అందరూ తన వాళ్లే అనుకునే ఓ మధ్యతరగతి అమ్మాయి నందితారాజ్. జీవితంలో ఆమెకు ఎదురైన సమస్యలను ఓ అజ్ఞాత వ్యక్తి పరిష్కరిస్తారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అనేది మా సినిమా చూసి తెలుసుకోమంటున్నారు రాజకిరణ్. సృష్టికి, మనిషి ఊహకు ముడిపెడుతూ ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘విశ్వామిత్ర’.
ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మిస్తున్న సినిమా ‘విశ్వామిత్ర’. నందితారాజ్, ‘సత్యం’ రాజేష్ జంటగా నటించారు. అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించారు. మేలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ “విశ్వంలో మానవ మేధస్సుకు అందని విషయాలు చాలా ఉన్నాయి. సృష్టిలో ఏది జరుగుతుందో… ఏది జరగదో… చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. ఎప్పటికీ నిలిచే సృష్టిలో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా ‘విశ్వామిత్ర’. వాస్తవ ఘటనల ఆధారంగా… ‘గీతాంజలి’, ‘త్రిపుర’ తరహాలో థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందించాం. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా. ప్రముఖ ఛానల్ ‘జీ తెలుగు’ ప్రతినిధులు సినిమా చూసి, నచ్చడంతో ఫ్యాన్సీ రేటుకు శాటిలైట్ హక్కులను తీసుకోవడం సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ నేను దర్శకత్వం వహించిన మూడు చిత్రాల శాటిలైట్ హక్కులను ‘జీ తెలుగు’ సంస్థ తీసుకుంది. మా కాంబినేషన్లో నాలుగో చిత్రమిది. మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం” అన్నారు.
విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, ‘కార్టూనిస్ట్’ మల్లిక్, జీవా, రాకెట్ రాఘవ, సి.వి.ఎల్ నరసింహారావు, ఇందు ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ళ, ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, ఎడిటర్: ఉపేంద్ర, మ్యూజిక్: అనూప్ రూబెన్స్, యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: సుచిత్ర – భాను, ఆర్ట్: చిన్నా, కో-డైరెక్టర్: విజయ్ చుక్కా,నిర్మాతలు: మాధవి అద్దంకి, రజనీకాంత్, రాజకిరణ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజకిరణ్