సినీవినోదం రేటింగ్ : 2.5/5
వండర్ బార్ ఫిలిమ్స్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ల పై పా.రంజిత్ దర్శకత్వం లో ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు
కరికాలన్(రజనీకాంత్) తిరునల్ వేలికి చెందిన యువకుడు. కొన్ని పరిస్థితుల కారణంగా ముంబై నగరంలోని ధారావి ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ప్రజల కష్ట సుఖాల్లో వారికి అండగా నిలబడి వారి నాయకుడుగా ఎదుగుతాడు. అక్కడే జరీనా(హ్యూమా ఖురేషి)తో ప్రేమలో పడతాడు. కానీవారు ఒక్కటి కాలేకపోతారు. చివరకు కాలా సెల్వి(ఈశ్వరీరావు)ను పెళ్లి చేసుకుంటాడు. ధారావి ప్రాంతం పేద ప్రజలకు చెందింది. అక్కడున్న హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు. అయితే ఆ ప్రాంతాన్ని ఆధీనం చేసుకోవాలని హరినాథ్ దేశాయ్(నానా పటేకర్) అనే రాజకీయ నాయకుడు ప్రయత్నిస్తాడు. అయితే ఉన్న చోటును వదలి పేద ప్రజల ఎక్కడికి పోతారు? అందువల్ల వారు కాలా నాయకత్వంతో ఎదురుతిరుగుతారు. రాజకీయ నాయకులు అక్కడి మనుషుల మధ్య గొడవలు సృష్టిస్తారు. అప్పుడు కాలా ఏం చేస్తాడు? ఆ ప్రాంత ప్రజలను ఒక్కటి చేసి ఎలా పోరాడుడాడు? అనేది తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే….
‘కబాలి’ లాంటి పరాజయం తర్వాత కూడ రజనీకాంత్ దర్శకుడు పా.రంజిత్ కు ‘కాలా’ ద్వారా రెండవ ఛాన్స్ ఇచ్చారు. కానీ రంజిత్ మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. సినిమాను ‘కబాలి’ కంటే బాగానే తీసినా ‘కబాలి’ పరాజయాన్ని మరిపించేలా మాత్రం లేదు. రజనీ నుంచి అభిమానులు ఆశించే మాస్, కమర్షియల్ అంశాలేవీ లేకుండా చేసి రంజిత్ పూర్తిగా నిరాశపరిచాడు. తొలి భాగం అంతా అసలు కథ ప్రారంభించకుండా ఫ్యామిలీ సీన్స్‌తో లాగించేశాడు. ఇంటర్వెల్ సీన్‌తో హైప్‌క్రియేట్ చేసినా ద్వితీయార్థంలో అదే టెంపో కంటిన్యూ చేయలేకపోయాడు. కథనం భావోద్వేగపూరితంగా, కదిలించేలా లేకపోవడం, సన్నివేశాల్లో బలం లోపించడం, అవసరంలేని పాత్రలు, రజనీకి ఉండాల్సిన స్థాయిలో ఎలివేషన్ లేకపోవడం నిరుత్సాహపరిచే విషయాలు.
ముంబై ధారావి అనే ప్రాంతంలోని ఓ డాన్ తన ప్రాంతంలోని ప్రజల కోసం ఏం చేశాడనేదే ఈ సినిమా. స్వాతంత్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. అరవై శాతం మంది ప్రజలు స్వంత ఇల్లు లేకుండా ఉన్నారు. అటువంటి వారి సమస్యల గురించి చర్చించే సినిమా. దర్శకుడు పా రంజిత్ ధారావి ప్రాంతాన్ని ఓ ఉదాహరణంగా తీసుకుని ‘భూమి అందరి హక్కు’ అనే సమస్యను రజనీకాంత్ ద్వారా చెప్పించాడు. త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న రజనీకాంత్‌కి ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది. ఫ్లాష్ బ్యాక్‌లో హ్యూమాతో రజనీకాంత్ ప్రేమ.. విఫలం చెందడం.. ఈశ్వరీరావు, రజనీ మధ్య సన్నివేశాలు బావున్నాయి. ముఖ్యంగా ఈశ్వరీరావు నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమా బ్రిడ్జ్‌ఫై వచ్చే ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్ మెప్పిస్తాయి.
కరికాలుడు కాలాగా రజనీకాంత్ తనదైన మాస్ పెర్ఫార్మెన్స్ మరోసారి చూపించారు. సినిమా అంతా ఆయన చుట్టూనే తిరుగుతుంది. రజనీకాంత్ తనదైన స్టైల్స్, మేనరిజమ్స్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. నటన పరంగా సూపర్బ్ అనిపించిన రజనీ యాక్షన్ సీన్స్ లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. విలన్ గా నానా పటేకర్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా.. ఉన్నంతలో సూపర్బ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. తనదైన నటనతో నానా క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసేశాడు. రజనీ ఇమేజ్ను ఢీ కొట్టే పొలిటీషియన్ పాత్రలో నానా పటేకర్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. రజనీ భార్యగా ఈశ్వరీ రావు నవ్వించే ప్రయత్నం చేసింది. కీలక పాత్రలో నటించిన హూమా ఖురేషీ హుందాగా కనిపించింది. సముద్రఖని పాత్ర పరిధి మేర చక్కగా ఉంది
సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ పాటల సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అక్కడక్కడా మెప్పించినా.. కొన్ని సందర్భాల్లో మూడ్‌తో సంబంధం లేకుండా రాప్ బీట్లతో ఇబ్బంది పెట్టాడు. ఇక పాటల్లోని సాహిత్యం అసలు అర్థం కాదు. మురళీ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ధారావి మురికి వాడలను సహజం గా చూపించాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి -ధరణి