ప్రభాస్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ మూడవ దశను ప్రారంభిస్తూ తన నివాసంలో ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి మూడు మొక్కలు నాటి మూడో దశ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు శ్రీకారం చుట్టారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ “పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశకు చేరుకుంది. ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ..రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం ఉన్నతమైన విలువలతో కూడుకున్నదని… “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్యక్రమం నన్ను ఇన్ స్పైర్ చేసిందన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ స్పూర్తితో ఆయన ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నానని ప్రభాస్ వెల్లడించారు. ఎంపీ సంతోష్ కుమార్ మహోన్నతమైన ఆశయం ముందుకు పోవాలంటే..మనమంతా వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజం బావుంటుందని నా భావన. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో నా అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం కొనసాగింపుగా రాంచరణ్, దగ్గుబాటి రానా, శ్రద్ధా కపూర్ ను “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు నామినేట్ చేస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు.