తప్పుల నుంచి నేర్చుకునే.. ఇప్పుడు సినిమాల ఎంపిక!

“కెరీర్‌ ప్రారంభంలో పాత్రల విషయంలో నేను చాలా తప్పులు చేశాను. మన పనిలో తప్పులు చేస్తున్నామంటే దానర్థం.. త్వరలోనే కొత్త విషయాలను నేర్చుకోబోతున్నామని . దీన్ని నేను పూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే కెరీర్‌ ప్రారంభంలో పాత్రల ఎంపిక విషయంలో నేను చాలా తప్పులు చేశాను. ఆ తప్పుల నుంచి నేర్చుకున్న కొత్త విషయాల వల్లే ఇప్పుడు క్వాలిటీ పాత్రలను, సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాను” అని అంటోంది పూజా హెగ్డే.
‘చేయగలను’ అనిపిస్తేనే…
పూజా హెగ్డే ‘దువ్వాడ జగన్నాధం’, ‘మహర్షి’, ‘అరవిందసమేత వీర రాఘవ’, ‘అల వైకుంఠపురములో’ అంటూ ఇటీవల తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు స్టార్ హీరోలందరి చూపు ఆమె పైనే. పూజా హెగ్డే చేసిన సినిమాలు తక్కువే అయినా దక్షిణాదిన అందరి దృష్టి తన వైపుకు తిప్పుకున్న పూజా హెగ్డే…. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడానికి సిద్ధమే కానీ, అది ఇప్పుడే కాదంటోంది .
‘‘లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడం నాకూ ఇష్టమే. ఒక నటిగా మరో కోణంలో అవి నన్ను చూపిస్తాయి. ఓ సినిమా వచ్చింది కానీ, నాకు నచ్చలేదు. నాకు నచ్చి ‘చేయగలను’ అనిపిస్తే.. చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయితే, అలాంటి సినిమాలు చేయడానికి ఇంకా సమయముంది. కొంత వయస్సు అయిపోయిన తరువాత ఎలాగూ లవర్ పాత్రలు చేయలేను. లవర్‌ పాత్రలు, గ్లామర్‌ పాత్రలు ఇప్పుడు మాత్రమే చేయగలను. అందుకే సీరియస్‌ పాత్రల వైపు ఇప్పుడప్పుడే దృష్టి పెట్టదలుచుకోలేదు. అయినా నేను చేసే సినిమాల్లో నాకు ఎంతో కొంత ప్రాధాన్యత ఉంటుందనే చేస్తున్నాను..’’ అని పూజా హెగ్డే చెప్పింది.
 
ప్రస్తుతం ప్రభాస్‌ ‘ఓ డియర్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) లో , అఖిల్‌కి జోడీగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో, అలాగే బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ కాంబినేషన్‌లో ‘కభీ ఈద్‌ కభీ దివాలి’ చిత్రాల్లో నటిస్తోంది. లాక్‌డౌన్‌ అనంతరం ఈ చిత్రాల షూటింగ్‌తో పూజా బిజీ బిజీగా గడపనుంది.
 
సల్మాన్‌తో చేయబోయే ‘కభీ ఈద్‌ కభీ దివాలి’ షూటింగ్‌ కోసం పూజా ఆసక్తిగా వెయిట్‌ చేస్తోందట…”సల్మాన్‌తో పని చేయడమంటే మనలోని టాలెంట్‌కు ఇంకొంచెం మెరుగులు దిద్దుకోవాలని అర్థం. ఆయనకు ఎంతో అనుభవం ఉంది. దీంతో కొంచెం భయపడుతున్నాను. అగ్ర నటీనటులతో నటించే సమయంలో ఇలాగే ఉంటుందేమో. అయితే నటనలో మరిన్ని పాఠాలు నేర్చుకోవడానికి మాత్రం ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నా. ఈ కథ చాలా ఫన్నీగా ఉంటుంది” అని పూజా తెలిపింది.ఇదిలా ఉంటే, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో స్టాండప్‌ కమెడియన్‌గా పూజా ప్రేక్షకుల్ని నవ్వించనున్నట్టు సమాచారం. స్టాండప్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో హీరోయిన్‌ క్యారెక్టర్‌ రావడం మన తెలుగులో ఇదే తొలిసారి కావడం విశేషం.