‘సౌత్ ఇండియా సూపర్ స్టార్’ రజనీకాంత్ చిత్రాలు ఈ మధ్యకాలం లో ఆశించినంత జనాదరణ పొందని విషయం తెలిసిందే . అయినా ఇప్పటికీ రజనీకాంత్ సినిమా విడుదలవుతుందంటే …అటు అభిమానుల్లో, ఇటు సినీ వర్గాల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మార్కెట్ వర్గాల్లో ఆ క్రేజ్‌కు ఆకాశమే హద్దు. రజనీ చిత్రాల శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ దక్కించుకునేందుకు భారీ పోటీ ఉంటుంది.
ఈ నేపథ్యంలో రజనీ తాజాగా నటిస్తున్న ‘కాలా’ చిత్ర శాటిలైట్ రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయని సమాచారం. ఓ ప్రముఖ ఛానెల్ ఏకంగా 75 కోట్ల రూపాయలతో అన్ని భాషల శాటిలైట్ హక్కులను దక్కించుకుందట. రజనీ నటిస్తున్న మరో చిత్రం ‘2.0’ కూడా 110 కోట్లకు శాటిలైట్ హక్కులు అమ్ముడైన విషయం విదితమే. ‘కబాలి’ తర్వాత పా.రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘కాలా’. ముంబయి మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో హ్యూమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 27న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన ‘కాలా’ టీజర్ 30 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రాన్ని వండర్‌బార్ పతాకంపై ధనుష్ నిర్మిస్తున్నారు.