కన్నుగీటే సీన్‌లో ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రంతో రాత్రికి రాత్రే జాతీయస్థాయిలో పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఈమె త్వరలోనే తెలుగులోనూ నితిన్, చంద్ర శేఖర్ ఏలేటి చిత్రంలో నటించనుంది. మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రియా వారియర్‌కు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 7.2 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. లాక్‌డౌన్ టైమ్‌లో సినీతారలందరూ సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ వీడియోల ద్వారా సంభాషిస్తూ అనేక సంగతుల్ని పంచుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా ఈ కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం తన ‘ఇన్‌స్టాగ్రామ్’ ఎకౌంట్‌ను డియాక్టివేట్ చేసి అందరిని విస్మయానికి గురిచేసింది. దీంతో ప్రియా వారియర్ సోషల్ మీడియాకు బై బై చెప్పేసిందని అందరూ అనుకున్నారు. అయితే ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెడుతూ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇన్‌స్టాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మానసిక ప్రశాంతత కోసం ఇన్‌స్టా నుండి కాస్త బ్రేక్ తీసుకున్నానని ఆమె చెప్పింది…
“లాక్‌డౌన్ అప్పటి నుండి నాలో ఒత్తిడి పెరిగిపోయింది. సోషల్‌మీడియాలో అభిమానుల ప్రశంసలు, విమర్శలు, అనవసరమైన కామెంట్స్.. అయోమయ పరిస్థితి ఎదురైంది. వీటి నుంచి బయటపడి.. మనశ్శాంతిని వెతుక్కోవాలని ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నా.ట్రోల్స్ ఈ రేంజ్‌లో వస్తాయని ఊహించలేదు.
నా వ్యక్తిగత కారణాలతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి నిష్క్రమించాను. ఎవరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరనుకున్నా. కానీ సోషల్‌మీడియాలో వచ్చిన ట్రోల్స్, పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా ట్రోల్స్, మీమ్స్ నన్ను బాగా ఇబ్బందిపెట్టాయి. నా పర్సనల్‌లైఫ్ మీద ఇతరులకు ఎందుకింత ఆసక్తి అనిపించింది. భవిష్యత్తులో కూడా నాకు నచ్చకపోతే సోషల్‌మీడియా నుంచి తప్పుకుంటా.
విమర్శలే గాయపరుస్తాయి!
అభిమానుల నుంచి వస్తున్న ట్రోల్స్ తట్టుకోలేకనే అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశానని ప్రచారం చేశారు. అందులో వాస్తవం లేదు. నాకు ట్రోల్స్, విమర్శలు కొత్తకాదు. హాస్యాన్ని పంచుతూ పాజిటివ్ మైండ్‌సెట్‌తో చేసే ట్రోల్స్‌ని నేను సరదాగా స్వీకరిస్తా. హద్దులుదాటిన విమర్శలే హృదయాన్ని గాయపరుస్తాయి.
ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో తెలియని అస్థిరత చోటుచేసుకుంది. ఇలాంటి సంక్షుభిత స్థితిలో ..అందరి అటెన్షన్ పొందే ఉద్దేశ్యంతో నేను సోషల్‌మీడియా నుంచి తప్పుకున్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. అన్నింటికంటే ఈ విమర్శలే నన్ను ఎక్కువగా బాధించాయి.నన్ను పొగడకున్నా ఫర్వాలేదు. రెండు మంచి మాటలతో ప్రోత్సహిస్తే చాలు.
లాక్‌డౌన్ వల్ల మూడునెలలుగా ఇంట్లోనే ఉంటున్నా. భవిష్యత్తులో కెరీర్ ఎలా ఉంటుందో? కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో? జీవితం పూర్వంలా ఉంటుందా? అనే సందేహాలు నన్ను నిలవనీయడం లేదు. నా వయసులో ఉండే ప్రతి అమ్మాయికి ఇలాంటి సంశయాలు ఉండటం సహజం. ‘ఒక్క కన్నుగీటు’తో దేశమంతా నా గురించే మాట్లాడుకుంది. చిన్న వయసులో వచ్చిన గుర్తింపు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దాని తాలూకు ఒత్తిడి తప్పకుండా ఉంటుందని అర్థం చేసుకోవాలి”