“పర్పుల్ పెబ్బెల్ ప్రొడక్షన్స్” పతాకంపై ప్రియాంక చోప్రా నటిగానే కాదు నిర్మాతగానూ తన అభిరుచి చాటుకుంటోంది . ప్రాంతీయ భాషల్లో ఇప్పటికే ఆమె పలు సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం కొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. “మహిళా సాధికారత” కోసం చెప్పే ప్రియాంక … చేతల్లో కూడా చూపుతోంది . తన పుట్టినరోజును పురస్కరించుకుని తన పర్పుల్ పెబ్బెల్ ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేసే ఉద్యోగినులకు బంపర్ బోనాంజా ప్రకటించారు. మహిళలకు ప్రత్యేక పనిదినాలను నిర్ణయించారు.
ఆ వివరాలను ప్రియాంక తల్లి మధు చోప్రా వెల్లడించారు. … “మా సంస్థలో ఎనభై శాతం మంది పెళ్లైన మహిళలే ఉన్నారు.వారి ఆలోచనలు, అభిప్రాయాలకు మేం విలువ ఇవ్వాలి. వారి ఇష్టాలకు చేసే వృత్తి అడ్డుకాకూడదు. అందుకే వారికి అనుకూలంగా పనివేళల్లో మార్పులు చేశాం. తల్లులకు ప్రత్యేకమైన పనివేళలు నిర్ణయించాం. వారికి కొంత రిలీఫ్నిచ్చాం. అంతే కాదు … పన్నెండు వారాల పాటు ప్రసూతి సెలవులతోపాటు కొంత నగదు కూడా అందించనున్నాం. ఈ నిర్ణయం ప్రియాంకదే. అయితే అంతిమ నిర్ణయం కంపెనీలోని సీనియర్లు తీసుకుంటారు” అని వెల్లడించారు. ప్రియాంక నటించిన హాలీవుడ్ చిత్రాలు ‘ఏ కిడ్ లైక్ జేక్’, ‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్?’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. రెండేండ్ల గ్యాప్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ… సల్మాన్ సరసన ‘భారత్’ చిత్రంలో నటిస్తోంది . సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందబోయే ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రానికి సైన్ చేసింది .
మోటివేషనల్ స్పీకర్ ‘అయేషా చౌదరి’ తల్లిగా …
ప్రియాంక చోప్రా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. రెండేండ్లు హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడిపిన బాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తూ ఇప్పటికే సల్మాన్ సరసన ‘భారత్’ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఆమె సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో చేస్తోంది . ‘ది స్కై ఈజ్ పింక్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోగా తొలుత అభిషేక్ బచ్చన్‌ను అనుకున్నారు. కానీ ఆ స్థానంలో ఫర్హాన్ అక్తర్ చేరారు. దీంతో ఫర్హాన్ అక్తర్ సరసన ప్రియాంక కథానాయికగా నటిస్తోంది . గతంలో ప్రియాంక, ఫర్హాన్ ‘దిల్ ధడ్కనే దో’ చిత్రంలో నటించారు.
ఇందులో ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ఫేమ్ జైరా వసీమ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె ఫర్హాన్ అక్తర్, ప్రియాంకల కూతురు పాత్రలో నటిస్తోంది . ఈ చిత్రం ఆగస్ట్‌లో పట్టాలెక్కనుంది. పదమూడు ఏండ్ల అతి తక్కువ వయసులో మోటివేషనల్ స్పీకర్‌గా రాణించిన ‘అయేషా చౌదరి’ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పల్మోనరీ ఫైబ్రోసిస్ వ్యాధితో బాధపడుతూ ఆమె 2015లో కన్నుమూసింది .