భళి భళిరా రాజమౌళి…‘బాహుబలి 2’ చిత్ర సమీక్ష |
|
సినీవినోదం రేటింగ్ : 4/5 ఆర్కా మీడియా వర్క్స్‌పతాకం ఫై ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు ‘బాహుబలి’ తొలిభాగం సంచలన విజయం సాధించింది. ‘బాహుబలి 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తొలి భాగం అందించిన ఉత్సాహం తో మరింత భారీగా రెండో భాగాన్ని రూపొందించారు. ‘బాహుబలి’ కొనసాగింపుగా ఈ రెండవ ‘బాహుబలి’ కధ మొదలవుతుంది. కాళకేయులపై గెలిచిన తర్వాత అమరేంద్ర బాహుబలిని రాజమాత శివగామి మహారాజుగా ప్రకటిస్తుంది. అది భళ్ళాళదేవుడుకి, బిజ్జలదేవుడుకి నచ్చదు. ఎలాగైనా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఆలోచనలు చేస్తుంటారు. మహారాజుగా పట్టాభిషేకం చేసేలోపు ప్రజల బాగోగులు చూడాలని బాహుబలి, కట్టప్పతో కలిసి దేశాటనకు బయలుదేరుతాడు. చిన్నరాజ్యమైన కుంతల దేశాన్ని చేరుతాడు. ఆ దేశ యువరాణి దేవసేనను చూసి ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ పొందడానికి అక్కడే మకాం వేస్తాడు. దేవసేన అందం తెలివి తేటలు తెలుసుకున్న భళ్ళాలదేవుడు, దేవసేనను తనకు భార్యగా చేయమని శివగామిని కోరుతాడు. శివగామి కూడా మాట ఇచ్చి కానుకలు పంపుతుంది. అయితే బాహుబలిని ప్రేమిస్తున్న దేవసేన ఆమె కోరికను తిరస్కరించి ఆమె కోపానికి గురవుతుంది. బాహుబలి దేవసేనను తన రాజ్యానికి తీసుకుని వస్తాడు. అక్కడ రాజ్యం కావాలా? దేవసేన కావాలా? అనే సందిగ్ధం ఏర్పడినప్పుడు బాహుబలి దేవసేనకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెనే పెళ్లాడుతాడు. మహారాజు పదవిని వదులుకుని సర్వసైన్యాధ్యక్షుడుగా పదవిని అలంకరిస్తాడు. అయితే బాహుబలికి ప్రజల్లోని గౌరవాన్ని తగ్గించాలనే ఆలోచనతో భళ్ళాళదేవుడు, బాహుబలిపై కుట్రలు చేసి సైన్యాధ్యక్ష పదవి నుండి తొలిగిస్తాడు. తనపై తనే హత్యాయత్నం చేసుకుని బాహుబలిపై శివగామికి అనుమానం వచ్చేలా చేసి ఆమె నోటితో బాహుబలిని చంపమని కట్టప్పకు ఆదేశం ఇచ్చేలా ప్రణాళిక వేస్తాడు. ఇంతకు బాహుబలిని కట్టప్ప చంపుతాడా? శివగామికి చివరకు నిజం ఎలా తెలుస్తుంది? తన తండ్రి గతం, గొప్పతనం గురించి తెలుసుకున్న శివుడు భళ్ళాలదేవుడుని ఎలా ఎదుర్కొంటాడు? తన తల్లి దేవసేనకు విముక్తి ఎలా కలిగిస్తాడు? అనే విషయాలు సినిమాలో చూడాలి … దర్శకుడు రాజమౌళి కథనంతో పాటు, ఒక్కో పాత్రను చక్కగా ఎలివేట్ చేస్తూ సినిమాను నడిపిన తీరు ఆకట్టుకుంది. అమరేంద్ర బాహుబలి, కట్టప్ప, దేవసేన, బిజ్జలదేవుడు, శివగామి వంటి క్యారెక్టర్స్ సినిమా అయిపోయాక కూడా మనకు గుర్తొస్తుంటాయి . ముఖ్యంగా అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ ని తెరపై వీరోచితంగా చూపించడంలో నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యారు.ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యుద్ధ సన్నివేశాలు..ఆ సీన్స్ చూస్తుంటే తెలుగు సినిమా స్టాండర్డ్‌ను హాలీవుడ్ రేంజ్‌లో చేసినందుకు అభినందించాలి . గ్రాఫిక్స్ ని ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవడం లో రాజమౌళి ని మించిన వారు లేరనిపించింది. సినిమా మొత్తం అదిరిపోయే సీన్స్ తో ప్రేక్షకులు సీట్ల నుండి కదలకుండా చేశాడు. ముఖ్యంగా ప్రభాస్, అనుష్క మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్, కుంతల దేశాన్ని పిండారిల భారీ నుండి బాహుబలి కాపాడే సందర్భంలో ప్రతి సన్నివేశం ఎంతో రిచ్ గా ఉంటుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే తల్లి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు, బాహుబలి చనిపోయే సీన్ ఇలా అన్నీ ఆకట్టుకున్నాయి. రాజమౌళి ప్రతి సీన్‌ని హృద్యంగా తెరకెక్కించాడు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీక్వెన్సుల్లో రమ్యకృష్ణ, అనుష్క, ప్రభాస్ ల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా కట్టిపడేస్తుంది.అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ ప్రశ్నకి మంచి రీజన్ చూపించారు. ఆ సన్నివేశం చుట్టూ జరిగే ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుంటుంది. శివగామి, బాహుబలి మధ్య ఘర్షణకు కి దారి తీసే స్క్రీన్‌ప్లే బాగా కుదిరింది .