సినీవినోదం రేటింగ్ : 3/5
స్వప్న సినిమా బ్యానర్ పై అనుదీప్ కె వి దర్శకత్వంలో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ.. శ్రీకాంత్ అనే కుర్రాడు జోగిపేట అనే ఓ గ్రామంలో ఇద్దరు ప్రెండ్స్ తో కలిసి.. ముగ్గురూ బలాదూర్‌గా ఊళ్ళో తలిదండ్రులకి తలనొప్పి తెప్పించే పనులు చేస్తూ తిరుగుతుంటారు. అందులో శ్రీకాంత్ ఓ శారీ, మేచింగ్ గాజుల దుకాణం నడుపుతుంటాడు. కానీ శ్రీకాంత్‌కి ఆ గుర్తింపు ససేమిరా ఇష్టం లేక హైదరాబాద్ వచ్చి, మెడలో టేగ్ వేసుకుని స్టయిల్‌గా అందరి యూత్‌లాగే ఉండాలన్నది తాపత్రయం. రెండు నెలలలో హైదరాబాద్‌లో ఉద్యోగం సంపాదించి సెటిల్ అవుతానని, సంపాదించలేకపోతే మళ్ళీ జోగిపేట తిరిగొచ్చి శారీ సెంటరే నడుపుకుంటానని ప్రామిస్ చేసి హైదరాబాద్ ప్రయాణమవుతాడు. శ్రీకాంత్‌తో పాటు అతనికిష్టం లేకపోయినా కూడా ఇద్దరు ఫ్రెండ్స్ వెంటపడి మరీ హైదరాబాద్ వచ్చేస్తారు. తీరా వచ్చాక అసలైన తిప్పలు మొదలవుతాయి ముగ్గురికి. ఈ ప్రయాణంలోనే అనుకోకుండా ముగ్గురూ ఓ మర్డర్ కేసులో వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇరుక్కుంటారు. ఆ మర్డర్ కేసులోనుంచి ఎలా ముగ్గురూ బైటపడతారు? అన్నది సినిమాలో చూడాలి…
విశ్లేషణ.. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు’కు నాగ్ అశ్విన్ నిర్మాత కావడంతో ఈ సినిమాపై ఆసక్తి, అంచనాలు పెరిగాయి. దర్శకుడు అనుదీప్ ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా మలచాలనుకున్న లక్ష్యం పూర్తిగా నెరవేరింది. ఏ మాత్రం బోర్ లేకుండా ప్రతీ సీనూ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ తరం ప్రేక్షకులకి, ముఖ్యంగా మాస్ అండ్ యూత్‌ని టార్గెట్ చేసి తీసిన ఈ జాతిరత్నాలు.. అనవసరమైన ఊకదంపుడు డైలాగులు గానీ, సాగదీసే సీన్లు గానీ లేకుండా ధియేటర్లో రెండున్నరగంటలు అడియన్స్‌కి మంచి రిలీఫ్‌నిచ్చింది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణల డైలాగ్ టైమింగ్, పంచులు గ్యాప్ లేకుండా వస్తుండటం వల్ల బోర్ కొట్టదు. ప్రతీ సీను, ప్రతీ డైలాగ్ పండింది. దర్శకుడు సుపరిచితమైన నటులతో పాటు కొత్త ముఖాలతో కూడా మంచి పెరఫారమెన్స్‌ని రాబట్టాడు. సినిమా సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా ప్రేక్షకులను అకట్టుకుంది.
నటీనటులు.. నవీన్ పోలిశెట్టి మెయిన్ లీడ్ కాబట్టి ఎక్కువ బాధ్యత అతని భుజాల మీదే పడింది. ఆ బాధ్యతని నవీన్ చాలా బాగా నిర్వర్తించాడు. నవీన్ బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ ..అన్నీ జోగిపేట శ్రీకాంత్ క్యారెక్టర్‌కి బాగా సూటయ్యాయి. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలపైనే సినిమా అంతా రన్ అవుతుంది. ఎవరి పాత్రలో వాళ్ళు ఇమిడిపోయి, చక్కటి పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్‌ని నవ్వుల్లో ముంచెత్తారు .హీరోయిన్ ఫారియా అబ్దుల్లా నిండుగా బాగుంది. నటన పరంగా కూడా పర్వాలేదు. మురళీశర్మ రొటీన్ గానే కనిపించాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం కూడా కాసేపు కనిపించి నవ్వించారు. అతిథి పాత్రలో కీర్తి సురేష్ మెరుపులా మెరిసింది.
సాంకేతికత.. సంగీత దర్శకుడు రథన్. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. సందర్భానికి తగ్గట్టుగా వచ్చే పాటలు బాగున్నాయి. సిద్దం మనోహర్ కెమెరా పనితనం కూడా బాగుంది. ఎడిటర్ అభినవ్ రెడ్డి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సందర్భానికి తగ్గట్టుగా వచ్చే పాటలు బాగున్నాయి -రాజేష్