కధనం బలహీనం… ‘అర్జున్ సురవరం’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.5/5

ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, మూవీ డైనమిక్స్‌ బ్యానర్లపై టి. సంతోష్‌ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ… ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్అర్జున్ లెనిన్ సురవరం(నిఖిల్) అంతగా పేరు లేని చిన్న చానెల్‌లో పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా బీబీసీలో జాబ్ సంపాదించాలని అతడి కోరిక. ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కోసం ఒకరోజు పబ్‌కు వెళతాడు. అక్కడ అనుకోని ఒక సంఘటనతో కావ్య(లావణ్య త్రిపాఠి) అనే జర్నలిస్ట్ పరిచయం అవుతుంది. ఒక రోజు బీబీసీ నుంచి అర్జున్‌కు పిలుపు వస్తుంది. సెలెక్షన్ కార్యక్రమం అంతా పూర్తయ్యాక.. సర్టిఫికెట్లు సబ్మిట్ చేసే సమయానికి అర్జున్‌కు ఊహించని షాక్ .అతడి చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లన్నీ ఫేక్ అని.. ఆ సర్టిఫికెట్లతో బ్యాంకులోన్ తీసుకుని మోసం చేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. షాక్ నుంచి తేరుకున్న అర్జున్ తాను మోసగాడిని కానని నిరూపించుకోవడానికి ఏం చేశాడు? ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి బ్యాంకులను మోసం చేసింది ఎవరు? ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది.. నిజంగా చదివి పాసైన వారి జీవితాలతో ఆడుకుంది ఎవరు? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం సినిమా చూడాలి…..

విశ్లేషణ… ‘అర్జున్ సురవరం’ తమిళ చిత్రం ‘కనితన్’ కు రీమేక్ గా వచ్చిన సినిమా…సేమ్ టు సేమ్ పద్దతిలోనే తీసారు. తమిళంలో డైరక్ట్ చేసిన దర్శకుడే సంతోష్ఇక్కడ కూడా చేయటంతో… దాదాపు అదే విధంగా..ఇక్కడ నేటివిటి కోసం పెద్ద మార్పులు చేయకుండానే ఈజీగా ఈ సినిమా చేసేసాడు.ఫేక్‌ సర్టిఫికెట్‌ నెట్‌వర్క్‌, దాని వల్ల సామాన్యులపై పడే ఎఫెక్ట్‌… ఇలాంటి అంశాలతో మొదలయ్యే కథలో విషయం ఉన్నా..దానిని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడి బలహీనత బయటపడింది. కథ ప్రారంభంలో హీరో అరెస్ట్ అయ్యే సన్నివేశంతో ఆసక్తికరంగానే సినిమాని ప్రారంభించాడు దర్శకుడు. అయితే, హీరోహీరోయిన్ ప్రేమ సన్నివేశాలతో కొంత బోర్ కొట్టించాడు… వెన్నెల కిషోర్, సత్య పాత్రలతో కామెడీ ట్రాక్ కొంత ఫర్వాలేదనిపించాడు. సెకండాఫ్ లోనే కథంతా పెట్టుకున్నారు. పూర్తి క్రైమ్ ఇన్విస్టిగేషన్ డ్రామా గా సీరియస్ గా నడుస్తుంది. నకిలీ సర్టిఫికెట్ల స్కామ్‌ వెనకున్న వ్యక్తి కోసం అర్జున్ ప్రయత్నించే సన్నివేశాలతో ద్వితీయార్థం కొంత ఆసక్తికరంగా అనిపిస్తుంది.ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ బెస్ట్. క్లయిమాక్స్ మరింత ఆసక్తికరంగా ఉండుంటే సినిమా స్థాయి కొంతపెరిగేది
 
నటీనటులు… నిఖిల్అర్జున్ లెనిన్ సురవరం పాత్రలో చక్కగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లోనూ.. ఎమోషనల్ సీన్స్‌లోనూ నిఖిల్ ఆకట్టుకున్నాడు. కావ్యగా లావణ్య త్రిపాఠి లుక్స్ పరంగానే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లోనూ బాగానే చేసింది. వెన్నెల కిషోర్ నవ్వించడమే కాదు.. ఎమోషనల్ సీన్‌లో ఏడ్పిస్తాడు. వెన్నెల కిషోర్, విద్యుల్లేఖరామన్ మధ్య కామెడీ సీన్స్ పండాయి. కెమెరామెన్ రాంబాబుగా సత్య నవ్వించాడు. నిజాయితీ పోలీస్ కానిస్టేబుల్ గా పోసాని … విలన్ పాత్రల్లో నటించిన తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ..తండ్రి పాత్రలో నాగినీడు, తల్లి పాత్రలో ప్రగతి బాగా నటించారు.
 
శ్యామ్ సీ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. చాలా చోట్ల సినిమా టెంపోని పెంచడానికి ఉపకరించింది .పాటలు అంత బాగులేవు.. సందర్భానికి తగ్గట్టు లేవు. ఆసక్తికరంగా సాగుతున్న కథలో ఇరికించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది.సూర్య‌ సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది– రాజేష్