“నటుడిగా వెండితెరకు పరిచయం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం రావడం నిజంగా అదృష్టం. షూటింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాన“ని అంటున్నాడు ‘బిగ్‌బాస్’ సీజన్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్.
ప్లేబ్యాక్ సింగర్‌గా పరిచయమైన ఈ కుర్రాడు ‘బిగ్‌బాస్ 3’ విజేతగా నిలిచాక.. నాలుగైదు వారాల నుంచి ‘యూట్యూబ్ స్టార్’గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ రాహుల్‌ను వెండి తెరకు పరిచయం చేస్తున్నారు. రాహుల్‌కు ఈ అవకాశం నిజంగా వరమే.కృష్ణవంశీ రూపొందిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిసి నటించే అరుదైన అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. రాహుల్ ఇప్పుడు నటుడిగా మారుతుండటంతో అటు అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు ట్విట్టర్‌లోనూ.. ఇటు ఇన్‌స్ట్రాగామ్‌లోనూ అభిమానులు ఈ ఆనందాన్ని పంచుకుంటున్నారు. రెండురోజుల నుంచి రాహుల్ సోషల్ మీడియాలో వెలిగిపోతున్నాడు.
అందరికంటే ముందున్నాడు
‘బిగ్‌బాస్–3’ విజేతగా నిలిచిన రాహుల్ రాత్రికిరాత్రే స్టార్‌గా మారిపోయాడు. గాయకుడిగా ఉన్నప్పుడు కొంతమంది అభిమానులనే కలిగివున్న రాహుల్‌కు బిగ్‌బాస్ తర్వాత లక్షలాదిగా అభిమానులు సొంతమయ్యారు. యూట్యూబ్‌లో అత్యధికంగా సెర్చ్ చేస్తున్న వారిలో రాహుల్ అందరికంటే ముందున్నాడు. నిన్న మొన్నటిదాకా ఓ సాధారణ గల్లీబాయ్‌గా తిరిగిన రాహుల్ ఇప్పుడు సెలబ్రిటీగా అందరి మన్ననలు పొందుతున్నాడు. పీపుల్స్‌ప్లాజాలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో తన పాటలతో అదరగొట్టాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో రాహుల్ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో రాహుల్ నటుడిగా తననుతాను నిరూపించుకుంటే అవకాశాలు మరింత మెరుగుపడతాయని అంటున్నారు.
ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా
కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని ఇన్‌స్ట్రాగామ్ వేదికగా రాహుల్ అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ అవకాశం రావడం నిజం తన అదృష్టంగా … రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్ లాంటి సీనియర్ నటులతో కలిసి నటించే అవకాశం రావడం తన జీవితంలో మరిచిపోలేనిదిగా రాహుల్ పేర్కొన్నాడు. షూటింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని, నటుడిగా వెండితెరకు పరిచయం అవ్వడం నిజంగానే ఆనందంగా ఉందని ..అందరి ఆశీస్సులు కావాలంటూ కోరుకుంటున్నాడు.