ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. 1943లో పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తన జీవిత కాలంలో వందల పాటలను రచించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పాటలకు ఆయన గజ్జెకట్టారు. విప్లవకవిగా వంగపండు పేరుపొందారు. ఆయన ఆదివాసీలు, ఇతర పీడిత ప్రజల సమస్యలు, బాధలు, కన్నీలను గానం చేస్తూ ఈయన 300 పాటలను రాసారు.. ఈయన రాసిన కొన్ని పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి.వారి రచనలలో ఎమర్జన్సీ కాలంలో రచించిన “భూమి భాగోతం” చాలా ప్రజాదరణ పొందింది. రాష్ట్రంలో వేల బృందాలు ఈ కళారూపాన్ని ప్రదర్శించాయి. శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాటాన్ని గానం చేస్తూ రచించిన ‘సిక్కోలు యుద్ధం’ నృత్యరూపకం బాగా ప్రసిద్ధి చెందింది.
వంగపండు మొదట విశాఖ షిప్ యార్డులో ఉద్యోగం చేశారు. తర్వాత కాలంలో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ‘జననాట్యమండలి’ కళాకారుడుగా అనేక విప్లవ, ప్రజా గీతాలు రచించి గానం చేశారు.విప్లవ సినిమాలకోసం కూడా ఆయన బాగా ప్రజాదరణ పొందిన పాటలు రాశారు. వాటిలో “జజ్జనకరి జనారె, ఏం పిల్లొడో ఎల్దామోస్తవ, అయ్యా నే చదివి బాగుపడతా” లాంటి పాటలు చాలా పాపులరయ్యి 80, 90 లలో ప్రజల నోట బాగా నానుతుండేవి. ఆయన జీవితం చివరి కాలంలో కారణాలు ఏమైనా కొంత కాలం గా నాటి నిబద్ధతకి దూరమవుతూ వచ్చారు. పాలకవర్గ పార్టీల వేదికలకి తన కళని ఎరువిచ్చారు.ఏదిఏమైనా వంగపండు ప్రసాద్ తన జీవితంలో చాలా భాగం విప్లవ ఆకాంక్షలకి, ప్రజా జీవితాల గానానికి, ప్రజా చైతన్యానికి, ఉద్యమాలకి అంకితం చేశారు. 2008, నవంబరు 23న తెనాలిలో బి.నరసింగరావు చేతుల మీదుగా ఈయనకు బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ అవార్డును ప్రధానం చేశారు. 2017లో కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు.