ఫ్రెంచ్ రివేరాలో కన్నులపండుగా మొదలైన కేన్స్ చిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడకు ప్రదర్శనకు వచ్చిన చిత్రాలు, రెడ్ కార్పెట్‌పై నాయికల అందాల నడుమ ఈ వేడుకలు జరిగాయి. ముగింపు వేడుకల్లో కీలకమైన పురస్కారాల ప్రదానం జరిగింది. కేన్స్ చిత్రోత్సవాల్లో అత్యున్నత పురస్కారం ఏ చిత్రానికి దక్కుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ‘2019 గోల్డెన్ పామ్ డ ఓర్’ పురస్కారం దక్షిణ కొరియా దర్శకుడు బాంగ్ జూన్ హో తెరకెక్కించిన ‘పారసైట్’కు దక్కింది. సియోల్ పట్టణంలోని పేద, ధనికుల మధ్య అంతరాల నేపథ్యంగా సాగే కథ ఇది. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి అవార్డు దక్కడం ‘గ్రేట్ గిఫ్ట్’ అని ఆనందం వ్యక్తం చేశారు చిత్ర దర్శకుడు బాంగ్ జూన్ హో. కొరియన్ సినిమా 100 ఏళ్ల మైలు రాయిని చేరుకున్న తరుణంలో ఆ అవార్డు రావడం మరింత సంతోషాన్ని కలిగించిందన్నారు బాంగ్.
కేన్స్‌లో రెండో అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ ప్రిక్స్‌ను దర్శకురాలు మటీ డోప్ రూపొందించిన ‘అట్లాంటిక్యూ’ కైవసం చేసుకొంది. ఈ పురస్కారాన్ని ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వస్టర్ స్టాలోన్ చేతుల మీదుగా డోప్ అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డుని ‘లిటిల్ జోయీ’ చిత్రంలోని నటనకు గానూ ఎమిలీ బీచమ్, ‘పెయిన్ అండ్ గ్లోరీ’ చిత్రంలోని నటనకుగానూ ఉత్తమ నటుడి అవార్డుని ఆంటోనియో బాండ్రెస్ అందుకున్నారు. ది ప్రిక్స్ అన్ సెర్టైన్ రిగార్డ్ పురస్కారాన్ని ‘ది ఇన్విజిబుల్ లైఫ్ ఆఫ్ యురిడైస్ గుస్మో’ చిత్రం గెలుచుకుంది.