జపాన్ తో సహా పలుచోట్ల భారీస్థాయి విడుదలకు ‘సాహో’

‘బాహుబలిః ది కంక్లూజన్’ విడుదలై ఈనెల 28వ తేదీతో రెండేళ్లు పూర్తవుతుంది. ఈ చిత్రం తర్వాత  హీరో ప్రభాస్ నెక్స్ సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. ప్రస్తుతం అతను చేస్తున్న ‘సాహో’ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో షూటింగ్ కోసం ఎక్కువ సమయం పడుతోంది. ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్‌కు తగ్గకుండా ఉండే సినిమాను ప్రేక్షకులు ప్రభాస్ నుండి ఆశిస్తారనే ఉద్దేశంతో యువి క్రియేషన్స్ వారు ఏవిధంగానూ రాజీ పడకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక రిలీజ్ కూడా అదే స్థాయిలో ఉండబోతోందట.త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సుజిత్‌ దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉన్నాయి. యాక్షన్‌ డైరెక్టర్‌ కెన్నీ బేట్స్‌ వాటిని కంపోజ్‌ చేశారు. అయితే వీటిలో ప్రభాస్‌ ఎలాంటి డూప్‌ లేకుండా నటించారట. కారు, బైక్‌ ఛేజింగ్‌, రెయిన్‌, డస్ట్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ని ప్రభాస్‌ స్వయంగా చేశారు. సన్నివేశాల్లో సహజత్వం కోసమే ప్రభాస్‌ ఇదంతా చేశారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌ 15న విడుదల కానుంది. టి సిరీస్ వారు హిందీ వర్షన్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకున్నారు. రిలీజ్ కూడా భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
 
ఇదిలాఉండగా ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు జపాన్‌లో భారీగా ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే జపాన్‌లో ఉన్న ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ‘సాహో’ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్నారు. జపాన్‌లోని అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే జపాన్‌లో ఆగస్టు 15న కాకుండా మూడు వారాలు ఆలస్యంగా ఈ సినిమా విడుదలవుతుందని తెలిసింది. అంతేకాకుండా జపాన్‌లో భారీ ప్రమోషన్స్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా టోక్యోలో జరిగే ప్రమోషనల్ ఈవెంట్‌కు ప్రభాస్ స్వయంగా హాజరయ్యే అవకాశం ఉందని తెలిసింది.
ప్లే బాయ్ గా.. నిజాయితీగల ప్రేమికుడిగా..
తెరపై ఒక్క ప్రభాస్‌ని చూస్తేనే అభిమానులు ఊగిపోతారు. అలాంటిది ఇద్దరు ప్రభాస్‌లని ఒకే తెరపై, ఒకేసారి చూస్తే…? అలాంటి కనువిందుని మూడోసారి ఇచ్చేందుకు ప్రభాస్‌ సిద్ధమవుతున్నారు. ఆయన మూడోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. గతంలో ‘బిల్లా’, ‘బాహుబలి’లో ద్విపాత్రాభినయం చేసి మంత్రముగ్ధుల్ని చేశారు. ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ డబుల్‌ రోల్‌లో మెస్మరైజ్‌ చేయనున్నారట. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా, 1960కాలం నాటి పీరియాడికల్‌ ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నారంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఓ పాత్రలో ప్లే బాయ్ గా, మరో పాత్రలో నిజాయితీగల ప్రేమికుడిగా కనిపిస్తారట. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌పై సినిమా తెరకెక్కుతోంది. దీనికి ‘జాన్‌’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట.