ప్రభాస్… ‘బాహుబలి’ ద్వారా దేశ, విదేశాల్లో వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకునేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ తరం స్టార్ హీరోలు నటనతో పాటుగా వ్యాపారాలపై కూడా దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన బిజినెస్‌లపై ఫోకస్ పెడుతున్నారు. ప్రభాస్ ను తీసుకుంటే.. యువి క్రియేషన్స్ బ్యానర్ ప్రభాస్ హోమ్ బ్యానర్‌లాంటిది. ఇప్పటికే సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌గా ఇది పేరు తెచ్చుకుంది. ‘బాహుబలి’ ద్వారా ప్రభాస్‌కు దేశ, విదేశాల్లో వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకునేలా తన నెక్స్ రెండు సినిమాలు యువి బ్యానర్లోనే తెరకెక్కుతున్నాయి. ఇక సినిమాల నిర్మాణంతో ఆగకుండా డిస్ట్రిబ్యూషన్లో కూడా దిగి ఇతర సినిమాలను యువి వారు పంపిణీ చేస్తున్నారు. ఇంతటితో ప్రభాస్ ఆగడం లేదట. ప్రస్తుతం సినిమాల విడుదల కోసం థియేటర్స్‌కు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో థియేటర్స్పై పట్టు ఉండడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకొని థియేటర్స్ బిజినెస్‌లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడట ఈ స్టార్ హీరో. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను కొని వాటిని అత్యాధునిక సౌకర్యాలతో రీమోడలింగ్ చేసే ప్లాన్‌లో ఉన్నారట యువి క్రియేషన్స్ వారు. త్వరలో తమ చేతిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని పాత థియేటర్లను ఎంచుకుని.. వాటిని సరికొత్తగా చేయబోతున్నారట ప్రభాస్ అండ్ టీమ్. ఇప్పటికే ఈ విధంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఓ భారీ మల్టీప్లెక్స్‌ను సిద్ధం చేస్తున్నారట. ఈ మల్టీప్లెక్స్‌లో 106 అడుగుల భారీ స్క్రీన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్క్రీన్ ఇదే కాబోతుందట. ఇప్పటికే మహేష్‌బాబు మల్లిప్లెక్స్ చైన్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు.ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏసియన్ ఫిల్మ్స్‌తో కలసి థియేటర్స్ చెయిన్‌ను ప్రారంభించాడు.ఇప్పుడు మహేశ్ బాటలో థియేటర్స్ బిజినెస్ లోకి ఎంటరవుతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.
ముందుగా రామ్‌చరణ్ కోసం అనుకున్నారట
బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం షూటింగ్ దశలోఉంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ కాబట్టి అది ఈ స్టార్ హీరోకు హోమ్ బ్యానర్లాంటిదని భావించవచ్చు. ‘సాహో’ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేసే సినిమా కూడా యువి బ్యానర్లోనే తెరకెక్కాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు చెందిన గోపీకృష్ణ బ్యానర్ కూడా ప్రొడక్షన్ పార్ట్నర్గా తోడైంది. అయితే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌తో గోపీకృష్ణ బ్యానర్లో ఒక సినిమా చేయాలని కృష్ణంరాజు ప్లాన్ చేశాడట. కానీ ఆ సినిమా ఆలస్యమవుతుండడంతో ప్రభాస్ ఈ కొత్త సినిమాకు యువి వారితో పాటుగా తన పెదనాన్న బ్యానర్‌ను కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండేలా మార్చాడట. దీంతో కృష్ణంరాజు కోరిక తీరినట్టు అవుతుందని అలా ప్లాన్ చేశాడట. ఈ సినిమా కొద్ది రోజుల క్రితమే పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా గురించి మరొక ఆసక్తికరమైన విషయం కూడా వినిపిస్తోంది. ఈ స్టోరీని ముందుగా యువి వారు రామ్‌చరణ్ కోసం అనుకున్నారట. కానీ ఎందుకో కుదరకపోవడంతో చివరికి ప్రభాస్‌కు తగ్గట్టుగా కథను మార్చారని సమాచారం.