సినీ వినోదం రేటింగ్ : 3/5
శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ సంయుక్తంగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ… పల్లవి(నివేధా థామస్), జరీనా బేగం(అంజలి), దివ్య నాయక్(అనన్య నాగళ్ళ )వేరు వేరు ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి యువతులు. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి ఒకే ఇంట్లో అద్దెకు ఉంటారు. డ్యూటీకి వెళ్లడం, వచ్చిన డబ్బులలో కొంత ఇంటికి పంపించడం వీరు చేస్తుంటారు. ఇలా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్న ఈ ముగ్గురు ఒక రోజు పార్టీ కోసం బయటకు వెళ్లి.. రాత్రి క్యాబ్‌లో ఇంటికి వెళ్తూ అనుకోకుండా ఎంపీ రాజేందర్(ముఖేష్ రిషి) కొడుకు వంశీ(వంశీకృష్ణ) గ్యాంగ్‌తో రిసార్ట్‌కి వెళ్తారు. అక్కడ జరిగిన ఓ సంఘటన ఈ ముగ్గురి జీవితాలను మలుపుతిప్పుతుంది. ఈ ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు అవుతుంది. పల్లవిని అరెస్ట్ చేస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఈ ముగ్గురు యువతులకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని క్రమంలో సస్పెండ్‌కు గురైన లాయర్ సత్యదేవ్ అలియాస్ వకీల్ సాబ్(పవన్ కల్యాణ్) అండగా నిలబడతాడు. అసలు సత్యదేవ్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? అతని చరిత్ర ఏంటి? మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపడుచులకు వకీల్ సాబ్ ఎలా న్యాయం చేశాడు? రాజకీయ నేపథ్యం ఉన్న వంశీని, డబ్బులకు అమ్ముడుపోయే లాయర్ నందా(ప్రకాశ్ రాజ్)ని సత్యదేవ్ ఎలా ఢీకొన్నాడు? అనేది సినిమాలో చూడాలి..
విశ్లేషణ… పవన్‌కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ఇది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కి రీమేక్. సమాజంలో మహిళల పట్ల కొంతమంది వ్యక్తులకు ఉన్న చులకన భావాన్ని, దానివల్ల స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ‘పింక్’. అక్కడ అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతి కల్హరి, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే సినిమాను అజిత్‌లో కోలీవుడ్‌లో రీమేక్ చేశారు. అక్కడా సూపర్ హిట్ అయింది. పవన్‌కల్యాణ్ స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకుని మూలకథలో ఎలాంటి మార్పులు చేయకుండా, దానికి కొన్ని కమర్షియల్ హంగుల్ని చేర్చాడు దర్శకుడు వేణు శ్రీరామ్. పవన్ ఇమేజ్ కోసం కొన్ని మార్పులు చేసినా కానీ అవి కథా గమనాన్ని ఇబ్బంది పెట్టలేదనే చెప్పాలి. ముఖ్యంగా కామెడీ ట్రాక్ లు పెట్టడం, రొమాంటిక్ సీన్స్ వంటివి లేవు. ఇందులో పవన్‌ని యంగ్ లుక్‌లో చూపించారు. అలాగే హీరోకి ప్లాష్ బ్యాక్ కూడా పెట్టారు. అయితే ఈ ప్లాష్ బ్యాక్ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. సినిమా కథకు అది అడ్డంకిగా అనిపిస్తుంది. అలాగే శ్రుతీహాసన్, పవన్ కల్యాణ్ మధ్య వచ్చిన లవ్ సీన్స్‌కూడా అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్‌లో కొన్ని చోట్ల అనవసరమైన సీన్స్ కూడా ప్రతికూల అంశమే. అలాగే ఇంటర్వెల్ వరకు అసలు కథ ముందుకు సాగదు.
పవన్ తన ఫ్యాన్స్‌ను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో డిసప్పాయింట్ చేయలేదు.ముఖ్యంగా పవన్‌కున్న ఇమేజ్ దృష్ట్యా రాజకీయ కోణాన్ని కూడా చేరుస్తూ ఆయన పాత్రను డిజైన్ చేశారు. లుక్ పరంగా వకీల్‌సాబ్‌గా హుందాగా కనిపిస్తూ.. కోర్టులో వాదించడమే కాకుండా, యాక్షన్ సన్నివేశాల్లో కోటు తీసి విలన్స్ భరతం పట్టడం… డైలాగ్ డెలివరీలో తనదైన స్టైల్‌ను చూపించాడు. ఇంటర్వెల్ ఫైట్… అలాగే సెకండాఫ్‌లో పవన్, ప్రకాష్‌రాజ్ మధ్య వచ్చే కోర్టు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కోర్ట్ రూమ్ డ్రామా డైలాగులు బాగా పండాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ లో పవన్ డైలాగులు ప్రత్యేకంగా రాసారు. మూలం చెడకుండా కొత్తగా ట్రై చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. పొలిటికల్ డైలాగులు కూడా ఒకటిరెండు వదిలారు. ఫైట్స్ కూడా కథలో భాగంగా బాగానే ఇమిడాయి.
అద్భుతమైన నటుడు ప్రకాష్ రాజ్ పాత్రకు నందా అనే పేరు పెట్టి ‘బద్రి’ మూవీకి కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు శ్రీరామ్ వేణు సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాలో ప్రధాన పాత్రధారులు నివేతా థామస్, అంజలి, అనన్య వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. ఎమోషన్‌ను క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యారు. శ్రుతిహాసన్ పాత్ర చిన్నదే.. లుక్ పరంగా శ్రుతి చూడటానికి అంత బాగా లేకపోయినా చక్కగా నటించింది. ఇతర పాత్రధారులు వంశీ కృష్ణ, ముఖేష్ రుషి, శరత్‌బాబు, సమ్మెట గాంధీ బాగానే నటించారు.
ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ సంగీతం. నేపథ్య సంగీతం అదిరిపోయింది. పలు సన్నివేశాలను తన నేపథ్య సంగీతంతో ఓ రేంజ్‌కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలకు తనదైన బీజీఎం ఇచ్చి తమన్ అదరగొట్టాడు.పాటలన్నీ కథలో భాగంగానే ఉన్నాయి. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి బాగుంది. కోర్టు సన్నివేశాలను కళ్లకుకట్టినట్లు చూపించాడు. ప్రవీన్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లకు కత్తెరపడితే బాగుండనిపిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి…రాజేష్