హంగామా తప్ప అనుభూతి లేని ….’శ్రీనివాస కల్యాణం’ చిత్ర సమీక్ష

                                         సినీవినోదం రేటింగ్ : 2 .25 /5

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న‌ దర్శకత్వంలో రాజు, శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు
కధలోకి వెళ్తే ….
స‌గినేటి ప‌ల్లెకు చెందిన యువ‌కుడు శ‌్రీనివాస్‌(నితిన్‌) ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుంటాడు. చంఢీఘ‌ర్‌లో ప్రాజెక్ట్ కోసం ప‌నిచేస్తున్న శ్రీనివాస్‌.. అక్క‌డే కాఫీ డేలో ప‌నిచేస్తున్న సిరి(రాశీ ఖ‌న్నా)ని క‌లుస్తాడు. ఇద్ద‌రు ప్రేమించుకుంటారు. అయితే పెళ్లి మాత్రం పెద్దల అంగీకారంతోనే చేసుకోవాల‌నుకుంటారు . దాంతో శ్రీనివాస్ సిరి తండ్రి.. హైద‌రాబాద్‌లో పెద్ద బిజినెస్‌మేన్ ఆర్‌.కె(ప్ర‌కాశ్ రాజ్‌)ని క‌లుసుకుని త‌మ ప్రేమ విష‌యం చెబుతాడు. అలాగే సంప్ర‌దాయానికి విలువ నిచ్చి త‌న ఊర్లోనే పెళ్లి జ‌ర‌గాల‌ని.. త‌న నాయ‌న‌మ్మ కోరిక‌ను నెర‌వేర్చాల‌ని కూడా శ్రీనివాస్ చెబుతాడు. ప్ర‌తి సెక‌న్‌ని వేస్ట్ చేయ‌కుండా బిజినెస్ గురించే ఆలోచించే ఆర్‌.కె కూతురు కోసం పెళ్లికి ఒప్పుకుంటాడు. అయితే ఒక‌వేళ త‌న కూతురు ఎప్పుడైనా విడిపోవాల‌నుకుంటే విడాకులు వెంట‌నే ఇచ్చేయాల‌ని ముందుగానే అగ్రిమెంట్ చేయించుకుంటాడు . అయితే ఓ కండీష‌న్‌పై శ్రీనివాస్ ఆగ్రిమెంట్‌పై సంత‌కం పెడ‌తాడు. ఇంత‌కు శ్రీనివాస్‌.. ఆర్‌.కె కి ఎలాంటి కండీష‌న్ పెడ‌తాడు? శ‌్రీనివాస్‌, సిరి ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా పెళ్లి చేసుకుంటారా? అగ్రిమెంట్ గురించి శ‌్రీనివాస్ కుటుంబ స‌భ్యులు ఎలా రియాక్ట్ అవుతారు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమాలో చూడాలి…
విశ్లేషణ…
‘శ‌త‌మానం భ‌వ‌తి’ చిత్రంతో విజ‌యాన్ని అందుకున్న ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న మ‌న సంప్ర‌దాయంలో ముఖ్య‌మై ఘ‌ట్ట‌మైన పెళ్లి అనే అంశం చుట్టూ  అల్లిన క‌థే `శ్రీనివాస క‌ళ్యాణం`.
‘శతమానం భవతి’ సినిమాతో యూత్‌ ఆడియన్స్‌ను కూడా ఫ్యామిలీ సినిమాకు కనెక్ట్ చేసిన దర్శకుడు సతీష్‌ వేగేశ్నతో మరోసారి దిల్ రాజు బ్యానర్‌లో సినిమా వస్తుందంటే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలు అందుకోవటంలో సతీష్ ఫెయిల్‌ అయ్యారు.  మనసును తాకేలా తెరకెక్కించలేకపోయారు. ఫస్ట్‌ హాఫ్ హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు కాస్త ఆసక్తి కరంగా అనిపించినా ..సెకండ్‌ హాప్‌లో పెళ్లి పనులు మొదలైన తరువాత కథనం మరింత నెమ్మదించింది. పెళ్లింట్లో కామెడీ, ఎమోషన్స్‌ బాగా పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఎక్కువగా పెళ్లి గొప్పతనాన్ని చెప్పడం పైనే దృష్టిపెట్టాడు . ఇక పాత్ర‌లు, వాటిని మ‌లిచిన తీరు, వాటి మ‌ధ్య భావోద్వేగాలు ఎఫెక్టివ్‌గా అనిపించ‌వు. కథను మలుపు తిప్పే  మూలమైన ప్రకాష్ రాజ్ పాత్ర మారడానికి ఇంకా బలమైన సన్నివేశాలు పెట్టి ఉంటే .. ఆ పాత్ర  బాగా పండేది. అలాగే పద్మావతిగా మంచి భావోద్వేగ పాత్రలో కనిపించిన నందిత పాత్రకు కూడా సరైన ముగింపు లేదు.  పాత్ర‌ధారుల కంటే పాత్ర‌లను స‌రిగా డిజైన్ చేయ‌క‌పోవ‌డం వల్లనే  సినిమాలో ఫీల్‌ క్యారీ కాదు . హీరో హీరోయిన్ మ‌ధ్య స‌న్నివేశాలు, స‌త్యం రాజేశ్‌, హ‌రితేజ‌, ప్ర‌వీణ్‌, విద్యుల్లేఖ ఇలా అన్ని పాత్ర‌ల మ‌ధ్య స‌న్నివేశాలు నడుస్తుంటాయి తప్ప.. ప్రేక్షకుడికి మంచి అనుభూతినివ్వవు. ఇప్పటి యూత్ మ‌నోభావాలకు.. ఈ సినిమా కనెక్ట్ అవుతుందా? అనే అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. సినిమా క‌నెక్ట్ కావ‌డం క‌ష్టమే అనిపిస్తుంది.
 
