అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అమోల్ గుప్తే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ టైటిల్ రోల్లో నటిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నుండి ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ఆ మధ్య సైనా పాత్రలో ఒదిగిపోయిన శ్రద్ధా లుక్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం . ఇందులో షటిల్ బ్యాట్ పట్టుకొని బిగ్గరగా అరుస్తున్నట్టు ఉంది శ్రద్ధా. సైనా లుక్‌లో ఒదిగిపోయిన శ్రద్ధా కపూర్ లుక్స్‌పై ప్రశంసల వర్షం కురిసింది. సైనా పాత్రలో నటించేందుకు శ్రద్ధా కపూర్ కొన్ని నెలల పాటు శిక్షణ పొందిన సంగతి తెలిసిందే.
బయోపిక్‌లో ‘సైనా’ టైటిల్ రోల్ పోషిస్తున్న శ్రద్ధాకపూర్ కొద్ది నెలల క్రితం వైద్య పరీక్షలు చేయించుకోగా డెంగీ సోకినట్లు తేలింది. దీంతో ఆమె సెప్టెంబర్ 27 నుంచి షూటింగ్లో పాల్గొనడం లేదు. కాని సినిమాని 2020లో ఎలా అయిన విడుదల చేయాలని దర్శకుడు భావించాడు. ఈ నేపథ్యంలో శ్రద్ధా కపూర్ స్థానంలో పరిణితీ చోప్రాని ఎంపిక చేసి షూటింగ్‌ని త్వరగతిన పూర్తి చేయనున్నారట. ఈ ఏడాది చివరిలో చిత్ర షూటింగ్ పూర్తి చేయాలని అనుకున్నాం. 2020లో సినిమా రిలీజ్ చేయనున్నాం. అందుకే శ్రద్ధా స్థానంలో పరిణితీని ఎంపిక చేసామని నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. అతి త్వరలోనే పరిణితి టీంతో కలవనుందని అంటున్నారు. కాగా, సైనా కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే డెంగీతో బాధపడుతున్న శ్రద్ధా కపూర్ సాహో, చిచోరే, స్ట్రీట్ డ్యాన్సర్, బాఘీ 3 చిత్రాలలో నటిస్తుంది. మరి ఈ అమ్మడు త్వరగా కోలుకొని ఈ చిత్ర షూటింగ్‌లని వేగవంతంగా పూర్తి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.