‘2.ఓ’, ‘కాలా’ చిత్రాల కథానాయకుడు సూపర్‌స్టార్ రజనీకాంతే అన్న విషయం తెలిసిందే. రజనీకాంత్, శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘2.ఓ’ కన్నా ముందుగా ‘కాలా’ విడుదల కానుందా? ఇందుకు అవుననే బదులు కోలీవుడ్ నుంచి వస్తోంది. స్టార్ దర్శకుడు శంకర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెండితెరపై అద్భుతా లు చూపే ప్రయత్నం 2.ఓ. ఇందులో ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్ నాయకిగా నటించింది.బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా గర్జిస్తున్న ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. లైకా సంస్థ సుమారు రూ. 450కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తున్న చిత్రం 2.ఓ. ఈ చిత్ర విడుదల తేదీ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర వర్గాలు వెల్ల డించాయి. అయితే గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడంతో ‘2.ఓ’ విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందనిఅంటున్నారు
ఇక రజనీ నటిస్తున్న మరో చిత్రం ‘కాలా’. పా.రంజత్ తెరక్కిస్తున్న మరో సంచలన చిత్రం ‘కాలా’. ‘కబాలి’ తరహాలోనే మరోసారి రజనీకాంత్‌ను దర్శకుడు దాదాగా చూపిస్తున్నారు. నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీకి జంటగా ఈశ్వరీరావు నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. రజనీకాంత్ ఇటీవలే ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పారన్నది గమనార్హం. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘2.ఓ’ తరువాత ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని ‘కాలా’ చిత్ర యూనిట్ భావించారు. అయితే ‘2.ఓ’ విడుదల ఆలస్యం జరుగుతుండటంతో దాన్ని ఓవర్టేక్ చేసి ‘కాలా’ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం.