పుస్తక ప్రచురణ రంగంలో విశేష కృషి చేసిన …ప్రముఖ పుస్తక ప్రచురణ కర్త, నవోదయ పబ్లికేషన్స్ అధినేత రామ్మోహనరావు (85) ఆదివారం రాత్రి విజయవాడ లో కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు పుస్తక ప్రచురణ కర్తలు నివాళులర్పించారు. 1934లో కృష్ణా జిల్లాలో జన్మించిన రామ్మోహనరావుకు చిన్ననాటి నుండి పుస్తకాలు అంటే ఎనలేని మక్కువ. ఆయన మొదట ‘విశాలాంధ్ర బుక్ హౌస్’లో గుమస్తాగా చేరారు. 1955 ఎన్నికల తర్వాత సిబ్బంది కుదింపుతో ఆయన బయటకు వచ్చారు.
1957లో గుడివాడలో ‘నవోదయ పబ్లికేషన్స్’ను స్థాపించారు. ఆ తరువాత ఏడాదికే దాన్ని విజయవాడకు మార్చారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ప్రచురణ కర్తగా విస్తృతంగా అభ్యుదయ సాహిత్యాన్ని ప్రచురించారు. దాంతో ఆయన పేరు నవోదయ రామ్మోహనరావుగా ప్రాచుర్యం లోకి వచ్చింది. ఆయన కమ్యూనిస్టు భావజాలం కలిగి ఉండేవారు. శ్రీశ్రీ, ఆరుద్ర, బాపు, ముళ్లపూడి వెంకటరమణ, గోపీ చంద్ వంటి ఎందరో ప్రముఖ రచయితల పుస్తకాలను ప్రచురించారు. బాపు గీచిన అందమైన బొమ్మలతో పుస్తకం అట్టకు వన్నెతెచ్చారు. తరువాత అది తెలుగు పుస్తక రంగంలో ఒక ఒరవడిగా మారింది. ‘నవత ట్రాన్స్పోర్ట్’ సంస్థ అధినేత కీ.శే. బోస్ సోదరి ఝాన్సీని ఆయన వివాహమాడారు. 1989లో ‘విజయవాడ బుక్ ఫెస్టివల్’ సొసైటీ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ప్రారంభించినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేశారు. “నవోదయ రామ్మోహనరావు మరణించడం పుస్తక ప్రచురణ రంగానికి తీరనిలోట”ని తెలుగు సాహితీ లోకం నివాళులర్పిస్తోంది .