ప్రభాస్ ‘సాహో’… ఓ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇంకా సినిమానే రిలీజ్ కాలేదు అప్పుడే రికార్డ్ బ్రేకా అనుకుంటున్నారా? ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా చేస్తున్న కమల్ కణ్ణన్ అలానే అన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ ఏ సినిమాకీ చేయనటువంటి విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్‌ని ఈ సినిమాకి చేస్తున్నామని కమల్ పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం ఈ ఏడాది పంద్రాగస్టుకు విడుదల కానుంది.
‘సాహో’ విజువల్ ఎఫెక్ట్స్ గురించి పేర్కొన్న కమల్ కన్నన్ ప్రభాస్ 20వ సినిమా గురించి కూడా ఓ హింట్ ఇచ్చారు. ‘‘ప్రభాస్ ‘జాన్’ క్లైమాక్స్ గురించి 2019 ఆరంభంలో చెప్పి తీరాల్సిందే’’ అన్నారు కమల్. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. అంటే.. ముందు క్లైమాక్స్ చిత్రీకరించి ఉంటారేమో. ఆ సంగతలా ఉంచితే.. ఇక్కడ కమల్ కన్నన్ ‘జాన్’ అన్నారు కాబట్టి… ప్రభాస్ 20వ సినిమాకి ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారనిపిస్తోంది. ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ కె. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
యూరోప్‌లో వింటేజ్ కార్ల వ్యాపారిగా
బాహుబలి తరువాత మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాటు మరో షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్రపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ యూరోప్‌లో వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపించనున్నాడట. ఓ కారు అమ్మే విషయంలో జరిగిన సంఘటనతోనే సినిమా కథ మలుపు తిరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ పెదనాన్న, ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు గోపి కృష్ణమూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.