సినీవినోదం రేటింగ్ : 2/5
ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓంకార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించింది
కధాంశం… మాయ(అవికాగోర్) ఓ హాస్పిటల్‌లో డాక్టర్‌గా చేస్తుంటుంది. ఆమెకు ఎవరైనా ‘ఐ లవ్ యు’ అని చెబితే ఓ ఆత్మ వచ్చి చావగొడుతుంటుంది. అందుకనే ఆమెను ప్రేమించాలంటే అందరూ భయపడుతుంటారు. అదే సిటీలో ఓ కాలనీలో అనాథగా పెరిగిన అశ్విన్(అశ్విన్‌బాబు) అలీతో కలిసి మందు తాగుతూ..కాలనీలో గొడవలు చేస్తూ ఉంటారిద్దరూ. ఆ కాలనీలో ఉండే ఓ డాక్టర్ మాయ పనిచేసే హాస్పిటల్‌లోనే పనిచేస్తుంటాడు. అశ్విన్ రోజూ పెట్టే టార్చర్ నుండి తప్పించుకోవాలని ఆ డాక్టర్ ఓ ప్లాన్ వేసి అశ్విన్, మాయకి మధ్య ప్రేమ పుట్టేలా చేస్తాడు. మాయకి, అశ్విన్ ‘ఐ లవ్ యు’ చెబుతాడు. అప్పుడు కూడా ఆత్మ వచ్చి అశ్విన్‌ని చావగొడుతుంది. కేరళ భూత మాంత్రికుడు గరుడ పిళ్లై(అజయ్ ఘోష్) కుమార్తె మాయ అని…తను ఓ యక్షిణి ఆత్మను కుమార్తెకు రక్షణగా పెట్టాడని అశ్విన్‌కి తెలుస్తుంది. మాయ కోసం మావయ్యతో కలిసి అశ్విన్ కేరళ వెళతాడు. మాయను కాపాడే యక్షిణి ఎవరు? అక్కడ అశ్విన్‌కు తెలిసిన నిజాలేంటి? తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే…
విశ్లేషణ… `రాజుగారిగది`ఓంకార్‌కి దర్శకుడిగా చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. దాంతో నాగార్జున, సమంతలతో `రాజుగారిగది 2` చేస్తే ఫ్లాప్ అయ్యింది. ఈ సారి తమిళంలో హాస్య నటుడు, హీరో సంతానం చేసిన ‘దిల్లుకు దుడ్డు’ ఆధారంగా ‘రాజుగారిగది 3’ చేసారు. హారర్ అనేది ఈ సినిమాలో మచ్చుకు కూడా కనపడదు….సెకండాఫ్‌లో వచ్చే బంగ్లాలోని హారర్ కామెడీ సన్నివేశాలు మినహా మరేమీ ఆకట్టుకోవు. ఫస్టాఫ్ జస్ట్ ఓకే అనిపించినా, సెకండాఫ్ కు వచ్చేసరికి కామెడీ ఫరవాలేదనిపిస్తుంది….నవ్వించటం కోసం సీరియస్ గా నడిచే దెయ్యం ట్రాక్ ని ఫన్ చేసేయటమే ఇబ్బందిగా ఉంటుంది. ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా లేదు.అంతా సాగదీతగా కనపడుతుంది. సెకండాఫ్ ప్రీక్లైమాక్స్‌లో వచ్చే ఇరవై నిమిషాల హారర్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా అజయ్‌ఘోష్, ఊర్వశి, అలీ పాత్రలు సెకండాఫ్‌లో ప్రేక్షకులను నవ్వించడంలో డైరెక్టర్ ఓంకార్ సక్సెస్ అయ్యారు. మొత్తానికి ఈ హర్రర్ కామెడీలో హర్రర్ లేకపోయినా కామెడీ కొంతవరకూ ప్రేక్షకులను అలరిస్తుంది.
నటీనటులు… అశ్విన్‌బాబు పాత్ర చుట్టూనే కథంతా తిరుగుతుంది. అశ్విన్ బాబునుంచి పెద్దగా నటన ఎక్సపెక్ట్ చేయలేం.ఉన్నంతలో తనదైన శైలిలో చేసి పాత్రను పోషించాడు. యాక్టింగ్ పరంగా కొంచెం మెరుగయ్యాడు. మాయగా అవికా గోర్ అందంగా కనిపించింది. కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ తన నటనతో పర్వాలేదనిపించింది. క్లైమాక్స్‌లో కాసేపు దెయ్యంగా కనిపించింది.సినిమాలో అజయ్‌ఘోష్, ఊర్వశి, అలీ పాత్రలతో కామెడీ ని దర్శకుడు బాగానే పండించాడు . ఫస్ట్ హాఫ్‌లో అలీ, అశ్విన్‌లతో కలిసి బ్రహ్మాజీ, శివశంకర్ మాస్టార్, గెటప్ శ్రీను కాసింత నవ్వులు పంచారు.సెకండ్ హాఫ్‌లో గరడ పిళ్లై, రాజమాతలుగా అజయ్ ఘోష్, సీనియర్ నటి ఊర్వశీలు.. అలీ, అశ్విన్ తోడుగా దెయ్యాలతో కలిసి హర్రర్ కామెడీ చేసారు. ముఖ్యంగా అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ తమ పాత్రలకు న్యాయం చేస్తూ.. నవ్వులు పంచారు.
సాంకేతికంగా… ఇటువంటి చిత్రాలకు కెమెరా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫి.. షబీర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేసి సినిమాకు ప్లస్ అయ్యారు. షబీర్ సంగీతం సాహిత్యాన్ని డామినేట్ చేసేసింది. పాటలు అంతగా గుర్తుండిపోవు కానీ, పాటల టేకింగ్ బావుంది. బుర్రా సాయిమాధవ్ వెరైటీగా కామెడీ డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు -రాజేష్