సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జూలై 12న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నిర్మాత ‘జెమిని’ కిరణ్, అనిల్ సుంకర ట్రైలర్ విడుదల చేశారు.
నిర్మాత జెమినీ కిరణ్ మాట్లాడుతూ “సందీప్ కిషన్ కి నేను ఇచ్చిన హిట్ సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’లోని వెంకటాద్రి పేరు తీసుకుని ‘వెంకటాద్రి టాకీస్’ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించారు. వెరీ నైస్ ఆఫ్ హిమ్. సందీప్ కి ఆల్ ది బెస్ట్. సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా” అన్నారు.
అనిల్ సుంకర మాట్లాడుతూ “సందీప్ కిషన్ నిర్మాతగా మారి చేస్తున్న చిత్రమిది. ఒక హీరో నిర్మాణంలో అడుగుపెట్టడం డేరింగ్ స్టెప్. కథపై దర్శకుడి పై నమ్మకంతో ఈ సినిమా చేశాడు. ఈ ప్రయాణంలో తను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నా. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి. పెద్ద సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. సందీప్ యాక్టింగ్, అన్యా సింగ్ గ్లామర్, తమన్ ఫెంటాస్టిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్… ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్. నిను వీడని నీడను నేనే తో సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మ్యాజిక్ re క్రియేట్ చేస్తాడని నమ్మకం ఉంది” అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ “అందరూ నిర్మాత అంటుంటే కొత్తగా ఉంది. నన్ను నేను వెండితెరపై చూసుకుని రెండేళ్లు అవుతోంది. ఒక యాక్టర్ గా అది నరకం. సినిమా తప్ప ఇంకేదీ తెలియని నాలాంటి వాడికి పెద్ద నరకం. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. అది విని తట్టుకోలేం.. అని థియేటర్ కి వెళ్లలేదు. ఆ సమయంలో విదేశాలు వెళ్లాను. ఇక్కడి నుంచి బయటకు వెళితే కాస్త బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది.. అని అనుకున్నా. తిరిగి వచ్చేసరికి బాగా లావు అయ్యాను. మళ్లీ బరువు తగ్గి సినిమాలు చేద్దాం అనుకునేటప్పటికి… మాకు బాగా కావలసిన ఇండస్ట్రీ వ్యక్తిని కలిశారు. ఆయన చాలా పెద్ద వ్యక్తి. మాటల మధ్యలో మేనేజర్లు నా గురించి చెప్పబోతే… ‘ఇంకెక్కడి సందీప్! అయిపోయాడు. కొత్త హీరోల వచ్చారు కదా. వాళ్ల గురించి చెప్పు’ అన్నారట. ఆ మాట అన్న వ్యక్తికి థాంక్యూ ఆయనపై నాకు ఎలాంటి కోపం లేదు. ఆయన అలా అనడం వల్ల ఈ సినిమా చేశా. ఎందుకు అంటే…
నా జీవితంలో నేను ఎప్పుడు ఏది చేయాలి అనేది డిసైడ్ చేయడానికి ఎవరికీ హక్కు లేదు. నాకు మాత్రమే హక్కు ఉంది. అవకాశాలు మనకు రావు, మనమే సృష్టించుకోవాలి. ఇన్నాళ్ళు నేను నమ్మిన సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా నమ్మిన సినిమాలు చేస్తున్నా . సినిమాలు మానేసి బయటకు వెళ్లి పోయే పరిస్థితి వస్తే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఒక్కటైనా చేసి వెళ్లిపోవాలి తప్ప మాములుగా వెళ్ళిపోయాడనే మాట ఉండకూడదు. అలా అయితే ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టానికి, నేను కన్న కలలకు న్యాయం చేయలేననే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ఇండస్ట్రీలో నాకు పెద్ద దిక్కు జెమినీ కిరణ్ గారు, అనిల్ సుంకర గారు. నేను సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నానని వాళ్లకు చెప్పగానే వద్దన్నారు. వాళ్ళు నాకు కొండంత అండగా నిలబడ్డారు. అనిల్ గారు మా సినిమాకు ప్రజెంటర్. ఈ సినిమా ఆయనది కూడా. ఫస్ట్ ఫస్ట్ సినిమా చూసినది ఆయనే. ఆయన కాకుండా దయా పన్నెం నా ఫ్రెండ్, పార్ట్ నర్ ఎంతో అండగా నిలబడ్డాడు. నేను కథ చెప్పగానే ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నాడు. నన్ను నమ్మారు. నిన్న సినిమా చూశాక దయా హగ్ చేసుకున్నాడు. మనం అనుకున్నది కరెక్ట్ గా తీశామనే ధైర్యాన్ని ఇచ్చాడు.
