రాజకీయాలకు అతీతం.. నాది నిస్వార్థ సేవ !

“రాజకీయాల్లో చేరి సేవ చేయాల్సిన అవసరం తనకు లేదని, తాను ఏ పార్టీలో చేరే ప్రసక్తి లేద”ని రాఘవ లారెన్స్‌ స్పష్టం చేశారు. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్నారంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాఘవ లారెన్స్‌ ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ లు చేయించారు. లాక్‌డౌన్‌లో సినీ పరిశ్రమ లోని పలు విభాగాలకు కోట్లాది రూపాయలు విలువచేసే నిత్యావసర వస్తువులను, నగదు సహాయం చేశారు. అమ్మ క్యాంటీన్‌లో నిరుపేదలకు ఉచితంగా మూడు పూటలా భోజన సదుపాయం కూడా కల్పించారు. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు ఆర్థిక సాయం కూడా చేశారు. తాను నడుపుతున్న అనాథాశ్రమంలోని చిన్నారులకు వసతి, భోజన సదుపాయంతోపాటు వారి విద్యా సదుపాయాలకు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ సేవలన్నీ ..రాఘవా లారెన్స్‌ రాజకీయ ప్రవేశం చేయడానికే అని ఆరోపిస్తూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాఘవా లారెన్స్‌ సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా ట్విట్టర్‌లో తన సేవా కార్యక్రమాల ఉద్దేశం వెల్లడించారు…
“మానవసేవే మాధవ సేవ” అనే భావనతో నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, సినీరంగ ప్రముఖులు అంటూ పలువులు దాతలు ధన, వస్తు రూపంలో సాయమందిస్తుండటం వల్లే ఆ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతున్నానని చెప్పారు.. రాజకీయాల్లో చేరి సేవ చేయాల్సిన అవసరం తనకు లేదని, తాను ఏ పార్టీలో చేరే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. సినిమాల్లో నటించడం వల్ల వచ్చే పారితోషికంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నానని.. తాను అడిగినవెంటనే పలువురు దాతలు విరాళాలిచ్చి తనను ప్రోత్సహిస్తున్నారని,
ఆయన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు .
 
తమిళంలో లారెన్స్ హీరోగా ‘రంగస్థలం’
రామ్ చరణ్ కథానాయకుడిగా, సమంత హీరోయిన్‌గా నటించిన ‘రంగస్థలం’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో 1980 నాటి బ్యాక్ డ్రాప్‌తో సుకుమార్‘రంగస్థలం’ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా రామ్ చరణ్ చెవిటివాడిగా నటించిన తీరు..మరోవైపు రామలక్ష్మి పాత్రలోసమంత నటన..ఈ చిత్రంలో హై లైట్. ఇపుడీ చిత్రాన్ని తమిళంలో లారెన్స్ హీరోగా రీమేక్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
హీరోయిన్‌గా నిక్కీ గల్రానీ నటించబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ రీమేక్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్వతహాగా దర్శకుడు అయిన లారెన్స్ రాఘవ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడా? వేరే వాళ్ల దర్శకత్వంలోచేస్తాడా? అనేది చూడాలి. మరి స్వతహాగా మంచి నటుడైన లారెన్స్ .. తమిళంలో ఈ పాత్రను ఎలా పోషించబోతున్నాడనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక రాఘవ లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కించిన హిందీ చిత్రం ‘లక్ష్మీ బాంబ్’ త్వరలో హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది.