సినీ వినోదం రేటింగ్ : 2/5
శ్రేస్ట్ మూవీస్ బ్యానర్ పై యం.యస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ… మాచర్లలో రాజప్ప (సముద్రఖని) చేసిందే చట్టం. ఆయనదే రాజ్యం. ముప్పైఏళ్లుగా మాచర్ల నియోజక వర్గంలో ఎన్నికలు జరగనివ్వకుండా ఏకగ్రీవంగా యం.ఎల్.ఏ అవుతుంటాడు. ఎన్నికలు జరపాలని వచ్చిన కలెక్టర్‌ను చంపేస్తాడు. ఆ తర్వాత గుంటూరు జిల్లాకి కలెక్టర్‌గా సిద్ధార్ధ్ రెడ్డి (నితిన్) వస్తాడు. పోస్టింగ్ రాకముందే ప్రేమించిన అమ్మాయి స్వాతిని వెతుక్కుంటూ మాచర్లలో అడుగుపెడతాడు. రాజప్ప కొడుకు (సముద్రఖని)ను కొడతాడు. జిల్లా కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత సిద్ధార్ధ్ రెడ్డి ఏం చేస్తాడు? మాచర్లలో ఎన్నికలు జరగాలని అతడు చేసిన ప్రయత్నం ఫలిస్తుందా? అన్నది సినిమాలో చూడాలి…
విశ్లేషణ… మాచర్లలో ఎన్నికలు జరిగేలా చేస్తానని హీరో, ఎలా జరుగుతాయో నేనూ చూస్తానని విలన్. ఇదే సినిమాకి మెయిన్ కాన్ఫ్లిక్ట్. అలాంటి ఛాలెంజింగ్ పాయింట్ తో సినిమా చేసేటప్పుడు సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా సాగాలి. అలాంటివేమీ లేకుండా.. ప్రేక్షకులకు సినిమా కదలిక అంతా ముందుగా తెలిసిపోయేలా ఈ సినిమా కథనం సాగుతుంది. సినిమా చూస్తున్నంత సేపూ పాత సినిమాల్లోని సన్నివేశాల్ని కొత్తగా తీసినట్టు అనిపిస్తుంది కానీ.. కొత్తదనం మచ్చుకైనా కనిపించదు. ఈ సినిమాలో సీన్స్ గురించి చెప్పమంటే.. లెక్కలేనన్ని సినిమాల పేర్లు చెప్పొచ్చు. ఒక్కో చోట, తర్వాత ఏమౌతుందో తెలుసుకుందామనే ఉత్సాహం కూడా పోయి కాసేపు నిద్ర పోదామనిపిస్తుంది. హీరో కలెక్టర్ అవడం అనే ఒక్క పాయింట్ తప్ప.. ఇలాంటి మూస కధలని ఎన్నో సినిమాల్లో ఎందరో హీరోలు చేసేశారు. ఇందులో నితిన్ కొత్తగా చేయడానికి ఏముంది? . ఫస్టాఫ్ అంతా.. హీరో హీరోయిన్‌తో ప్రేమలో పడడం, వెన్నెల కిషోర్ కామెడీ సీన్లతో కాలక్షేపం చేసి కథను నడిపించాడు దర్శకుడు. అందులో చాలా సీన్స్ బోర్ కొట్టిస్తాయి. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే సినిమా ఎలా ఉండబోతుందనేది సగటు ప్రేక్షకుడికి తెలిసి పోతుంది. ఇక సినిమా ఇంటర్వెల్‌కు వచ్చే సరికి ఇక సెంకడాఫ్ ఎలా ఉంటుందనేది క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది.
నటీనటులు… నితిన్ కలెక్టర్ పాత్రను పోషించటం కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. నితిన్ ఎంతో ఈజ్ తో తన బాణీలో చేసుకంటూ పోయాడు. పాటలు, ఫైట్స్ లో తన మార్క్ చూపించాడు. అలాగే కృతి శెట్టి బాగానే చేసింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. క్యాథరీన్ బాగా లావుగా ఉండి ఎబ్బెట్టుగా అనిపించింది. తండ్రీకొడుకులుగా సముద్రఖని విలనిజం పర్వాలేదు.అయితే కొత్తదనమేమీ లేదు. అసలు ఆ పాత్రకు డ్యూయల్ రోల్ ఎందుకో అర్ధం కాదు. ‘ఇగో కా బాప్’ అయిన గుంతలకిడి గుర్నాథంగా వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఫస్టాఫ్‌లో ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసే ప్రయత్నమైతే చేశాడు. కానీ ఒకదశలో వెన్నెల కిషోర్ కామెడీ అతి గా మారుతుంది .రాజేంద్రప్రసాద్, మురళీశర్మ నవ్వించే ప్రయత్నం చేసారు.ఇక అంజలి ‘రారా రెడ్డి’ పాటలో మెరిసి ఆకర్షణగా నిలిచింది.
సాంకేతిక వర్గం… మహతి స్వర సాగర్ సంగీతం పర్వాలేదు .అయితే “అయాం రెడీ” పాటకు మాత్రమే హాల్లో స్పందన కనిపించింది. మిగిలిన పాటలన్నీ రొటీన్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగులేదు. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మహతిస్వరసాగర్ నుంచి రావడం ఆశ్చర్యకరం. పాటల్ని మాత్రం అందంగా తెరకెక్కించారు. దానిలో పెట్టిన శ్రద్ధలో సగం మ్యూజిక్ మీద పెట్టున్నా బాగుండేది. ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రహణం మెప్పిస్తుంది. డయలాగ్స్ లో గుర్తుంచుకునే పంచుల్లేవు -రాజేష్