‘ప్రేమ’ చాలా బలమైనదని నా నమ్మకం. ప్రేమతో ఏం చేసినా మనసుకి బాగుంటుంది. ఎప్పుటి నుంచో చారిటీ చేస్తున్నా.. ఫౌండేషన్ ద్వారా చేస్తే ఇంకా బాగా చేయొచ్చనిపించింది. అందుకే ‘ఆల్ అబౌట్ లవ్’ ఆరంభించాను. చిన్నప్పుడు చాలామంది సేవా కార్యక్రమాలు చేయడం చూసి, ‘పెద్దయ్యాక మనం కూడా చేయాలి’ అని ఫిక్స్ అయ్యాను. సొసైటీకి తిరిగి ఇవ్వాలనుకున్నాను. ఈసారి నా బర్త్‌డేకి నా ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు చేస్తే, నేను సంతోషడ్డాను. ఎంతైనా చేయాలని నిర్ణయించుకున్నాను. సంపాదించుకుంటూ.. అందులో కొంత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళితే ఆత్మతృప్తి దక్కుతుంది… అని చెప్పింది అందాల నాయిక పూజాహెగ్డే ‘ఆల్ అబౌట్ లవ్’ ఫౌండేషన్ ద్వారా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అడిగినపుడు.
‘లక్కీ చార్మ్’ అనే మాట కొన్నిసార్లే బావుంటుంది!
ఇంత ప్రేమను ఇస్తున్న ఫ్యాన్స్.. మంచి పాత్రలు ఇస్తున్న దర్శక నిర్మాతలు దొరకడం నా ‘లక్’ అని అనుకుంటాను. ఏ సినిమా చేసినా అది పెద్ద హిట్ అవ్వాలని శాయశక్తులా కృషి చేస్తాను. అయితే లక్కీ చార్మ్ ట్యాగ్ లేకపోయినా సినిమా రిలీజ్‌కు ముందు నాకు టెన్షన్ ఉంటుంది. నేను చేసే ప్రతి సినిమా నాకు ముఖ్యమే. అలాగే లక్కీ చార్మ్ అనేది ఫస్ట్ కొన్నిసార్లే బావుంటుంది. ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే లక్. ఐదోసారి ఆరోసారి కూడా హిట్స్ సాధిస్తే అది కేవలం లక్ కాదు. సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోవడమే కారణం. కథ విన్నాక, ఈ సినిమా చేసే తీరాలనిపిస్తే చేసేస్తాను. అలా ధైర్యంగా నమ్మి చేసిన సినిమాలు విజయం సాధించాయి. నేను వదులుకున్న కొన్ని సినిమాలు సరిగ్గా ఆడలేదు. నమ్మిన సినిమాలు హిట్టవడంతో నా జడ్జిమెంట్ మీద నమ్మకం పెరిగింది. అందుకే నా సినిమాలు హిట్ కావడమనేది పూర్తిగా లక్ మాత్రమే కాదు.
వంద శాతం ఎఫర్ట్ పెడతా!… ఇప్పుడు నా కెరీర్ బిజీగా ఉంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేనని నేను చెప్పినా… ‘ఏం ఫర్వాలేదు.. మ్యానేజ్ చేద్దాం.. ఒప్పుకోండి’ అని నా నిర్మాతలు అభిమానంగా అంటున్నారు. ఎందుకంటే నేను పనిని ఎంత శ్రద్ధగా చేస్తానో, నా ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు తెలుసు. ‘మీ కోసమే ఈ పాత్ర రాశాం’ అని డైరెక్టర్లు అన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాలనిపిస్తుంది. అందుకే చేసే ప్రతి పాత్రకు వంద శాతం ఎఫర్ట్ పెడతాను…అని అంటోంది ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆరు సినిమాలతో బిజీగా ఉన్న పూజ.
అలా అనిపిస్తేనే పెళ్లి చేసుకోవాలి !
‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అంటారు కదా. సో.. అవి చేసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఈ మధ్యే నేను ముంబైలో ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకోవడమే ఇలా ఉంటే ఇక పెళ్లి ఎలా ఉంటుందో (నవ్వుతూ). కానీ నేను నమ్మేది ఒకటే. వీళ్లతో జీవితాంతం కలిసుంటే బావుంటుంది అనిపిస్తేనే పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో ఒత్తిడి వల్లో, అందరూ పెళ్లి చేసేసుకుంటున్నారనో మాత్రం చేసుకోకూడదు.
స్వేచ్ఛ ఉంటే దేన్నయినా ఎదుర్కొంటాం !
మా అమ్మ ఇండిపెండెంట్ ఉమన్. కానీ వాళ్ల నాన్నగారు చాలా స్ట్రిక్ట్. అయినా మా అమ్మ చాలా ఇండిపెండెంట్‌గా ఉన్నారు. మా నాన్న ఓపెన్ మైండెడ్. పరిస్థితులను వివరిస్తూ సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా నన్ను పెంచారు. హీరోయిన్ని కాబట్టి చాలా గాసిప్స్ వస్తుంటాయి. అవన్నీ తట్టుకునేంత ధైర్యం ఉన్న అమ్మాయిలా మా అమ్మానాన్న నన్ను పెంచారు. మనవాళ్లతో మనం క్లియర్‌గా, ఓపెన్‌గా, హార్ట్‌ఫుల్‌గా ఉండాలి. మన అభిప్రాయాలను వారితో ధైర్యంగా చెప్పగలిగేలా ఉండాలి. ఇంట్లో మనకంత స్వేచ్ఛ ఉన్నప్పుడు దేన్నయినా ఎదుర్కొంటాం. మా ఇంట్లో ఆ స్వేచ్ఛ ఉంది. అయితే సమాజంలో అందరూ తమకు అనిపించినది అనిపించినట్లుగా చెప్పుకోగలిగే పరిస్థితి రావాలన్నది నా కోరిక .