‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’ మన దేశంలోకి వస్తోంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా తీసే విధానం మారుతూ వస్తోంది. గ్రాఫిక్స్ మాయాజాలం చూశాం. 3డీ సినిమాలు వచ్చాయి. లైవ్ యాక్షన్ టెక్నాలజీతో సినిమాలు వచ్చాయి. మారుతున్న సాంకేతికత, ప్రేక్షకుడి అభిరుచి..సినిమాను కొత్త విధానాలు అనుసరించేలా చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’తో మన దేశంలో సినిమా రూపొందనుంది.
ఏంటీ వర్చువల్ ప్రొడక్షన్?
నిజమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించలేనప్పుడు గ్రీన్ మ్యాట్ (గ్రీన్ స్క్రీన్) ఉపయోగించి చిత్రీకరణ జరుపుతారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా అక్కడే (నిజమైన లొకేషన్‌లో) చిత్రీకరించినట్టు మారుస్తారు. ప్రస్తుతం సినిమాల్లో కొన్ని సన్నివేశాలను ఇలానే తీస్తున్నారు. దీనితో వచ్చిన చిక్కేంటి? అంటే పోస్ట్ ప్రొడక్షన్ అయ్యే వరకు ఆ సన్నివేశం ఎలా వస్తుందో ఎవ్వరికీ పక్కాగా తెలియదు.వర్చువల్ ప్రొడక్షన్ విషయానికి వస్తే.. సినిమా మొత్తం స్టూడియోలోనే పూర్తి చేయొచ్చు. ఇది పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది పెద్ద ప్లస్ పాయింట్. లొకేషన్స్ కోసం అటూ ఇటూ తిరిగే పని పూర్తిగా తగ్గిపోతుంది. నటీనటులందరూ గ్రీన్ మ్యాట్ ముందే నటిస్తారు. 3డీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల నిజమైన లొకేషన్‌లో ఉన్నభావన కలుగుతుంది. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడే సీన్ ఎలా ఉండబోతోందో దర్శకుడు మానిటర్ లో చూసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్‌తో పెద్దగా పని ఉండదు. ఈ టెక్నాలజీ వల్ల వినూత్న కథలకు మరింత ఆస్కారముంటుంది.
‘అవతార్’ పండోరా గ్రహం అదే!
ఆల్రెడీ హాలీవుడ్‌లో ‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’తో సినిమాలు తెరకెక్కుతున్నాయి కూడా. జేమ్స్ కామెరూన్ ఈ టెక్నాలజీని ఉపయోగించే ‘అవతార్’ని (2019) సృష్టించగలిగారు. ఈ సినిమాను మొత్తం వర్చువల్ ప్రొడక్షన్ ఉపయోగించే పూర్తి చేశారు. ఈ చిత్ర కథాంశం ‘పండోరా’ అనే గ్రహంలో జరుగుతుంది. అదంతా ఊహాజనిత ప్రదేశం. దానికి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్స్ కూడా ఈ టెక్నాలజీతో పాటు మరింత సాంకేతికతతో తెరకెక్కుతున్నాయి. ఇదే టెక్నాలజీతో ‘లయన్ కింగ్’, ‘రెడ్ ప్లేయర్ వన్’ వంటి చిత్రాలు తెరకెక్కాయి.
తొలి భారతీయ చిత్రం !
మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రాన్ని పూర్తిగా ‘వర్చువల్ ప్రొడక్షన్’ పద్ధతిలో చిత్రీకరించనున్నట్టు ప్రకటించారు.ఈ పద్ధతిలో తెరకెక్కనున్న పూర్తి స్థాయి తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి కాన్సెప్ట్–డైరెక్షన్ గోకుల్ రాజ్ భాస్కర్. టైటిల్ ఇంకా ప్రకటించని ఈ చిత్రం 5 భాషల్లో (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) విడుదల కానుంది. ‘‘సినిమాలు తెరకెక్కించడంలో ఇదో కొత్త చాప్టర్. పరిస్థితులు మారుతున్నప్పుడు, కొత్త ఛాలెంజ్‌లు ఎదురవుతున్నప్పుడు మనం కూడా కొత్త పద్ధతులను అనుసరించాలి. ఈ కథ త్వరగా మీ అందరికీ చెప్పాలనుంది’’ అని పేర్కొన్నారు పృథ్వీరాజ్. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.