ఇక మహా క్యారెక్టర్‌లో అనుపమ చక్కగా నటించింది. తన పాత్ర ఫస్టాఫ్ వరకు మాత్రమే పరిమితమైనా, పాత్రకు అనుగుణంగా పాత్రలో ఒదిగిపోయింది. వెడ్డింగ్ ప్లానర్ పాత్రలో లావణ్య ఓకె . పెర్ఫామెన్స్‌కు స్కోప్ లేకున్నా గ్లామర్ షోతో లావణ్య బబ్లీగా అలరించింది. ఇక రామ్ స్నేహితుల బ్యాచ్ విషయానికి వస్తే.. ప్రియదర్శి తనదైన కామెడీ టైమింగ్‌తో కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు. ఇక కిరిటీ, రాజ్ మాదిరాజ్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
`వయసులో ఉన్నప్పుడు ప్రేమ గురించి తెలుస్తుంది…వయసు అయిపోయేటప్పుడు జీవితం గురించి తెలుస్తుంది. కానీ స్నేహానికి వయసుతో పని లేదు. అలా తెలిసి పోతుందంతే..`,… `ఎక్స్‌పీరియెన్స్‌తో చెప్పినప్పుడు ఎటకారంగా తీసుకోకూడదు`.., `అడ్జస్ట్ కావడం అలవాటైన వారికి ఇష్టాలతో పని లేదు`,… `అవసరం టైమ్ చెప్పి రాదు`,…`మనకు నచ్చిన వ్యక్తి గురించి ఇంట్లో వారితో అర్గ్యుమెంట్ చేయవచ్చు, కానీ నచ్చిన వ్యక్తితో ఆర్గ్యుమెంట్ చేయలేం`,….`నీకోసం అమ్మాయి ఏడిస్తే చూడాలనుకున్నావు..కానీ నన్ను మాత్రం ఏడిపించేస్తున్నావ్`..`మహా లైఫ్‌లో చివరి రెండు లైన్స్ మాత్రమే పరిమితం చేశావు..మళ్లీ మరో అమ్మాయి జీవితంలో నన్ను రెండు లైన్స్‌కు పరిమితం చేయకు`… ఇలాంటి డైలాగ్స్ ప్రేక్షకులకు నచ్చుతాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు మాంటేజ్ సాంగ్స్ సన్నివేశాల పరంగా చూస్తే ట్యూన్స్ కనెక్ట్ అవుతాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నచ్చుతుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. షూట్ చేసిన సహజ లొకేషన్ లు ఆహ్లాదకరంగా కనిపించాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ద్వారా లెంగ్త్ కొద్దిగా తగ్గించి ఉండాల్సింది – ధరణి