ఒకరు దక్షిణ భారత సినీ సంగీతానికి మకుటం లేని మహారాజైతే మరొకరు తన సంగీత ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభాశాలి. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్… ఇద్దరూ ఇద్దరే. వీళ్లిద్దరిదీ గురుశిష్యుల బంధం. పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించక ముందు అందరు మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పనిచేసినట్టే ఇళయరాజా దగ్గర కూడా పనిచేశాడు రెహమాన్. 1992లో రోజా సినిమాతో ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు రెహమాన్. అప్పటి నుంచి ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే రెహమాన్‌కు రాలేదు. ఎనభై దశకంలో ఉన్న ఊపుతో పోలిస్తే రెహమాన్‌తో పాటు కొత్త సంగీత దర్శకులు వచ్చాక కాస్త వెనకబడ్డారు ఇళయరాజా. అయినా ఆయనకు అందరితోనూ బాగానే సత్సంబంధాలు ఉండేవి. కానీ 2000లో రెహమాన్‌కు దక్కిన ఓ అవార్డుతో గురువుగారు చిన్నబుచ్చుకున్నారు. శిష్యుడిని దూరం పెట్టారు. ఎంతగా అంటే.. కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడనంతగా -అని చెబుతాయి చెన్నై ఫిలింనగర్ వర్గాలు.
ఇంతకీ రెహమాన్ వల్ల ఇళయరాజా ఎందుకు మనస్థాపానికి గురయ్యారు అంటే…2000వ సంవత్సరంలో రెహమాన్‌ను కేంద్రం ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో గౌరవించింది. దాంతో దేశంలో రెహమాన్ కీర్తి మరింత పెరిగింది. ఇది ఇళరాజాకు బాధ కలిగించింది. రెహమాన్ కన్నా తాను ఎన్నో ఏళ్లకు ముందే గొప్ప సంగీతదర్శకుడిగా పేరు తెచ్చుకున్నా కేంద్రం ఎప్పుడూ పద్మ అవార్డుకు పరిగణలోకి తీసుకోలేదని తన దగ్గర పనిచేసిన రెహమాన్‌ను మాత్రం అతితక్కువ కాలానికే పద్మ అవార్డు ఇచ్చి సత్కరించారని ఇళయరాజా ఆవేదన చెందినట్లు చెబుతారు. అప్పటి నుంచి గురుశిష్యుల బంధం బయటకు కనిపించేదిగా మాత్రమే ఉండేదని… లోపల మాత్రం ఎవరికి వారే అన్నట్లు ఉండేవారని అంటారు.
ఇళయరాజాను పద్మశ్రీ అవార్డుకు పరిగణలోకి తీసుకోని కేంద్రం 2010లో మాత్రం ఆయనకు నేరుగా ‘పద్మభూషణ్’ అవార్డు ఇచ్చి గౌరవించింది. అదే ఏడాది రెహమాన్‌కు ‘పద్మభూషణ్’ అవార్డు ఇచ్చి సత్కరించింది. అలా ఇద్దరికీ ఒకేసారి పద్మభూషణ్ అవార్డు రావడంతో సినీ సంగీత ప్రియులు, ఇద్దరి అభిమానులు ఖుషీ అయిపోయారు. మళ్లీ గురుశిష్యులు కలుస్తారేమో అని ఆశించారు. కానీ అలా జరగలేదు. వారి మధ్య ఎప్పట్లాగే మౌన యుద్ధం జరిగింది.
తాజాగా కేంద్రం తనకు పద్మవిభూషణ్ ప్రకటించడంతో ఇళయరాజా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కనీసం ఇప్పుడైనా శిష్యుడి కన్నా ముందు గుర్తించినందుకు ఎంతగానో సంబరపడ్డరాయన. అంతేకాదు… ‘పద్మవిభూషణ్ అవార్డును ఇళయరాజా స్వీకరించడం ఆ అవార్డుకే గౌరవ’మని కేంద్రం వ్యాఖ్యానించడం మ్యూజిక్ మ్యాస్ట్రో పులకరించిపోయారు. ఆయన ఆనందానుభూతి మొత్తం ప్రెస్మీట్లో చాలా స్పష్టంగా కనిపించింది. మొత్తం మీద ‘పద్మవిభూషణ్’ అవార్డు విషయంలో శిష్యుడు రెహమాన్ కన్నా ముందుగానే సత్కారం పొందారు గురువు ఇళయరాజా. ఇన్నేళ్లుగా సంగీతానికి తాను అందించిన సేవలకు భారతదేశ అత్యున్నత రెండో పౌర పురస్కారం లభించడంతో ఇళయరాజా ఆనందానికి హద్దుల్లేవు.