“నా విలువల మీద ప్రశ్నించారు..ఇటువంటి పరిస్థితుల్లో మేం ఎందుకు మాట్లాడకూడదు. నేను నటిని కాకపోతే.. ఓ అమ్మాయినే కదా. ఏ అమ్మాయి అయినా ఇలాగే స్పందిస్తుంది”…అని అంటోంది రకుల్ ప్రీత్‌సింగ్ . సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కథానాయిక రకుల్ . తన వ్యక్తిగత అనుభవాలు..వ్యాపార విషయాలు..ఫిట్నెస్..ఫ్యాషన్‌కు సంబంధించిన అంశాలన్నీ తన అభిమానులతో వీడియోలు, ఫొటోల రూపంలో పంచుకుంటూ ఉంటుంది. చాలా మంది ఆమె ఫొటోలను ప్రశసించిన సందర్భాలు ఉన్నప్పటికీ…మరో పక్క అదే స్థాయిలో ట్రోలింగ్ కూడా ఉంటుంది. ట్రోలింగ్‌కు రకుల్ తెలివిగా సమాధానం చెబుతూ ఉంటుంది. ట్రోలింగ్ లో కొన్ని మాత్రం ఆమెను వేధించేలా..వ్యక్తిగత దూషణలతో ఉంటున్నాయి. ఒక్కోసారి స్పందించలేని అంశాలపైనా ట్రోల్ చేస్తుండడంపై తాజాగా రకుల్ ప్రీత్‌సింగ్ స్పందించింది…
”కొన్ని ఆలోచించకుండానే సమాధానం చెప్పేవి ఉంటాయి. అటువంటివి ఎన్నయినా పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కొందరు మాత్రం ఫేక్ అకౌంట్లతో ట్రోల్ చేస్తుంటారు. వారెవరు? అని చెక్ చేసి చూడాల్సి వస్తుంది. గత ఏడాది నేను చిన్నచిన్న దుస్తులు వేసుకున్నానని వ్యక్తిగతంగా దూషించారు. ఆ సమయంలో నేనూ అదే స్థాయిలో స్పందించాను…
‘కారులో సెషన్ ముగిశాక ఫ్యాంట్ వేసుకోవడం మరిచింది’ అని ట్రోల్ చేశారు. దానికి నేను ‘మీ అమ్మ కూడా కారులో చాలా సెషన్స్ చేసి ఉంటుందని అనుకుంటున్నా..అందులో మీరు పండిపోయారు’ అని సమాధానం చెప్పా.
“ఆ ట్రోలింగ్ అంతటితో ఆగలేదు. నా విలువల మీద ప్రశ్నించారు..ఇటువంటి పరిస్థితుల్లో మేం ఎందుకు మాట్లాడకూడదు. నేను నటిని కాకపోతే.. ఓ అమ్మాయినే కదా! ఏ అమ్మాయి అయినా ఇలాగే స్పందిస్తుంది. అమ్మాయిలంటే ఈ ప్రపంచానికి చాలా ద్వేషం, ప్రతికూల భావం ఉంది. నా పాయింట్ ఏమిటంటే…సమాజంలో కొందరు మేం ఏం చేయలేమని భావిస్తున్నారు?” అని ప్రశ్నించింది రకుల్. ఎవరైనా నా వ్యక్తిగత విషయాలు.. కుటుంబ విషయాలపై ట్రోల్ చేస్తే సహించేది లేదని హెచ్చరించింది.
నా మనసు ఏం చెబితే అదే !
‘ఓ కథని అంగీకరించడానికి చాలా కారణాలుంటాయి. సినిమాల ఎంపికలో నా మనసు ఏది చెబితే అది ఫాలో అవుతాను. ఆ సమయంలో నాకు కరెక్ట్ అనిపించిందే చేస్తా’ అని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన రకుల్ ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ మరిన్ని ఆఫర్లని దక్కించుకుంటోంది. తెలుగులో కొంత గ్యాప్ వచ్చినా కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో మాత్రం ఫుల్ బిజీగా ఉంది.
‘ఇప్పటి వరకు వ్యక్తిగతంగా నాకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ వస్తున్నా. కొన్నిసార్లు కథ నచ్చొచ్చు.. మరోసారి పాత్ర.. కొన్ని సార్లు డైరెక్టర్.. హీరో నచ్చి ఉండవచ్చు.. మన పాత్రకీ అంతగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నా మనసు ఏం చెబితే అదే ఫాలో అయిపోతా. ఇటీవల నటించిన ‘దే దే ప్యార్ దే’, ‘మార్జవాన్’ చిత్రాలు బాలీవుడ్ ప్రేక్షకులకు నన్ను దగ్గర చేశాయి. ఈ నేపథ్యంలో మరిన్ని మంచి చిత్రాల్లో ఛాన్సులు వస్తున్నాయి’ అని రకుల్ తెలిపింది. ప్రస్తుతం ‘భారతీయుడు 2’, శివకార్తికేయన్ చిత్రం, అర్జున్ కపూర్ సినిమా, జాన్ అబ్రహం చిత్రాల్లో భిన్న పాత్రల్ని రకుల్ పోషిస్తోంది.