అభిమానులను ఆకట్టుకునే… ‘పేట’ చిత్ర సమీక్ష

సినీ వినోదం రేటింగ్ : 2.75/5

కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం లో సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని అశోక్ వ‌ల్ల‌భ‌నేని తెలుగులో విడుదల చేసారు.
కధలోకి వెళ్తే…
కాళీ(ర‌జ‌నీకాంత్‌) ఓ హాస్ట‌ల్ వార్డెన్‌గా జాయిన్ అవుతాడు. అక్క‌డ మైకేల్‌( బాబీ సింహ‌) అండ్ గ్యాంగ్ జూనియ‌ర్స్‌ను ఇబ్బంది పెడుతుంటే వారిని అడ్డుకుంటాడు. అందువ‌ల్ల మైకేల్ తండ్రి, లోక‌ల్ డాన్‌తో పెద్ద గొడ‌వ అవుతుంది. అదే స‌మ‌యంలో అన్వ‌ర్ అనే కుర్రాడి ప్రేమ మేఘా ఆకాశ్‌తో స‌క్సెస్ కావడానికి ఆమె త‌ల్లి మంగ‌ళ‌(సిమ్రాన్‌)తో మాట్లాడుతాడు. అదే స‌మ‌యంలో కోపంతో మైకేల్ తండ్రి కొంత మందిని పంపి కాళీని కొట్ట‌మ‌ని అంటాడు. కానీ కానీ వారు మైకేల్‌తో పాటు, కాళీని కూడా చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. కానీ కాళీ వారిని అడ్డుకుంటాడు. అయితే అత‌ను కాళీ కాద‌ని ‘పేట వీర’ అని తెలుస్తుంది. అత‌నికి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సింఘా(న‌వాజుద్దీన్ సిద్ధికీ)కి పాత ప‌గ‌లుంటాయి. అస‌లు వారికి ఉన్న ప‌గేంటి? ఈ ప‌గ‌కు, అన్వ‌ర్‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి? చివ‌ర‌కు పేట ఏం చేశాడు? అనే విష‌యాలు తెల‌సుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ…
ర‌జ‌నీకాంత్‌ని అభిమానులు ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా అతని అభిమాని ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ‘కబాలి’, ‘కాలా’ సినిమాల్లో క‌న‌ప‌డ‌ని ఎన‌ర్జీ ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్‌లో చూస్తారు. అలాగే ఆయ‌న గ‌త చిత్రాల‌తో పోల్చితే వ‌య‌సును మించి క‌ష్ట‌ప‌డి డ్యాన్సులు కూడా వేశారు. ఇక కామెడీ టైమింగ్‌లో ర‌జనీకాంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ర‌జ‌నీకాంత్‌, సిమ్రాన్ ట్రాక్ మెప్పిస్తుంది.
ఫ‌స్టాఫ్ అంతా మాసీ డైలాగ్స్‌, కామెడీ ట్రాక్, ర‌జనీకాంత్ ఎనర్జిటిక్ డైలాగ్స్‌, డ్యాన్సులు ఉండేలా.. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమాను తెర‌కెక్కించాడు. ఓ ర‌కంగా చెప్పాలంటే కొత్త ర‌జ‌నీకాంత్‌ను తెర‌పై చూస్తారు. ఫ‌స్టాఫ్ అంతా ఫ‌న్నీగా, ర‌జ‌నీ స్టైల్‌తో ఆక‌ట్టుకునేలా ఉంటుంది. సెకండాఫ్‌లో ‘ఫ్లాష్ బ్యాక్’ వ‌స్తుంది. దాంతో అస‌లు క‌థ.. ర‌జ‌నీకాంత్‌, విల‌న్‌కు మ‌ధ్య గొడ‌వేంటి? ఆ గొడ‌వ‌ల కోసం రజ‌నీకాంత్ ఏం చేశాడు? ఏం చేశాడ‌నే దాన్ని చూపాడు. అదంతా రజినీకాంత్ చేసిన ‘భాషా’ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఈ రెండవభాగం లో …ఒక్కసారి ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి రజనీకాంత్‌ సీరియస్‌గా రివెంజ్‌లోకి వెళ్లిన తర్వాత విషయం లేక సినిమా తేలిపోయింది.  అంతవరకు వున్న హుషారు మొత్తం ఆవిరైపోయి … సినిమా ఎప్పుడయిపోతుందా? అని ఎదురుచూసేంతలా విసుగొస్తుంది.హీరో, విలన్ల మధ్యన వచ్చే పగ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు సినిమాలోని సెకెండ్ హాఫ్ లో  కీలక సన్నివేశాలు చాలా సాగతీతగా అనిపిస్తాయి.
నటీనటవర్గం…
ఈ చిత్రంతో రజినీ మళ్ళీ పాత రజినిని గుర్తుకుతెచ్చాడు. హాస్టల్ వార్డెన్ పాత్రలో నటించిన ఆయన, తన పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, తన మార్క్ యాక్టింగ్ తో స్టయిల్ తో సినిమాకి హైలెట్ గా నిలచారు. అలాగే తన కామెడీ టైమింగ్ తోనూ రజిని నవ్విస్తారు.డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రజినీ స్టైల్ ని, మ్యానరిజం ను పూర్తిగా వాడుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరీ చెప్పుకోదగ్గ పాత్ర కాకపోయినా విజయ్ సేతుపతి  తన గంభీరమైన నటనతో పాటు తన కామెడీ టైమింగ్ తోనూ ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో హీరోయిన్స్ గా నటించిన సిమ్రాన్, త్రిష పాత్ర పరిధిలో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించినా తమ నటనతో తమ గ్లామర్ తో ఆకట్టుకుంటారు.
అలాగే విలన్ గా నటించిన నవాజుద్దిన్ సిధ్దిఖి కూడా చాలా బాగా చేశాడు. క్రూరత్వంతో కూడుకున్న ఒక బలహీనమైన విలన్ గా ఆయన నటన బాగుంది.
సాంకేతికంగా…
అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా  బాగుంది. సినిమా రేంజ్‌ని పెంచింది .ఆయన అందించిన పాటలు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా లేవు.తిరునావక్కరసు సినిమాటోగ్రఫీ చాలా  బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా చక్కగా చిత్రీకరించారు.వివేక్ హ‌ర్ష‌న్‌ ఎడిటింగ్ బాగుంది -రాజేష్