అన్నింటికీ చెడ్డ లవ్… ‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 1.5/5

హ‌్యాపీ మూవీస్‌ పతాకం పై శంకర్ భాను దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధాంశం.. చంద్ర‌న్న‌పేట పరిసరాల్లో నలభై గ్రామాల ప్ర‌జ‌లు ఓ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఆ స‌మ‌స్య పై పోరాడే వారిలో న‌ర్స‌య్య దొర‌(నరేష్‌) ముఖ్యుడు. ఆ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌టానికి వారొక నిర్ణ‌యం తీసుకుంటారు. విజ‌య‌వాడ‌లో అలివేలు(పాయ‌ల్ రాజ్‌పుత్‌) ఓ హాస్ట‌ల్‌లో ఉండి.. కొంత మంది స్నేహితుల‌తో క‌లిసి ప్ర‌భుత్వ ప‌థకాల‌ అమ‌లు జ‌రిగేలా ప్ర‌చార కార్య‌క‌ర్త‌గా ఉంటుంది. ఎయిడ్స్ బారిన ప‌డ‌కుండా ఉండ‌టానికి కండోమ్ వాడాల‌ని చెబుతూ ప్ర‌చారం చేస్తూ … సిద్ధు(తేజ‌స్‌)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అలివేలును ఇష్ట‌ప‌డ్డ సిద్ధు ఆమె ప్రేమ కోసం పాట్లు ప‌డుతుంటాడు. అలివేలు ఇలా సమాజ సేవ చేస్తూ..ముఖ్యమంత్రి దృష్టిలో పడి, తమ ఊరి వారు ఎదుర్కొంటున్న ఓ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటుంది. అందుకు సిద్దూ సైతం సహాయం చేస్తాడు.ఆ క్ర‌మంలో విజ‌య‌వాడ‌ను విడిచి వెళ్లిపోవాలంటూ అలివేలుకి పోలీసులు వార్నింగ్ ఇస్తారు. అయినా త‌ను అనుకున్న ప‌నిని సాధించ‌డానికి అలివేలు విజ‌య‌వాడ‌లోనే ఉండిపోతుంది. అదే స‌మ‌యంలో ఓ పెద్ద టీవీ ఛానెల్ అధినేత గిరిప్ర‌కాష్‌(ఆదిత్య మీన‌న్‌) రంగంలోకి దిగి … అలివేలును చంపాల‌నుకుంటాడు.వారి నుండి త‌ప్పించుకున్న అలివేలు.. సిద్ధుతో క‌లిసి త‌న గ్రామానికి పారిపోతుంది. అస‌లు అలివేలు అలా ఎందుకు పారిపోతుంది? అలివేలు ప్లాన్ ఏంటి? అలివేలు త‌న గ్రామం స‌హా చుట్టు ప‌క్క‌ల ఉన్న గ్రామాల స‌మ‌స్య‌ల‌ను ఎలా తీర్చింది? అనేవి తెలియాలంటే సినిమా చూడాలి…

విశ్లేషణ.. `RX 100`హీరోయిన్‌ పాయ‌ల్ రాజ్‌పుత్‌.. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో రూపొందిన `RDX ల‌వ్‌`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి సినిమాలో ఘాటుగా, హాటుగా న‌టించిన ఆమె `RDX ల‌వ్‌` లో ఎలా ఉండ‌బోతుంద‌నే ఆస‌క్తిని కలిగింది .టీజ‌ర్ విడుద‌లైన త‌ర్వాత అందులో రొమాంటిక్ స‌న్నివేశాలు చూసి సినిమా ఇంకెలా ఉంటుందోన‌ని కొందరు లొట్టలేసారు . పాయల్‌ రాజ్‌పుట్‌కి వున్న ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఇమేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని ..ఆమె అందాలతో సినిమాని ప్రమోట్ చేయటంతో నిర్మాతకు కొంత వరకూ కలిసి వచ్చింది.యూత్‌ను ఆక‌ట్టుకునే రొమాంటిక్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి.

కండోమ్ లేకుండా శృంగారం చేయ‌డం, గుట్కాలు వాడ‌కం, మ‌ద్య‌పానాన్ని మానిపించ‌డం, ఇలా చాలా విష‌యాల‌ను ద‌ర్శ‌కుడు టచ్ చేశాడు. అయితే వాటిని మించి.. రొమాంటిక్ పార్ట్‌… డ‌బుల్ మీనింగ్ డైలాగులతో.. డైరక్టర్ అరాచకం చెయ్యడంతో ప్రేక్ష‌కుడికి ఇబ్బంది క‌రంగా మారింది . క‌థ‌లో ఏమాత్రం కొత్త‌ద‌నం క‌న‌ప‌డ‌దు. సినిమా మొత్తంలో ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు లేవు. విలన్స్ తో హీరోయిన్ క్లైమాక్స్ లో కబడ్డి ఆడే సీన్ ఒకటి బాగుంది. అసలు సినిమా కథ మొత్తం ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లోనే జరుగుతుంది .అంతకు ముందు వచ్చే సీన్స్ అన్ని కేవలం…ఆమె పాత్ర బిల్డప్ కే వాడటంతో సినిమా బోర్ కొట్టేస్తుంది.బోల్డ్ హీరోయిన్ గా పేరున్న పాయల్ నుండి రొమాంటిక్ సన్నివేశాలు ఆశించి వెళ్లిన వారికి కావలసినంత ఎంటర్టైన్ మెంట్ దొరుకుతుంది .’అర్థ‌నారి’ చిత్రంతో ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు,నంది అవార్డు ద‌క్కించుకున్న శంక‌ర్ భాను ఇలాంటి సినిమా ఎందుకు చేశాడా.. అనిపిస్తుంది.
 
నటీనటులు.. అలివేలు పాత్ర‌లో పాయ‌ల్ రాజ్‌పుత్ చ‌క్క‌గా న‌టించింది.ఆమె అందాలు యూత్‌ను ఆక‌ట్టుకుంటాయి. తేజ‌స్ కంచ‌ర్ల పాత్ర  పాయ‌ల్ పాత్ర‌కు స‌పోర్టింగ్ అనే చెప్పాలి. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, రొమాంటిక్ సన్నివేశాలలో తేజస్ నటన సహజంగా అనిపించింది. నరేష్‌, ఆదిత్య మీనన్‌, ముమైత్‌ ఖాన్‌, తులసి, ఆమని, నాగినీడు, విద్యుల్లేఖ రామన్‌ తదితరుల పాత్ర‌ల‌న్నీ క‌థానుగుణంగా సాగుతాయి.
 
సాంకేతికం.. ర‌ధ‌న్ సంగీతంలో పాట‌లు బాగోలేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రామ్ ప్ర‌సాద్ కెమెరా వర్క్ ఆకట్టుకుంది. పల్లె అందాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. ప‌రుశురాం డైలాగ్స్ అక్క‌డ‌క్క‌డా బాగున్నాయి – రాజేష్