పూజాహెగ్డే సౌత్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్స్‌లో ఒకరు. వరుసగా టాప్ స్టార్స్ అందరితో జోడీ కడుతున్నారు. బాలీవుడ్లో ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా పూర్తి చేశారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తేంటంటే… బాలీవుడ్ ‘బడా ప్రొడక్షన్ హౌస్ నడియాడ్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్’తో ఆమె మూడు సినిమాల డీల్ కుదుర్చుకున్నారట. ‘జుడ్వా’, ‘హౌస్‌ఫుల్ 2’ ‘స్టేట్స్’, ‘కిక్’, ‘భాగీ’ చిత్రాలను నిర్మించిన సాజిద్ నడియాడ్వాలా ఈ మూడు చిత్రాలను భారీ లెవెల్లో నిర్మించనున్నారట.
‘హౌస్‌ఫుల్4’ తర్వాత ఓ యాక్షన్ సినిమాను ఈ బ్యానర్లో పూజా హెగ్డే చేయబోతున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం రెండు నెలల భారీ డేట్స్ కూడా ఇచ్చారట. ఇందులో ఎన్నో స్టంట్స్ ఉండబోతున్నాయని, వాటిని పూజా స్వయంగా చేయబోతున్నారని తెలిసింది. యాంజెలీనా జోలీ నటించిన హాలీవుడ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ‘టూంబ్ రైడర్’ తరహాలో ఈ చిత్రకథ సాగనుందట. త్రీ మూవీస్ డీల్‌లో భాగంగా చేసిన సినిమాలు సక్సెస్ అయితే పూజ బాలీవుడ్‌లోనూ టాప్ లిస్ట్‌లో నిలబడడం ఖాయం.
కొత్త కోణంలో చూడటం నా అలవాటు !
విజయాలూ, వైఫల్యాలు.. రెండూ స్వల్పకాలికమే కాబట్టి వాటికి అతీతమైన ప్రయాణాన్ని తాను ఇష్టపడతానుఅంటోంది పూజా హెగ్డే. తెలుగుతో పాటు హిందీలోనూ అవకాశాల్ని అందుకొంటున్న నాయిక ఈమె. ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తోంది. జీవితంలో ప్రతి విషయాన్నీ ఓ కొత్త కోణంలో చూడటం తన అలవాటు అంటోంది పూజ. మీకు అంత సులభంగా విజయాలు దక్కలేదు కదా అని అడిగితే… ‘‘విజయం అనేది ఎప్పుడూ నెమ్మదిగానే వస్తుంది. కానీ అది అందించే రుచే వేరు. నేనూ విజయం కోసం ఆత్రుతగా ఎదురు చూసినదాన్నే. కానీ అది చేతికందాక నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఒక విజయాన్ని మహా అంటే పది రోజులు ఆస్వాదిస్తామేమో, అదే చేస్తున్న పనిపై ప్రేమ, ఇష్టం ఉంటే రోజూ ఆస్వాదించొచ్చు అనిపించింది. అప్పట్నుంచీ ప్రయాణం మరింత ఆనందకరంగా మారింది. పని చేయడమే తప్ప ఫలితం గురించి ఇప్పుడు నాకు బెంగ లేదు’’ అని చెప్పింది పూజాహెగ్డే.