ఇటలీ ని హైదరాబాద్ తెచ్చేస్తున్నారు !

ప్రభాస్‌ సినిమా జార్జియా షెడ్యూల్‌ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘ఓ డియర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. జార్జియా షెడ్యూల్‌ తర్వాత కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. యూరప్‌ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ షూటింగ్‌ కొంత భాగం ఇటలీలో జరగాల్సి ఉంది. ఆల్రెడీ ఈ సినిమాకు చెందిన కొన్ని సన్నివేశాలను కూడా ఇటలీలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఇటలీలో కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై కూడా ఆయా ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. లాక్‌డౌన్‌ తర్వాత ఇటలీ షెడ్యూల్‌ కొనసాగించాలన్నా అన్నీ సమకూరుతాయా? అనే సందేహం చిత్రబృందంలో ఉంది. అందుకని, ఇటలీ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే జరపాలనుకుంటున్నారట.లాక్‌డౌన్‌ తర్వాత హైదరాబాద్‌లోనే ఇటలీ సెట్‌ వేసి, చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ ఇటలీ లొకేషన్స్‌ డిజైన్స్, సెట్‌ వర్క్‌ పై ఇప్పటికే పని ప్రారంభించారని తెలిసింది.
 
టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ బేస్డ్‌
ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో పలు భాషల్లో రూపొందబోయే పాన్‌ ఇండియా చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తికి … టాలీవుడ్‌ సర్కిల్స్‌లో ఓ ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. ఇదొక టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రమని..గతంలో వచ్చిన ‘ఆదిత్య 369’, బాలీవుడ్‌లో వచ్చిన ‘యాక్షన్‌ రీప్లే’ సినిమాల తరహాలో ఉంటుందని సోషల్‌ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ సినిమా షూటింగ్‌ను మొదట ఈ ఏడాది ఆఖర్లో మొదలు పెట్టాలని, అప్పటివరకు ప్రీ ప్రొడక్షన్‌కి సంబంధించిన వర్క్‌ మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్‌ చేసినా… కరోనా ఎఫెక్ట్‌తో వారి ప్లాన్‌ అంతా అప్‌సెట్‌ అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్‌ స్టార్ట్‌ చెయ్యబోయే ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా దీపికా పదుకొనెను ఎంపిక చేసే యోచనలో మేకర్స్‌ ఉన్నారని తెలుస్తోంది.