కమర్షియల్ కథలో సహజత్వాన్ని మేళవించి, మంచి సందేశంతో ‘కాలా’

‘‘అవకాశం దొరికితే వదలకూడదు. కష్టపడి శ్రమించి పనిచేస్తే తప్పకుండా అందుకు తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది’’ అన్నారు రజనీకాంత్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాలా’. హ్యూమా ఖురేషి కథానాయిక. పా.రంజిత్‌ దర్శకత్వం వహించారు. ధనుష్‌ నిర్మాత. చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది.
 
రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘‘1978లో తెలుగులో నా ‘అంతులేని కథ’ విడుదలైంది. ఆ తర్వాత ‘అన్నదమ్ముల సవాల్‌’, ‘ఇద్దరూ అసాధ్యులే’ ఇలా పది, ఇరవై సినిమాలు చేశా. ఆ తర్వాత కాస్త విరామం వచ్చింది. తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహాన్ని చూసి తెలుగుపై దృష్టిపెట్టాలా, తమిళంపై దృష్టిపెట్టాలా అనిపించింది. అప్పుడు తమిళంలోనే బాలచందర్‌ నన్ను పరిచయం చేశారు కాబట్టి అక్కడే నా కెరీర్‌ కొనసాగింది. కానీ తమిళ ప్రేక్షకులు ఎంత ప్రేమ చూపిస్తున్నారో, అంతే ప్రేమ తెలుగు ప్రేక్షకులూ చూపిస్తున్నారు. అది నాకు దక్కిన భాగ్యం. తమిళ సినిమాలు చేస్తున్న దశలో ‘పెదరాయుడు’తో మోహన్‌బాబు నాకు తెలుగులో మరో మలుపునిచ్చారు. ఆ తర్వాత ‘బాషా’, ‘నరసింహా’, ‘ముత్తు’, ‘చంద్రముఖి’, ‘రోబో’, ‘శివాజీ’ ఇలా వరుసగా నా సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటికి మంచి ఆదరణ లభించింది. ఎప్పుడు హైదరాబాద్‌కి వచ్చినా పెద్దాయన ఎన్టీఆర్‌ని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకొనేవాణ్ని. ఆయన లేని లోటు ఇప్పుడు బాగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ఇప్పుడు చాలా గుర్తుకొస్తున్నారు. అది ఎందుకో అందరికీ తెలుసు. బాలచందర్‌ తర్వాత నాకు గురువుగారు దాసరి నారాయణరావు. నన్ను తన బిడ్డలాగా ప్రేమించారు. వారి ఆత్మకి దేవుడు శాంతి చేకూర్చాలి. నా అల్లుడు ధనుష్‌ ఒకే రజనీకాంత్‌ అని చెబుతున్నాడు. ఒకే చిరంజీవి, ఒకే నాగార్జున, ఒకే బాలకృష్ణ, ఒకే వెంకటేష్‌. ఎవరి శైలి వాళ్లది. ఇక్కడ అవకాశం గొప్పది. దొరికిన అవకాశాన్ని సరైన రీతిలో వినియోగించాలి.
నేను, రంజిత్‌ కలిసి చేసిన చివరి చిత్రం ‘కబాలి’. రంజిత్‌కి అవకాశం ఇవ్వడం చూసి చాలా మంది రకరకాలుగా మాట్లాడారు. కానీ ‘కబాలి’ చిత్రాన్ని ఆయన చాలా బాగా తీర్చిదిద్దారు. ‘కాలా’ కూడా చాలా బాగుంటుంది. వాణిజ్య ప్రధానమైన కథలో సహజత్వాన్ని మేళవించి సినిమాని తీస్తాడు రంజిత్‌. ఇందులో మంచి సందేశం ఉంది. ఆసియా ఖండంలోనే పెద్ద మురికివాడ ధారావి. అక్కడుండే మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ల సమస్యలు ఎలా ఉంటాయనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. అక్కడ మనుషులతో గడిపి వచ్చినట్టే ఉంటుంది ఈ సినిమా చూస్తే. మామూలుగా ఒక సినిమాలో ఒక పాత్ర నచ్చుతుంది, లేదంటే రెండు పాత్రలు నచ్చుతాయి. కానీ ఈ సినిమా చూశాక ఐదారు పాత్రలు గుర్తుండిపోతాయి. సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణ్‌ ఉత్తమమైన పనితీరును కనబరిచారు. చాలా క్లాస్‌గా ఈ సినిమా చేశారు. తెలుగమ్మాయి ఈశ్వరీరావు నటన చాలా బాగుంది. కథానాయిక హ్యూమా సహకారం మరిచిపోలేనిది. మా అల్లుడు ధనుష్‌ సినిమాని ఎలా నిర్మిస్తాడో అనే సందేహం ఉండేది. మంచి నటుడినే కాదు, మంచి నిర్మాత అని కూడా నిరూపించారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
ధనుష్‌ మాట్లాడుతూ ‘‘ప్రజల సినిమా ఇది. ప్రజల కొరకు, ప్రజలకి సంబంధించిన అంశాలతో తీశాం. ఇదొక సాహసోపేతమైన ప్రయత్నం అని కూడా చెబుతా. దర్శకుడు పరిశోధన చేసి ధారావి జీవితాల్ని అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు. ఒక్క ధారావి అనే కాదు, నిర్లక్ష్యానికి గురవుతున్న సామాన్యుడి కథ ఇది. నలభయ్యేళ్లుగా ప్రజలు ఆరాధిస్తున్నారు రజనీకాంత్‌ని. సినిమా రంగంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరి లక్ష్యం రజనీకాంత్‌ అవ్వడమే. కానీ ఒక్క రజనీకాంత్‌ మాత్రమే ఉంటారు. దేశానికి గర్వకారణం ఆయన. అలాంటి నటుడితో ‘కాలా’ సినిమాని నిర్మించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.
‘‘భూమికి సంబంధించిన సమస్యల్ని స్పృశిస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది’’ అన్నారు దర్శకుడు పా.రంజిత్‌. ‘‘నా జీవితంలో మరిచిపోలేని పాత్ర ఏదైనా ఉందంటే అది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి జోడీగా నటించడమే’’ అన్నారు ఈశ్వరీరావు. హ్యూమా ఖురేషి మాట్లాడుతూ ‘‘నా అదృష్టం ఈ సినిమాలో నటించడం. దర్శకుడు గొప్ప పాత్రల్ని సృష్టించార’’న్నారు. ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో ‘బాబా’ సినిమాని విడుదల చేసే అవకాశం నాకు ఇచ్చారు రజనీకాంత్‌. ఆ సినిమాతో ఎంత నష్టం వచ్చిందో కనుక్కొని దానికంటే ఒక రూ.లక్ష అదనంగా ఇచ్చారు. సినిమా పరిశ్రమలో మనకు కనిపించే దేవుడు రజనీకాంత్‌గారు. ఆయన మంచితనం, నిజాయతీ, నిబద్ధత గొప్పవి’’ అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘1999లో నేను ‘నరసింహ’ సినిమాని పంపిణీ చేశాను. 19 యేళ్ల తర్వాత మళ్లీ నైజాంలో రజనీకాంత్‌ నటించిన ఈ సినిమాని విడుదల చేసే అవకాశం లభించింది. నటనపరంగా జాతీయ పురస్కార గ్రహీత అయిన ధనుష్‌ నిర్మాతగా కూడా ఈ సినిమాని చేశాడంటే ఆయనకి సినిమాపై ఉన్న తపన ఎలాంటిదో అర్థమవుతోంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎం.రత్నం, ‘లైకా’ కరుణాకరన్‌ తదితరులు పాల్గొన్నారు.