ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రాజశ్రీ ఫిల్మ్స్ అధినేత రాజ్‌కుమార్ బర్జాత్యా కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజశ్రీ పిక్చర్స్ స్థాపించిన తారాచంద్ బర్జాత్యా తనయుడే రాజ్‌కుమార్ బర్జాత్యా. ఆయనకు భార్య సుధ, తనయుడు సూరజ్ బర్జాత్యా ఉన్నారు. సూరజ్ బర్జాత్యా దర్శకుడిగా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సల్మాన్‌తో ‘మైనే ప్యాక్ కియా’, ‘ప్రేమ్ రతన్ థన్ పాయో’, ‘హమ్ అప్కే హై కౌన్’తోపాటు ‘హమ్ సాథ్ హై’, ‘వివాహ్ ‘, ‘దోస్తీ’, ‘తపస్యా’, ‘సారాన్ష్’ వంటి తదితర ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు.
సల్మాన్ హీరోగా వచ్చిన ‘మైనే ప్యాక్ కియా’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘హమ్ అప్కే హై కౌన్’ చిత్రాలను తనయుడు సూరజ్ దర్శకత్వంలో నిర్మించడం విశేషం. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. అంతేకాదు సల్మాన్‌ని తిరుగులేని స్టార్‌గా నిలబెట్టాయి. సినిమానే కాదు టెలివిజన్ రంగంలోనూ రాజ్‌కుమార్ బర్జాత్యా తనదైన ముద్ర వేశారు. ప్రముఖ హిందీ ఛానెల్స్‌లో రాజ్ కుమార్ నిర్మించిన పలు సీరియల్స్ ప్రసారమై బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. ఈ బ్యానర్లో వచ్చిన చివరి చిత్రం ‘హమ్ చార్’ ఇటీవల విడుదలైంది. దీంతోపాటు త్వరలో తనయుడు సూరజ్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా ఓ సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేశారు. రాజ్‌కుమార్ బర్జాత్యా మృతి పట్ల సల్మాన్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.