దక్షిణాది అగ్రకథానాయిక నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ల మధ్య ప్రేమాయణం తెలిసిందే. ఐదేళ్లుగా ఈ జంట ప్రేమ బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. విదేశాల్లో ఈ జోడీ తీయించుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. కొన్ని నెలల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తమ ప్రేమ, పెళ్లి గురించి ఈ జంట ఎక్కడా బాహాటంగా మాట్లాడకపోవడంతో.. అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. తాజాగా ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విఘ్నేశ్ శివన్ నయనతారతో పెళ్లి గురించి మాట్లాడుతూ…
“సోషల్‌మీడియాలో ఇప్పటికే ఇరవైసార్లు మా పెళ్లి చేశారు. ప్రతి మూడు నెలలకొకసారి మా వివాహం గురించి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రస్తుతం మేమిద్దరం జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ప్రేమ ప్రయాణం బోర్ కొట్టినప్పుడు పెళ్లిచేసుకుంటాం. మా వివాహం గురించి ముందుగానే అందరికి తెలియజేస్తాం’ అన్నారు. సినిమాలకు సంబంధించిన ప్రమోషన్‌లకు నయనతార ఎందుకు హాజరుకాదన్న ప్రశ్నకు విఘ్నేశ్ వివరణ ఇస్తూ.. ‘మంచి సినిమాకు పబ్లిసిటీ అవసరం లేద’న్నది నయనతార అభిప్రాయం. నటన విషయంలో అంకితభావం, కష్టపడేతత్వం ఉంటే సరిపోతుంది..మిగతా విషయాలను పట్టించుకోవద్దని ఆమె చెబుతుంటుంది. అందుకే ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది” అని చెప్పారు.
జ్యోతిష్యుడి సూచనల మేరకు…
నయనతార పెళ్లి విషయంలో ఓ జ్యోతిష్యుడి సూచనల మేరకు ఆచితూచి అడుగులు వేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాాయి. కానీ ఇంత వరకు పెళ్లి మాత్రం జరగలేదు. ముందుగా 2019 డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. తరువాత 2020 సమ్మర్ జరుగుతుందన్న టాక్ వినిపించింది. గత ఏడాది కాలంలో నయన్, విఘ్నేష్‌లు అనేక దేవాలయాలను సందర్శించారు. అయితే ఇలా ఆలయాలు సందర్శించటం పెళ్లి కోసమే అని భావిస్తున్నారు విశ్లేషకులు. దోష నివారణ కోసం ఓ జోతిష్యుడి సలహా మేరకు నయన్, విఘ్నేష్ ల జంట ఆలయాలను సందర్శిస్తున్నారట.నయనతార ఆస్ట్రాలజీని బాగా నమ్ముతుందట. అందుకే జ్యోతిష్యుడి సూచనల మేరకు వరుసగా ఆలయాలను సందర్శిస్తున్నట్టుగా చెబుతున్నారు. త్వరలో ఈ జంట కుంభకోణం సమీపంలో తిరు నాగేశ్వరం లోని రాహు ఆలయాన్ని సందర్శించనున్నారట. ఈ ఆలయ సందర్శన తరువాత పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.కొద్ది రోజుల క్రితమే రాహు ఆలయాన్ని కూడా సందర్శించాల్సి ఉన్నా.. లాక్ డౌన్ కారణంగా వెళ్లలేకపోయారు. ప్రస్తుతం ఆలయాలు తిరిగి ఓపెన కావటంతో త్వరలోనే రాహు ఆలయ సందర్శనకు రెడీ అవుతున్నారు. దీంతో తమ జాతకంలోని దోషాలకు పరిహారం కలుగుతుందని..తరువాత పెళ్లి చేసుకోనున్నట్టుగా తెలుస్తోంది.