సినిమాలకు రెండు ముఖ్యమైన ఆదాయ మార్గాలుంటాయి. మొదటిది థియేటర్ల రెవెన్యూ .. రెండోది శాటిలైట్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా ఆదాయం . ఇదివరకు థియేటర్ల నుండి వచ్చే రెవెన్యూలో ఇరవై శాతం మాత్రమే శాటిలైట్, ఓటీటీ ద్వారా వచ్చేది. కానీ ఇప్పుడు థియేటర్ల నుంచి తక్కువగా వచ్చినా ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయం ద్వారా నిర్మాతలు లాభాల్ని గడిస్తున్నారు. యాభై కోట్లు సినిమా వసూళ్లు చేయాల్సివుండగా థియేటర్ల ద్వారా ఇరవై ఐదు, ఓటీటీ ద్వారా ఇరవై ఐదు కోట్లు వస్తున్నాయి. అది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత సినిమాలకు ఓటీటీ వరంలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సబ్‌క్రిప్షన్స్ ద్వారా కాకుండా ‘పే పర్ వ్యూ’ అనే కొత్త విధానం అమలులోకి వస్తోంది .
‘అమెజాన్ ప్రైం’, ‘నెట్‌ఫ్లిక్స్’ ,’డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ వంటి ఒటిటి ఫ్లాట్‌ఫామ్ సంస్థలు వివిధ భాషల్లో వేలాది సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసుకునే అవకాశాన్ని కల్పించాయి. అయితే అలా చూడాలంటే ముందుగా వాటిలో సబ్‌స్క్రైబ్ అయ్యుండాలి. దానికి ఒక్కో సంస్థ ఒక్కో విధమైన సబ్‌స్క్రిప్షన్ ఫీజును వసూలు చేస్తాయి. అమెజాన్ ప్రైం సంస్థ అయితే ఏడాదికి రూ.వెయ్యి కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే చాలు.. వేలాది సినిమాలు, వెబ్ సరీస్‌లు చూడొచ్చు. ఈ సంస్థ సబ్‌స్క్రైబర్లను ఏమాత్రం నిరుత్సాహపర్చకుండా ఎప్పటికప్పుడు కొత్తకొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులో ఉంచుతూనే ఉంది. పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి మరీ సినిమాలను కొంటుంది. అందుకే ఆ సంస్థ సబ్‌స్క్రైబర్లు ఎక్కువగానే ఉంటారు. మిగతా ఒటిటి ఫ్లాట్‌ఫామ్స్‌తో పోలిస్తే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు కూడా తక్కువే.. కొత్త సినిమాలను అందిస్తే సబ్‌స్క్రైబర్లను పెంచుకోవచ్చు.. ఆ రకంగా ఆదాయం సమకూర్చుకోవచ్చు అనేది ఆ సంస్థ ప్రణాళిక.. కానీ సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయాన్నే నమ్ముకుంటే భారం అవుతుందని సంస్థ భావిస్తోందట! ఈ నేపథ్యంలో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఓ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. అదే ‘పే పర్ వ్యూ’..
‘పే పర్ వ్యూ’ అంటే ఏమిటి?
ఒకసారి సినిమా చూడటానికి.. సినిమాను బట్టి నిర్ణిత ధరను నిర్ణయిస్తారు. ఆ ధరను ఆన్‌లైన్‌లో చెల్లించగానే సదరు ఓటీటీ సంస్థ పంపించే కోడ్ ద్వారా సినిమాను వీక్షించవచ్చు. అయితే ఇది కేవలం కోడ్ పంపిన మూడు గంటల వరకే వన్‌టైమ్ వాచ్‌బుల్‌గా పనిచేస్తుందట. ఈ కాన్సెప్ట్ కనుక వర్కవుట్ అయితే నిర్మాతలకు నిజంగా పండగే. సినిమాను వీక్షించే ప్రేక్షకులు దీనిని డౌన్‌లోడ్, పైరసీ చేయకుండా కూడా ఓ సరికొత్త టెక్నాలజీని వాడబోతున్నారు. సో.. ప్రేక్షకులు థియేటర్లు ప్రారంభం కాకపోయినా.. ఇంట్లో సినిమాను వీక్షించడానికి ఈ సరికొత్త పద్దతి రాబోతుంది. దీని వల్ల భవిష్యత్తులో సినిమా బిజినెస్ మరింత అభివృద్ధి చెందుతుంది. నిజానికి ఈ విధానం కొత్తదేమీ కాదు. ఇప్పటికే యూట్యూబ్‌లో ఉంది. దీని ప్రకారం అమెజాన్ ప్రైమ్‌లో ఏడాది సబ్‌స్క్రిప్షన్‌తో పాటు కొన్ని ఎక్స్‌క్లూజివ్, భారీ చిత్రాలు చూసేందుకు వేరేగా సంస్థ నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించే చూడాలి. ఇలా కొన్ని ప్రత్యేక సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు రేటు నిర్ణయిస్తారు. యూట్యూబ్‌లో అయితే 25 నుంచి 100 వరకు రేటు ఉంది. రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన ‘క్లైమాక్స్’కు కూడా ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో 100 రేటు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ప్రైమ్ వారు సబ్‌స్క్రైబర్లపై ఎక్కువ భారం మోపకుండా 10 నుంచి 20 మధ్య రేటుతో ‘పే పర్ వ్యూ’ విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నారట.