నా కెరీర్ లో ఫస్ట్ టైమ్ చెప్తున్నా… నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీశాము. గర్వంగా చెప్తున్నా. చాలామంది కోపంలో, భయంతో, బాధలో నిర్ణయాలు తీసుకుంటారు. సినిమాలు చేస్తారు. మేం ఈ సినిమా కసితో చేశాము. హిట్ కొట్టాలని, థియేటర్ కి వచ్చే ప్రేక్షకులకు బెస్ట్ సినిమా ఇవ్వాలనే సింగిల్ పాయింట్ అజెండాతో తీసిన సినిమా ఇది. మేం ఎంచుకున్న వృత్తి వలన మా కుటుంబాలు ఇబ్బంది పడకూడదని, విజయాలు సాధించాలని తీసిన సినిమా ఇది. నేను ఇప్పటివరకూ మా అమ్మకు ఒక్క చీర కూడా కొనలేదు. మా పేరెంట్స్ ఏనాడూ నన్ను ఏదీ అడిగినది లేదు. వాళ్లు బయటకు వెళ్తుంటే.. ‘ఏంటి? మీ కొడుకు సినిమా సరిగా ఆడటం లేదట’ అనే మాట ఎవరూ అనకుండా ఉంటే చాలు. ఈ సినిమాతో పేరెంట్స్ కి మంచి పేరు తెచ్చిపెడతా. మా దర్శకుడు కార్తీక్ రాజుగారిది ‘జెర్సీ’లో నాని లాంటి స్టోరీ. ఆయనకు 46 ఏళ్లు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచి సీజీ టెక్నీషియన్. మంచి ఉద్యోగం వదులుకుని దర్శకుడు అవ్వాలని ఎనిమిదేళ్ల క్రితం డిసైడ్ అయితే…ఇంట్లో సపోర్ట్ చేశారు. ఇవ్వాళ సినిమాను డైరెక్ట్ చేశారు.
సినిమాలో నాకోసం పాట పాడిన సిద్ధార్థ్, మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్, మా బ్రదర్, ఎడిటర్ చోటా కె ప్రసాద్, మా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివా చెర్రీ, సీతారామ్.. అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్. అలాగే, ఈ సినిమాను ఆరు నెలల క్రితం చనిపోయిన నా అభిమాని కడప శీనుకు అంకితం ఇస్తున్నా. గత రెండు మూడేళ్ళుగా ఏ సినిమా ఆడకున్నా… నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. మంచి సినిమా వచ్చేసరికి… తను లేడు. అతడికి సినిమా అంకితం ఇస్తున్నా. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బ్యానర్ నాకు మాత్రమే పరిమితం కాదు. ఈ సినిమా బాగా ఆడితే కొత్తవాళ్లతో కూడా సినిమాలు తీస్తూ ఉంటాం” అన్నారు.
సహ నిర్మాత సుప్రియ మాట్లాడుతూ “సినిమా చూశా. చాలా బాగుంది. వినోదం, భయం, థ్రిల్… అన్ని హంగులు ఉన్న చిత్రమిది. మాకు ప్రేక్షకులు అందరి ఆశీర్వాదం కావాలి” అన్నారు.
కథానాయిక అన్య సింగ్ మాట్లాడుతూ “నా తొలి తెలుగు చిత్రం ఇది. ఈరోజు ట్రైలర్ విడుదల అవుతుంది. నాకు ఇది స్పెషల్ డే. చాలా ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. నాకు అవకాశం ఇచ్చిన సందీప్ కిషన్, మా దర్శకుడు కార్తీక్ రాజు, నిర్మాతలకు థాంక్స్” అన్నారు.
నిర్మాతలలో ఒకరైన దయా పన్నెం మాట్లాడుతూ “సినిమా కంటే ముందు నేను, సందీప్ కిషన్ మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు పార్ట్నర్స్ అయ్యాం. ఆల్రెడీ సినిమా చూశా. చాలా బాగుంది ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ “సందీప్ కిషన్ కి స్క్రిప్ట్ చెప్పినప్పుడు తనే ప్రొడ్యూస్ చేస్తానన్నారు. నాకది పెద్ద సర్ ప్రైజ్. హారర్ నేపథ్యంలో తీసిన ఎమోషనల్ సినిమా ఇది. సందీప్ కిషన్ అన్యా సింగ్ తమ పాత్రలో అద్భుతంగా నటించారు. తమన్ టెర్రిఫిక్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు” అన్నారు. ఈ కార్యక్రమంలో మాటల రచయిత సామ్రాట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రీ, సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.
పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ – ఫణి కందుకూరి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: విదేష్, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చెర్రీ, సీతారామ్, కిరుబాకరన్, నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్, దర్శకుడు: కార్తీక్ రాజు