‘నటసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ ఫౌండేషన్’ ప్రతి సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును సినీరంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ఇస్తున్న విషయం తెలిసిందే. 2017 సంవత్సరానికిగాను ‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకొని తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని ఎంపిక చేశారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ అవార్డు ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకు భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేయగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి అందించారు. అలాగే సన్మానపత్రం, చెక్కును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రదానం చేశారు. ఈ వేడుకలో అక్కినేని కుటుంబ సభ్యులు వెంకట్, నాగార్జున, నాగసుశీల, సుమంత్, నాగచైతన్య, అఖిల్‌తోపాటు ఎస్.ఎస్.రాజమౌళి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇంకా కె.రాఘవేంద్రరావు, జి.ఆదిశేషగిరిరావు, కె.ఎల్.నారాయణ, జగపతిబాబు, పివిపి, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, గుణ్ణం గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అవార్డు ప్రదానం చేయడానికి ముందు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సారధ్యంలో జరిగిన అక్కినేని నాగేశ్వరావు చిత్రాల్లోని పాటల కార్యక్రమం అందర్నీ ఆకట్టుకుంది.
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ – ”రాజమౌళి ఇప్పుడే అన్నాడు తన భుజాలపై పెద్ద బాధ్యత పెట్టారని. నేను రాజమౌళికి ఒకటే చెప్తున్నాను. నువ్వు ఆ బాధ్యతను మొయ్యగలవు. ఎందుకంటే నువ్వు బాహబలి. అది ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు. క్రియేటివిటీ, విజన్ వున్న వ్యక్తి. ఈ సన్మానాలు, పురస్కారాలు ఎందుకంటే మిగతా వారికి తమ పని పట్ల అభిరుచిని, ఆసక్తిని, శ్రద్ధని పెంచడం కోసం. ఫెలిసిటేషన్ టు ప్రొవైడ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. నాగేశ్వరరావుగారు ఈ అవార్డును ప్రారంభించింది కూడా అందుకే. మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా వుంటుందన్న ముందు చూపుతో ఈ అవార్డును ప్రారంభించి తన కుటుంబ సభ్యులకు ఆ బాధ్యతను అప్పగించారు. ఈరోజు భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక అపూర్వమైన రోజు. ఈ అవార్డు రాజమౌళికి ఇవ్వడం చాలా సముచితం. ఎందుకంటే తెలుగు కీర్తి పతాకం, భారతీయ కీర్తి పతాకం ప్రపంచ పటంలో మొదటిసారి తలెత్తుకొని గర్వంగా నిలిచేటట్టు చేసిన వ్యక్తి రాజమౌళి. ఒక మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుగారి పేరు మీద స్థాపించిన అవార్డును తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఎస్.ఎస్.రాజమౌళికి ప్రదానం చెయ్యడం ఒక మర్చిపోలేని ఘట్టంగా నేను భావిస్తున్నాను. 17వ ఏట సినీరంగంలో ప్రవేశించి 91 ఏళ్ళ వయసు వరకు జీవించారు అక్కినేని నాగేశ్వరరావుగారు. చలాకీగా అందరితో మాట్లాడేవారు. వయసు ఆయన కళను హరించలేదు. ఆయన విజయాలకు ప్రధాన కారణం అంకిత భావం, క్రమశిక్షణ. ఎక్కువగా చదువుకోకపోవడం వల్ల ఎన్నో విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. అలాంటి మహా వ్యక్తి పేరు మీద ప్రారంభించిన ఈ అవార్డును గతంలో ఎంతో మంది ప్రముఖులకు అందించారు. ఇప్పుడు రాజమౌళికి ఈ అవార్డు ప్రదానం చేయడం చాలా సంతోషం. ఈ అవార్డు వేడుకలో పాల్గొనే అవకాశం కల్పించిన అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున, వారి కుటుంబ సభ్యులను అభినందిస్తున్నాను. రాజమౌళి భవిష్యత్తులో మరిన్ని అర్థవంతమైన సినిమాలు చెయ్యాలని, మర్ని కళాత్మక ప్రయోగాలు చెయ్యాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ – ”చాలా సంతోషంగా వుంది. మనమంతా ఎంతో గర్వంగా చెప్పుకునే సినీనటులు స్వర్గీయ నాగేశ్వరరావుగారి పేరిట వున్న ఈ అవార్డును గతంలో ఎంత గొప్పవాళ్ళకి అందించారో మనకు తెలుసు. అటువంటి అరుదైన గౌరవం ఒక తెలుగు బిడ్డగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన దర్శకుడు రాజమౌళిగారికి అందించడం చాలా సార్థకంగా వుందని భావిస్తున్నాను. రాజమౌళిగారు సంపూర్ణంగా దానికి అర్హత కలిగి వున్నారని చెప్పడంలో సందేహం లేదు. సాహసాలు చాలా మంది చేస్తారు. అన్నీ సక్సెస్ అవ్వవు. నాకు తెలిసినంతవరకు రాజమౌళిగారి అన్ని సాహసాలు సక్సెస్ అయ్యాయి. ఆయన వందలకొద్ది సినిమాలు తియ్యలేదు. తక్కువ సినిమాలే చేశారు. బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు చాలా బాగుంది మీరు చూడాలి అని. నాకు హిందీ వెర్షన్ చూసే అవకాశం కలిగింది. నేను తెలుగువాడిని కాబట్టి డెఫినెట్‌గా తెలుగులో చూడాలి అని తెలుగు కూడా చూడడం జరిగింది. అదొక అద్భుతమైన కళాఖండం. అందులో సందేహం లేదు. తెలుగులో కూడా ఎంతయినా ఖర్చుపెట్టి సినిమాలు తియ్యవచ్చు అని నిరూపించి ఒక కొత్త ట్రెండ్‌ని సెట్ చేసిన ట్రెండ్ సెట్టర్ రాజమౌళిగారు. ఆయన ఇంకా చలనచిత్ర రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయనకు ఆశీస్సులు అందిస్తున్నాను” అన్నారు.
అవార్డు గ్రహీత ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ – ”ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారికి నమస్కారం. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు కంపల్సరీ చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుగారికి కృతజ్ఞతలు. వేదికపై వున్న పెద్దలకు, అతిథులకు నమస్కారం. 1974లో అక్కినేని నాగేశ్వరరావుగారికి హార్ట్ ఎటాక్ వచ్చింది. చాలా పెద్ద పెద్ద డాక్టర్లు ఆపరేషన్ చేశారు. 14 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రాబ్లమ్ వుండదని డాక్టర్లు చెప్పారు. సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత 1988లో మళ్ళీ ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది. సర్జరీ చేయడానికి వచ్చిన డాక్టర్లు ‘హార్ట్ చాలా వీక్‌గా వుంది. బ్లడ్ పంప్ చెయ్యలేకపోతోంది’ అని ఆపరేషన్ చెయ్యలేదు. హార్ట్ వీక్‌గా వుండడం వల్ల మీకు కొంతకాలమే టైమ్ వుందని డాక్టర్లు నాగేశ్వరరావుగారికి చెప్పారట. అప్పుడు నాగేశ్వరరావుగారు డాక్టర్లు, మందుల సాయంతో 14 సంవత్సరాలు బ్రతికాను, నా విల్ పవర్‌తో మరో 14 సంవత్సరాలు బ్రతుకుతాను అనుకున్నారట. అప్పటి నుంచి ఆయన కారు నెంబరు 2002. అప్పటివరకు తన దగ్గరకు రావద్దని మృత్యువుకే వార్నింగ్ ఇచ్చి జీవించారాయన. ఆయన డిసిప్లిన్ ఏమిటో ఆయనతో వున్నవారందరికీ తెలుసు. తన మనోబలంతో మృత్యువుని ఆపగలిగారు. 