‘మహానటి’ ఇప్పటివరకు పూర్తిస్థాయి బయోపిక్ చూసి ఎరుగని టాలీవుడ్ జనాలకు మంచి కిక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు పాపులర్ సినిమా తారల జీవిత చరిత్రలను పరిశీలిస్తున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఎన్టీఆర్‌పై మూవీ ఇప్పటికే సెట్స్‌పైకి వచ్చేసినా ఆయనను కేవలం సినిమా కోణంలో మాత్రమే చూడడం కుదరని పని. ఇక వైఎస్ఆర్, కెసిఆర్‌లపై కూడా బయోపిక్‌లను ప్రకటించారు. ఇప్పుడు మాత్రం ‘మహానటి’ సక్సెస్ చూసి తెలుగు ప్రేక్షకుల మన్ననలను పొందిన సౌందర్య జీవితాన్ని కూడా తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
హిట్ సినిమా ‘పెళ్లిచూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి ఆతర్వాత ‘మెంటల్ మదిలో’ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఆయన సౌందర్య జీవితాన్ని సినిమాగా మలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. కన్నడ భామ అయిన సౌందర్య టాలీవుడ్లో సూపర్ సక్సెస్ సాధించింది. రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టిన సౌందర్య ఓ ప్రచార సభకు వెళ్లే సమయంలో విమాన ప్రమాదానికి గురై మృతిచెందింది. సౌందర్య కథ కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించే సబ్జెక్టే. కాకపోతే ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఈ సినిమా కోసం అనుమతి తీసుకోవడమే కాస్త కష్టమైన విషయం. ఏది ఏమైనా తొందరలో మరికొన్ని సినిమా తారల జీవిత చరిత్రలు తెలుగు తెర పై చూసే అవకాశం ఉంది