జనాదరణ పొందడానికి రెండే రెండు మార్గాలు. ఒకటి సినిమా. రెండు పాలిటిక్స్. ఈ రెండూ బలమైన వేదికలు. అయితే వీటిలో సినిమా కన్నా పాలిటిక్స్‌కు పిసరు ఆకర్షణ శక్తి ఎక్కువ. అందుకే సూపర్‌స్టార్స్ సైతం రాజకీయాల్ని తమ అంతిమ లక్ష్యంగా చేసుకుంటారు. ఇప్పటివరకూ చాలా మంది భారతీయ నటులు రాజకీయాల్లోకి ప్రవేశించి, తమ సత్తా చాటుకుంటే, ఇప్పుడీ జాబితాలోకి త్వరలో తలైవా రజనీకాంత్ కూడా చేరనున్నారు. ఆ తమిళ సూపర్‌స్టార్ పాలిటిక్స్‌లోకి ఎప్పుడొస్తాడా అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. అయితే వచ్చేముందు పాలిటిక్స్ రిలేటెడ్‌గా ఉండే ఒక సినిమాతో జన హృదయాల్ని దోచుకోడానికి ఆయన సిద్ధమవుతున్నాడట.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఆశ్చర్యపడాల్సిన అంశం కాకపోయినా, ఆయన ఎప్పుడొస్తాడన్నదే ఇప్పుడు చర్చాంశనీయమైన విషయం. అయితే పాలిటిక్స్‌లోకి అడుగు పెట్టేముందు ఒక మంచి రాజకీయ చిత్రంతో జనాలకు దగ్గరవ్వాలని రజనీకి అనుచరులు సలహా ఇస్తున్నారట. ఇప్పటికే ‘2పాయింట్ ఓ , కాలా’ చిత్రాల్ని పూర్తి చేసిన రజనీకాంత్.. ఇప్పుడీ రాజకీయ నేపథ్యం కలిగిన చిత్రం కోసం కొన్ని కథల్ని వినడం మొదలెట్టాడట.
త్వరలోనే రాజకీయాల్లోకి రావడానికి రజనీకాంత్ సన్నాహాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పాల్గొనడానికి ముందుగా ఒక మంచి రాజకీయ ఇతివృత్తం కలిగిన చిత్రంతో తన రాజకీయ ప్రవేశానికి శ్రీకారం చుట్టనున్నారట. చాలా మంది దర్శక, నిర్మాతలు ఈ నేపథ్యంలో కొన్ని కథల్ని సిద్ధం చేయిస్తున్నారట. కార్తిక్ సుబ్బరాజు, అట్లీ, అరుణ్ కుమార్ లాంటి కుర్ర దర్శకులు కొన్ని లైన్స్‌ను ఇప్పటికే రజనీకి వినిపించారట. అందులో కొన్ని బాగున్నాయని రజనీ చెప్పారట. కానీ ఫైనల్ డెసిషన్ ఇంకా ప్రకటించలేదట. కొన్ని ప్రముఖ సంస్థలైతే, ఆ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి క్యూ కట్టేశాయట.