రాజేష్ టచ్రివర్ దర్శకత్వంలో ప్రియమణి నటించనున్న ‘సైనైడ్’ మిడిల్ ఈస్ట్ సినిమా పతాకంపై ప్రదీప్ నారాయణన్ నిర్మిస్తున్నారు. దేశంలోనే సంచలనం సృష్టించిన ‘సైనైడ్’ మోహన్ కేసు ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దక్షిణాది భాషల్లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుండగా… హిందీలో ఆ పాత్రలో యశ్ పాల్ శర్మ నటిస్తున్నారు.
రాజేష్ టచ్రివర్ మాట్లాడుతూ “సైనైడ్ తో 20మంది యువతులను కిరాతకంగా హత్య చేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మోహన్ కేసును అత్యంత అరుదైన కేసుగా కోర్టు పేర్కొంది. ఈ కేసు ప్రేరణగా తీసుకొని ‘సైనైడ్’ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రియమణి పవర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు” అని అన్నారు.
ఈ పాన్ ఇండియా చిత్ర నిర్మాత ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ ” దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 20 మంది అమ్మాయిలను మోహన్ కనికరం లేకుండా హత్య చేశాడు. ఈ కేసులో కోర్టు అతనికి 6 మరణశిక్షలు, 14 జీవిత ఖైదులను విధించింది. ఈ కేసు తుది తీర్పు కూడా వెలువడింది” అని అన్నారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ బెంగళూరు, మంగళూరు, కూర్గ్, మడిక్కెరి, గోవా, హైదరాబాద్, కాసరగోడ్ లో కొనసాగుతుంది అన్నారు.
ప్రియమణి, యశ్ పాల్ శర్మ, చిత్రంజన్ గిరి, తణికెళ్ల భరణి, రాంగోపాల్ బజాజ్, సిజ్జు, శ్రీమాన్, సమీర్, రోహిణి, సంజు శివరామ్, షాజు ముకుందన్, రిజు బజాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు
సదాత్ సైనూద్దీన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. జార్జ్ జోసెఫ్ సంగీతం అందిస్తున్నారు. శశి కుమార్ ఎడిటింగ్.. గోకుల్ దాస్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. స్పెషల్ ఎఫెక్ట్ మేకప్ మెన్ ఎన్.జి. రోషన్, రవి పున్నం మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు. కంటెంట్ సలహాదారు: పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్.