ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అంతటి బాధనీ పక్కన పెట్టి, ఆయన ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘అరవిందసమేత వీరరాఘవ’ సెట్స్‌లో దర్శనమిచ్చారు. దీంతో అతని డెడికేషన్ చూసి సినీ ప్రేమికులు మురిసిపోతున్నారు.’యంగ్‌టైగర్’ ఎన్టీఆర్ తన వృత్తి పట్ల ఎంత అంకితభావంతో ఉంటారో ఇదే మంచి ఉదాహరణ అని అంటున్నారు. ‘అరవిందసమేత వీరరాఘవ’ చిత్రం విడుదల తేదీ నిర్ణయం జరిగిపోయినప్పటికీ , తండ్రి చనిపోయిన ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఈ చిత్ర నిర్మాత విడుదలను వాయిదా వేద్దామనుకున్నారు. అయితే నిర్మాతను బాధ పెట్టడం ఇష్టం లేని ఎన్టీఆర్అనుకున్న ప్రకారమే చిత్రం విడుదల కావడం కోసం ముందుకొచ్చి, సినిమా పూర్తి చెయ్యడానికి షూటింగ్ లో పాల్గొంటున్నారు.
సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ తారక్ అంకితభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ట్విట్టర్ వేదికగా తారక్ చేసిన ఈ పని తనను ఎంతో ఉత్తేజపరిచిందని అతను పేర్కొన్నారు. ‘‘తారక్ అన్నా.. నువ్వంటే ఎంతో గౌరవం పెరిగిపోయింది. మేం అంతా నీతో ఉన్నాం. నీ అంకితభావం చూస్తుంటే ముచ్చటేస్తోంది. #అరవిందసమేతవీరరాఘవ సెట్స్‌లో అన్న(ఎన్టీఆర్)’’ అని థమన్ ట్వీట్ చేశారు.
అక్టోబర్ 11న సినిమా విడుదల
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఓ వైపు శరవేగంగా షూటింగ్.. మరోవైపు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు.. ఓ సైడేమో డబ్బింగ్ పనులు.. మరోసైడ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు ‘అరవింద సమేత’ చిత్రబృందం. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 11న సినిమాని రిలీజ్ చేయడం కోసం టీమ్ అన్ని పనులనూ ఒకేటైమ్‌లో యమా స్పీడ్‌గా చేస్తున్నారు.ప్రత్యేకంగా రూపొందించిన గుడి సెట్లో చిత్రబృందంపై ఫ్యామిలీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు త్రివిక్రమ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిత్తూరు యాసలో మాట్లాడతారట.పూజాహెగ్డే కథానాయిక. ఈషా రెబ్బా, నాగబాబు, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.