‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాల’నే సామెత విషయంలో సినిమావాళ్లు చాలా ముందుంటారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా తనకు అవకాశాలు వస్తున్న సమయంలోనే ఆర్థికంగా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అనుకోకుండా హీరో అయిన ఈ కుర్ర హీరో తన సంపాదనను ఓ ఖరీదైన ఇంటి కోసం ఖర్చు చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు ఎంత డబ్బు వెనకేశాడనే విషయం ఎవరికీ తెలియదు కానీ, సొంత ఇల్లు విషయంలో మాత్రం మంచి ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నాడని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్.
‘ఉయ్యాల జంపాల’తో హీరోగా మారిన రాజ్ తరుణ్‌కు ఆ తరువాత మరో రెండు హిట్స్ వచ్చాయి. అయితే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో హీరోగా వరుసబెట్టి మూడు సినిమాలు చేసిన రాజ్ తరుణ్ ప్రస్తుతం చేస్తున్న ‘రాజుగాడు’ సినిమా సైతం ఏకే బ్యానర్లోనే కావడం విశేషం. అయితే ఏకే బ్యానర్లో నటించిన సినిమాలకు పారితోషికంగా వారి నుంచి ఓ ఖరీదైన విల్లాను తీసుకున్నాడట ఈ యంగ్ హీరో.
నాలుగు కోట్ల ఖరీదు చేసే ఈ విల్లాకు బదులుగా రాజ్ తరుణ్ వారి బ్యానర్లో నాలుగు సినిమాలు చేయడానికి అంగీకరించాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ డీల్‌లో దిల్ రాజు నిర్మించబోయే సినిమా కూడా ఉందంటున్నారు. చిత్రపరిశ్రమలో కొంత మంది తమ సంపాదనను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక సతమతమవుతుంటే రాజ్ తరుణ్ వంటి కొద్ది మంది మాత్రం సినిమాల ద్వారా వచ్చే సంపాదనను సరైన పద్దతిలో పెట్టుబడి పెడుతుంటారు.