వారిచ్చిందే.. కష్టకాలంలో తిరిగిస్తున్నా!

హీరో నిఖిల్‌… ఇటీవల శ్రీకాకుళం తితలీ తుపాను బాధిత ప్రాంతాలకు ఆయన వెళ్ళారు. స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ‘‘నటుడిగా నాకు ఇంత పేరు, సంపద వచ్చిందంటే… అదంతా ప్రజలు ఇచ్చిందే! వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు.. అవసరంలో ఉన్నప్పుడు… పబ్లిక్‌ ఇచ్చిన డబ్బులోంచి ఎంతో కొంత వాళ్ళకు తిరిగి ఇవ్వకపోతే ఎందుకు?’’ అని అంటున్నారు నిఖిల్‌ .
 
“మనమంతా తెలుగువాళ్ళం. అంతకంటే ముందు భారతీయులం! కేరళలో వరదలు వచ్చినప్పుడు తెలుగుచిత్ర పరిశ్రమలో నటీనటులు, సాంకేతిక నిపుణులు, తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి సహాయం చేశారు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకు ఆపద వచ్చిందని తెలిసి.. వెంటనే అక్కడికి వెళ్ళి సహాయక చర్చల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నా. మనం ఎంతో కొంత విరాళం ఇవ్వడం వేరు. నేరుగా సహాయక చర్యల్లో పాల్గొనడం వేరు. లక్కీగా నాకు రెండు రోజులు షూటింగ్‌ నుంచి గ్యాప్‌ దొరికింది. మా బావగారు విశాఖలో ఉంటారు. వాళ్ళ సహకారంతో శ్రీకాకుళంలోని తుపాను బాధిత ప్రాంతాలకు వెళ్ళాను. అక్కడి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం నేనెప్పటికీ మరువలేను.
ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే… అందరిలో ఒక చైతన్యం తీసుకురావడానికి! తుపాను బాధిత ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలకు కావల్సిందేంటి? అని కనుక్కుంటే… ఆహారం , కరెంట్‌ అవసరమని తెలిసింది. ప్రజలకు మంచి భోజనాలు పెడదామని వెళ్ళాం. కరెంట్‌ లేదు, సరైన ఆహారం లేదు. అయినా… వాళ్ళు రిసీవ్‌ చేసుకున్న తీరుకి మళ్ళీ వెళ్ళి సహాయం చేయాలని అనిపిస్తుంది.సినిమా ప్రమోషన్‌లో భాగంగా చాలాసార్లు టూర్స్‌కి వెళతా. అప్పుడు ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకునే విధానం బావుంటుంది. మన సినిమా హిట్టయినప్పుడు మనతో పాటు వాళ్ళు సంతోషపడతారు. నన్ను ఇంతబాగా ఆదరించిన వాళ్ళు సమస్యల్లో ఉంటే సహాయం చేయడం నా బాధ్యతగా భావించాను. నేను ఒక్కడినే కాదు, ఎంతోమంది సహాయం చేస్తున్నారు. ప్రభుత్వాలు, ఇతర నటీనటులు సహాయం చేస్తున్నారు. నా సంతృప్తి కోసం వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. ఇందులో కష్టం ఏముంది? ‘ఒకటి రెండు రోజులు చేసింది కష్టం’ అని అనుకోవడం లేదు. అక్కడి ప్రజలు రోజూ కష్టపడుతున్నారు. యువత కూడా ముందుకొచ్చి ఎంతో సహాయం చేస్తున్నారు. ఎంత చేసినా సరిపోదు. ఇంకా చెయ్యాలి. నా ఫ్యామిలీ కష్టాల్లో ఉందనుకుని వెళ్ళాను. అక్కడ ఉన్న రెండు రోజులు వాళ్ళను ఎంటర్‌టైన్‌ చేస్తూ… నేను ఎంత చేయగలుగుతానో, అంత చేశా”… అంటూ చెప్పారు నిఖిల్‌.