‘నేను నిత్యామీనన్‌’ అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తా!

‘‘బాగా స్టడీ చేసి చెయ్యాల్సినవి, బయోపిక్‌ లు.. అయితే తప్ప మిగతా పాత్రలకు అంత కష్టపడాల్సిన పని లేదు. నేను మెథడ్‌ యాక్టర్‌ని కాదు. స్పాంటేనియస్‌ యాక్టర్‌ని. నిజం చెప్పాలంటే పాత్ర కోసం పెద్దగా ప్రిపేర్‌ అవ్వను’’ అన్నారు నిత్యా మీనన్‌. ఏదైనా పాత్రను చేయడానికి ఎలా ప్రిపేర్‌ అవుతారు అనే ప్రశ్నకు నిత్యామీనన్‌ స్పందిస్తూ – ‘‘కేస్‌ స్టడీ చేసేవి, బయోపిక్‌ అయితే తప్ప మిగతా పాత్రలకు అంత కష్టపడాల్సిన పని లేదు. ఒక్కసారి కాస్ట్యూమ్‌ నా ఒంటిమీద పడితే పాత్రలోకి వెళ్లిపోతాను. ‘నేను నిత్యామీనన్‌’ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తాను.ఆ పాత్ర మూడ్‌లోకి మారిపోతాను.
మన ఇండస్ట్రీలో చాలాసార్లు స్క్రిప్ట్‌ను చివరి నిమిషంలో ఇస్తుంటారు. కొన్నిసార్లు షూటింగ్‌ జరిగే రోజు ఉదయమే స్క్రిప్ట్‌ ఇచ్చేవాళ్లు. కథ తొలిసారి వింటున్నప్పుడే పాత్ర నాకు గుర్తుండిపోతుంది. ఆ పాత్రకు నేను ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిపోతాను. ‘స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు ఆ డైలాగ్‌ ఉందని చెప్పారు. షూట్‌ చేయడం లేదేంటి?’ అని దర్శకుడిని అడుగుతుంటాను కూడా. వాళ్లు చాలాసార్లు షాక్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అన్నారు.
 
నా మొదటి సబ్జెక్ట్‌గా భావిస్తా!
కథల ఎంపికలో మొదటి నుంచీ సెలక్టివ్‌గా ఉంటూ, తన మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తుంటారు నిత్యామీనన్‌. ఆమె ఓ సినిమా అంగీకరించారంటే ‘ఏదో విషయం ఉంటుంది’ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. గతంలో నిత్యా నటించిన ‘ఓ కాదల్‌ కణ్మణి’ హిందీలో ‘ఓకే జాను’గా రీమేక్‌ అయింది. తాజాగా అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘మిషన్‌ మంగళ్‌’లో కీలక పాత్ర పోషిస్తున్నారు నిత్యా.
 
బాలీవుడ్‌ ఎంట్రీ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘కెరీర్‌ బిగినింగ్‌ నుంచీ కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నా. బాలీవుడ్‌లో అవకాశం వచ్చిందని నేనీ సినిమా అంగీకరించలేదు. దీనికన్నా ముందే నేను ఇలాంటి ఓ కథను ఫాలో అవుతున్నా. అదే సమయంలో ఈ అవకాశం వచ్చింది. దీనిని బాలీవుడ్‌ ప్రవేశం గా భావించను.బాలీవుడ్‌ లో నా మొదటి సబ్జెక్ట్‌గా భావిస్తా. నేను ముందు ఆర్టిస్ట్‌ని, ఆ తర్వాతే హీరోయిన్‌ని. ఓ క్యారెక్టర్‌ దక్కాలంటే ఇక్కడ రిజర్వేషన్‌ ఏమీ ఉండదు. పాత్రకు ఎవరు సూట్‌ అవుతారో.. వారినే ఎంపిక చేసుకుంటారు’’ అని తెలిపారు.
 
సౌత్‌లో అద్భుతమైన చిత్రాలు వస్తున్నప్పటికీ ‘మిషన్‌ మంగళ్‌’వంటి కథ బాలీవుడ్‌లోనే రావడం గురించి మీరేమంటారు? అన్న ప్రశ్నకు ‘‘ఇది నన్ను ఇరకాటంలో పెట్టే ప్రశ్న. ఐడియా అనేది ఎవరికైనా రావచ్చు. అది ఎక్కడైనా ఇంప్లిమెంట్‌ కావచ్చు. ‘మిషన్‌ మంగళ్‌’ తీసింది బాలీవుడ్‌లోనే అయినా దర్శకుడు జగన్‌ శక్తి మాత్రం దక్షిణాదికి చెందిన వ్యక్తి. అతని సోదరి నాకు ఆంటీ అవుతారు. ఆమె ఇస్రోలో పని చేస్తున్నారు. అలా జగన్‌కి ఈ కథ ఐడియా వచ్చుండొచ్చు’’ అని నిత్యా మీనన్‌ సమాధానమిచ్చారు