రకుల్ ప్రీత్ సింగ్ సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ వికారాబాద్ అడవుల్లో చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని వర్షం సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా సుశాంత్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్ అధికారులు సెప్టెంబర్ 25న రకుల్‌ను విచారించిన విషయం తెలిసిందే. సుశాంత్ కేసులో రియాను అరెస్టు చేసిన ఎన్సీబీ ఆమె స్టేట్మెంట్ల ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్లను కూడా విచారించింది. రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన అనంతరం ఆమె మళ్లీ ఇప్పటి వరకు షూటింగ్ పాల్గొనలేదు.తాజాగా మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. వర్షం పడుతున్న సమయంలో సెట్లో క్రిష్, వైష్ణవ్ తేజ్ గొడుగు పట్టుకొని ఉన్న రెండు వీడియోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. “వర్షంలో షూటింగ్ అంటే కెమెరాలను, మనల్ని మనం రక్షించుకోవాలి. కేవలం కోవిడ్ మాత్రమే కాదు.. హైదరాబాద్ వర్షాలను ఎదుర్కొని రెయిన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నాం. ఏం జరిగినా షూటింగ్ మాత్రం ఆపలేం” అని పేర్కొన్నారు. దీనితోపాటే రకుల్ నితిన్ హీరోగా నటిస్తున్న ‘చెక్’ సినిమాలోనూ రకుల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమెతోపాటు ప్రియా ప్రకాశ్ వారియర్ మరో హిరోయిన్‌గా కనిపించనున్నారు.
‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో మొదటి హీరోయిన్… తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్గా ఇమేజ్ సాధించిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ 2011లో ‘కెరటం’ సినిమాతో తెలుగులో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత రెండేళ్ల కు ఆమెకు 2013లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచి రకుల్‌ప్రీత్ సింగ్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే… ప్రభాస్ హీరోగా కాజల్, తాప్సీ హీరోయిన్లుగా 2011లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో కాజల్ పాత్ర కు ముందుగా రకుల్‌నే అనుకున్నారంట. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలో రకుల్‌ను హీరోయిన్గా సెలక్ట్ చేసి నాలుగు రోజులు షూటింగ్ కూడా చేశారట. అప్పుడు ఆమెకు డిగ్రీ పరీక్షలు ఉండటంతో.. సెట్లో ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టేదట. కొత్త హీరోయిన్ కావడం.. ఆమెకు సినిమాల గురించి తగిన అవగాహన లేకపోవడంతో రిస్క్ ఎందుకని నిర్మాతలు రకుల్‌ను తప్పించి.. ఆమె ప్లేస్‌లో కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారు.
నాగచైతన్య హీరోగా వచ్చిన ‘ఆటోనగర్ సూర్య’లో ముందుగా సమంతను తీసుకున్నప్పటికీ ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిందట. దీంతో ఆమె ప్లేస్‌లో రకుల్‌ను తీసుకున్నారు. ఆ వెంటనే సమంత డేట్స్ ఇవ్వడంతో రకుల్‌కు నిరాశ తప్పలేదు. ఆ రెండు సినిమాల వల్లే తనకు సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసొచ్చిందని రకుల్ కొన్ని సందర్భాల్లో చెప్పింది.