2002 వచ్చింది. ఆప్పుడాయన బయటికి వెళ్తూ ఒకచోట 9 నెంబరు చూశారట. ఓకే, నేను మరో 9 సంవత్సరాలు మృత్యువుకి ఇస్తున్నాను అనుకున్నారట. వేరెవరితోనూ ఆ మాట చెప్పలేదు. ఆయన మృత్యువుతో మాట్లాడుతున్నారు, మృత్యువుని ఛాలెంజ్ చేస్తున్నారు. 2011 వచ్చిన తర్వాత ఆయనకు బోర్ కొట్టిందట. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా అన్నారట. అప్పుడు ఆయనను మృత్యువు భౌతికంగా మన నుంచి దూరం చేసింది. కానీ, ఎఎన్నార్ లివ్స్ ఆన్. మృత్యువుతో మాట్లాడిన వారిలో మహాభారతంలో భీష్ముడు వున్నారు, కలియుగంలో అక్కినేని నాగేశ్వరరావు వున్నారు. అంతటి మహానుభావుడి పేరు మీద వున్న అవార్డుని ఈరోజు నాకు ఇస్తున్నారు. ఆ అవార్డుకి నేను అర్హుడినా అంటే కాదు అనే చెప్తాను. ఎందుకంటే ఇలాంటి అవార్డు ఇస్తున్నప్పుడు మనకు ఏదో పవర్ ఇస్తున్నట్టు వుంటుంది. కానీ, నేనలా ఫీల్ అవ్వడం లేదు. నా భుజాలపై మరింత భారం మోపుతున్నట్లు ఫీల్ అవుతున్నాను. ఈ అవార్డు నాకు రావడం వెనుక కారణం.. ఇంకా నేను కష్టపడాలి, ఇంకా స్ట్రగుల్ అవ్వాలి అని గుర్తు చెయ్యడానికి అనుకుంటున్నాను. ఒక గొప్ప వ్యక్తి పేరు మీద వున్న అవార్డుకి నేను అర్హుడిని అని చెప్పుకోవడానికి నా శాయశక్తులా కష్టపడతాను” అన్నారు.
అక్కినేని నాగార్జున వందన సమర్పణ చేస్తూ – ”ఈ అవార్డు ఫంక్షన్‌కి వచ్చినందుకు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుగారికి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రాజమౌళిగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. రాఘవేంద్రరావుగారు ఒక మాట చెప్పారు. వెండితెర పుట్టినపుడు అనుకుందట, నేను బాహుబలి సినిమాని చూపించడానికే అని పులకరించింది అని రాజమౌళిగారి గురించి చెప్పారు. ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళిగారికి ఈ అవార్డును అందించడం గౌరవంగా భావిస్తున్నాం” అన్నారు.
అవార్డు ప్రదాన కార్యక్రమం తర్వాత అక్కినేని ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిల్మ్ అండ్ మీడియా స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులకు ఎస్.ఎస్.రాజమౌళి చేతులమీదుగా సర్టిఫికెట్లను అందించారు. ఇద్దరు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ని ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ – ”ఫిల్మ్ స్కూల్లో చదువుకున్నంత మాత్రాన సినిమా ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించదు. బాగా కష్టపడాలి. కృషి, పట్టుదల వుండాలి. అదే వారిని పైకి తీసుకొస్తుంది. అప్పుడే బ్రైట్ ఫ్యూచర్ వుంటుంది. నేను రాఘవేంద్రరావుగారికి ఓ 20 షార్ట్ ఫిలింస్‌కి సంబంధించి ఐడియాలను చెప్పాను. అది చూసి నాకు టివి సీరియల్ చేసే అవకాశం ఇచ్చారు” అన్నారు.
ఫిల్మ్ స్కూల్ ఛైర్మన్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ – ”ఈ స్కూల్ స్థాపించడం నాన్నగారి కల. నాన్నగారు ఎక్కువగా చదువుకోలేదు. అందుకే ఆయనకు ఎడ్యుకేషన్ అన్నా, ఫిల్మ్ స్కూల్ అన్నా ఎంతో ఇష్టం. ఈ స్కూల్ ద్వారా సినిమాకి సంబంధించిన వివిధ శాఖల్లో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నాం” అన్నారు.