అలాగే ఇంటర్వెల్ ముందు రానా పట్టాభిషేక సన్నివేశం థియేటర్ ని దడదడలాడించింది . అయితే ఈ చిత్రం మొదటి భాగం తో పాటే రెండవ భాగానికి సంబంధించిన చాలా సన్నివేశాలు అప్పుడే షూట్ చేసి పెట్టుకోవడం వల్ల …. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం లో ఆ సన్నివేశాలు చూస్తుంటే ఆర్టిస్టుల్లో మార్పు స్పష్టం గా కనిపించింది . ప్రధానం గా అనుష్క, రానా ల్లో ఈ తేడా బాగా కనిపించింది . అలాగే రెండవ భాగం చివర్లో కధ నడవక, సినిమాని బాగా సాగదీసిన ఫీలింగ్ కలిగింది . ఇంత గొప్ప గ్రాండియర్ ఉన్న సినిమాకి చప్పటి క్లయిమాక్స్ కుదరలేదు . కీరవాణి పాటలతో కన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు.సన్నివేశాల కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అవసరమైన మూడ్ ని తీసుకొచ్చాడు . ‘భళి భళిరా’ , ‘దండాలయ్యా’ పాటలు బాగున్నాయి . రాజమౌళి విజన్ కు తగ్గట్టు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ మాహిష్మతి సామ్రాజ్యాన్ని, కుంతల దేశాన్ని చాలా అద్భుతంగా రూపొందించారు. ఇక వాటిని సిల్వర్ స్క్రీన్ మీద గొప్పగా కనబడేలా కమల్ కణ్ణన్ ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ను, సెంథిల్ కుమార్ అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. వీరి నలుగురి పనితనం వలన సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఆశించిన భారీతనం ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తూ అబ్బుర పడేలా చేసింది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ మొదటి అర్థ భాగంలో డిజైన్ చేసిన వార్ సీన్, క్లైమాక్స్ లో ప్రభాస్, రానా ల మధ్య కంపోజ్ చేసిన భీభత్సమైన పోరాటం ఆకట్టుకుంది. నటీనటుల విషయానికి వస్తే అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ అద్భుతమైన నటనను కనపరిచాడు. అమరేంద్ర బాహుబలిగా రాజసాన్ని, మంచితనాన్ని, యుద్ధంలో వీరత్వాన్ని, అనుష్క సాన్నిహిత్యంలో ప్రేమను, ధర్మం కోసం తల్లినే ఎదిరించే కొడుకుగా తనలోని సంఘర్షణను చాలా బాగా వ్యక్తపరిచాడు. అలాగే ప్రస్తుతంలో దుష్టుడైన పెదనాన్నను పడగొట్టి, తల్లి పగను తీర్చి, తన తండ్రిని నమ్ముకున్న ప్రజలకు విముక్తి కలిగించే మహేంద్ర బాహుబలి అలియాజ్ శివుడి పాత్రలో కూడా వీరోచితమైన పెర్ఫార్మెన్స్ చూపించాడు .భల్లాదేవుని పాత్రలో రానా చాలా బాగా నటించాడు. ఒక స్వార్థపూరితమైన వ్యక్తిగా, బలవంతుడిగా అతని నటన, హావభావాలు చాలా రోజుల తర్వాత చెప్పుకోదగ్గ విలనిజం చూపించాయి. ప్రభాస్ తో ముఖాముఖి తలపడే సన్నివేశాల్లో, యుద్ధ సన్నివేశాల్లో రానా బల ప్రదర్శన, బాడీ లాంగ్వేజ్, ఉద్రేకపూరితమైన నటన చాలా బాగున్నాయి. కుంతలదేశపు యువరాణిగా అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ కట్టిపడేసింది. ఒక అందమైన, ఆత్మగౌరవం, చిన్నపాటి అహంకారం కలిగిన యువరాణిగా ఆమె నటన చాలా బాగుంది. ఆమె ప్రభాస్ తో కలిసి యుద్ధంలో పోరాడే సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి.రాజమాత శివగామి దేవిగా రమ్యకృష్ణ రెండవ భాగంలో కూడా ఆకట్టుకుంది. కనిపించే ప్రతి ఫ్రేములో రాజసం ఉట్టిపడేలా నటించారు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాల్లో అయితే తిరుగులేదనే స్థాయిలో నటించారు. కట్టప్ప పాత్రలో సత్యరాజ్ ఒదిగిపోయి నటించాడు. సినిమా ఆద్యంతం హీరోతో పాటే కీలకమైన సన్నివేశాల్లో కనిపిస్తూ మెప్పించాడు. మొదటి అర్థ భాగంలో ప్రభాస్ తో కలిసి మంచి హాస్యాన్ని కూడా పండించాడు. ఇక బాహుబలిని చంపే సన్నివేశంలో, చంపాక శివగామిదేవితో నిజం చెప్పే సన్నివేశంలో గొప్ప స్థాయి నటనను కనబర్చారు.తమన్నా పాత్ర ఇందులో చాలా పరిమితమైంది. ఇక అనుష్క బావ పాత్రలో సుబ్బరాజు కూడా మెప్పించాడు.”నువ్వు నా పక్కనుండేంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామ”…వంటి డైలాగ్స్ సందర్భానుసారం ఆకట్టుకుంటాయి – రాజేష్ |