“చేయబోయే పాత్ర నా మనసుకు నచ్చడంతో పాటు కథలో ప్రాముఖ్యత కలిగి ఉంటే ఎలాంటి షరతులు లేకుండా సినిమాను అంగీకరిస్తాను”… అని తెలిపింది నయనతార. సినిమాలో పాత్ర నిడివి రెండు గంటలా.. ఇరవై నిమిషాలా..అనే అంశాలకు నేనెప్పుడు విలువ ఇవ్వను…అని అంటోంది. ఆమె గత కొంతకాలంగా సామాజిక ఇతివృత్తాలపై ఎక్కువగా ఆసక్తిని ప్రదర్శిస్తున్నది. కమర్షియల్ సినిమాలతో పోలిస్తే సందేశాత్మక చిత్రాలకు న్యాయం చేయడానికి చాలా శ్రమించాల్సివుంటుందని చెబుతున్నది నయనతార. ఆ కష్టాన్ని తాను ఆస్వాదిస్తానని అంటోంది. ఆమె మాట్లాడుతూ… “కమర్షియల్ సినిమాల కంటే సామాజిక కథాంశాలతో రూపొందిన చిత్రాలే నాకు ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. దాంతో అలాంటి కథలతోనే చాలా మంది దర్శకనిర్మాతలు నన్ను సంప్రదిస్తున్నారు. గ్లామర్ పాత్రలకు పూర్తిగా దూరంగా ఉంటానని చెప్పను. అవకాశం వస్తే గ్లామరస్‌గా కనిపించడానికి అభ్యంతరం ఏమీ లేదు. గ్లామర్ పాత్రల కోసమే ఎదురుచూస్తూ సమయం వృథాచేసుకోకుండా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. సినిమాను ఒప్పుకునే ముందు నా మనసు ఏం చెబుతుందో ఆ మాటే వింటాను. నిడివితో సంబంధం లేకుండా నా పాత్ర చిన్నదైనా …అది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవాలని కోరుకుంటాను” అని తెలిపింది.
మళ్లీ జిల్లా కలెక్టర్‌గా…
బోరుబావిలో చిన్నారులు పడి మృతి చెందిన సంఘటనలు అనేకం. వీటి ఆధారంగా తమిళంలో ‘ఆరమ్’ చిత్రం రూపొందింది. అందులో నయన తార కలెక్టర్‌గా చేసింది. ఓ పాపను కాపాడడంతో కలెక్టర్ బాధ్యతలను ఎలా నేరవేర్చాలన్న దానిపై ఈ సినిమాలో చర్చించారు. జిల్లా అధికారి పాత్రలో నయన మెప్పించింది. ఇప్పుడు మరో సామాజిక అంశం నేపథ్యంలో కొత్త సినిమా రూపొందుతోంది. అందులోనూ నయన తార ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా మంచినీటి కొరతపై రూపొందుతోంది. ఈ చిత్రానికి గోపీ నైనార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ నైనార్ మాట్లాడుతూ… ‘ సామాజిక బాధ్యతతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ప్రస్తుత రోజుల్లో దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య నీటి కొరత. దీనిపై రూపొందుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల ఆలోచనలపై ప్రభావం చూపుతుంది” అని తెలిపారు. ఇందులో కూడా నయన తార మళ్లీ జిల్లా కలెక్టర్‌గా చేయబోతుంది. చైల్డ్ ఆర్టిస్ట్స్ విగేశ్, రమేశ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నయన తార తెలుగులో చిరంజీవికి జోడీగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తోంది.