నటీనటులు…
కుటుంబ బంధాలు సాంప్రదాయల విలువ తెలిసిన కుర్రాడిగా నితిన్‌ కనిపించాడు. తన లవర్‌ బాయ్ ఇమేజ్‌ను కాపాడుకుంటూనే.. బరువైన కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా మెప్పించాడు.సంప్రదాయాలకు విలువ ఇచ్చే ‘శ్రీ’ పాత్రలో కనిపించిన రాశి ఖన్నా చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. పద్మావతిగా నందిత శ్వేత ఫస్ట్‌ హాఫ్‌లో అల్లరి అమ్మాయిగా అలరించి.. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మెప్పించింది.  బిజినెస్‌మేన్‌గా ప్రకాష్ రాజ్‌ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ చాలా బాగా నటించారు.రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, జయసుధ,ఆమని, సితార, విద్యుల్లేఖ రామన్‌, పూన‌మ్‌కౌర్‌,ప్రవీణ్,ప్ర‌భాస్ శ్రీను ..అంతా రెగ్యులర్ పాత్రల్లో కనిపించారు.
సాంకేతిక నిపుణులు…
పెళ్లి మంత్రాల్లోని అంతరార్థం చెప్పే డైలాగ్స్‌, పాత్ర‌ల మ‌ధ్య వ‌చ్చే కీల‌క సన్నివేశాల్లోని డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి.మిక్కీ జే మేయర్‌ సంగీతం  ఆశించిన స్థాయిలో లేదు. ఒక్క పెళ్లి పాట తప్ప మరే పాట మెప్పించేలాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్ర‌తి స‌న్నివేశాన్ని ఆయన అద్భుతంగా విజువ‌లైజ్ చేశారు.సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫి పెళ్లి వేడుకకు మరింత అందం తీసుకువచ్చింది. మధు ఎడిటింగ్ బాగుంది. దిల్ రాజు నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి      – రాజేష్