సినీవినోదం రేటింగ్ : 2. 5/5
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ రచన, దర్శకత్వం లో సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు
కృష్ణ (నాని) చిత్తూరుజిల్లా అక్కుర్తి గ్రామంలోని యువకుడు. పక్షులు పంటను నాశనం చేయకుండా కాపు కాస్తుంటాడు. నాటకాలంటే పిచ్చి. అలాగే ఊర్లోని అమ్మాయిలకు లవ్ ప్రపోజ్‌లు చేస్తుంటాడు. వారి దగ్గర తిట్లు చీవాట్లు తింటుంటాడు. ఓ సందర్భంలో గ్రామ సర్పంచ్(నాగినీడు) తన తల్లిన తిట్టాడని.. అతని కాలర్ పట్టుకుంటాడు. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం ఉన్న కృష్ణ సర్పంచ్ మనవరాలు రియా(రుక్సర్ మీర్)ను చూసి ప్రేమలో పడతాడు. క్రమంగా కృష్ణ మంచితనం చూసి రియా కూడా తనని ప్రేమిస్తుంది. కృష్ణ పేదవాడు కావడం ఇతరత్రా కారణాలతో ఆమె తాతయ్య ఆమెను హైదరాబాద్ పంపేస్తాడు. అదేసమయం లో ఈ కథకు సమాంతరంగా…. యూరప్‌లో అర్జున్(నాని) పెద్ద రాక్‌స్టార్. అర్జున్‌కి అమ్మాయిలను ముగ్గులోకి దించే ప్లేబోయ్ మనస్తత్వం ఉంటుంది. ఓ సందర్భంలో సుబ్బలక్ష్మి(అనుపమ పరమేశ్వరన్)ను చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే సుబ్బలక్ష్మి మాత్రం అర్జున్ ప్రేమను అంగీకరించదు. ఆమె హైదరాబాద్ బయలుదేరుతుంది. ఒక పక్క రియా.. మరో పక్క సుబ్బలక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. వారిని వెతకుతూ కృష్ణ, అర్జున్‌లు హైదరాబాద్ చేరుకుంటారు. ఇంతకు కృష్ణ, అర్జున్‌లు కలుస్తారా? సుబ్బలక్ష్మి, రియాలను ఎవరు కిడ్నాప్ చేశారు ? అనేది తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే…..
వరుసగా విజయాల నాని … వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి హిట్‌లున్న మేర్లపాక గాంధీ కలయికలో వచ్చింది ఈ కృష్ణార్జున యుద్ధం . మేర్లపాక గాంధీ తనకు కలిసి వచ్చిన కామెడీతోనే ఈ సినిమాను చేశా డు. ఒకే సమయంలో కృష్ణ, అర్జున్‌ల ప్రేమకథను నడిపించడం బాగుంది. పాత్రలకు ఆయన రాసిన డైలాగ్స్ చాలా వరకు ఆకట్టుకున్నాయి. రెండు సమాంతర ప్రేమ కథల్ని హాస్యంతో మిక్స్ చేసి నాని నటనను బేస్ చేసుకుని ఫస్టాఫ్ ను సరదా గా నడపి ఆకట్టుకున్నారు కథలో కొత్తగా ఏమీ లేకపోయినా.. స్క్రీన్‌ప్లే, హీరో నటన సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది. కానీ ద్వితీయార్థాన్ని మాత్రం బలహీనమైన అంశాలు , కథనంతో నింపేసి, రొటీన్ డ్రామాగా మార్చి నిరుత్సాహపరిచారు. క్లైమాక్స్ ముందు వచ్చే పాట అసందర్భంగా ఉండటం … సెకండాఫ్ సీరియస్‌గా సాగడం.. క్లైమాక్స్ మరీ సాగదీయడంతో బోర్ కొడుతుంది.
‘వన్ మాన్ షో’ లా నాని ద్విపాత్రాభినయంతో కృష్ణ, అర్జున్‌లుగా చేసిన నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒకవైపు రాక్‌స్టార్‌లా స్టైలిష్‌గా ఉంటూనే.. కృష్ణ అనే పల్లెటూరి యువకుడిగా చిత్తూరు యాసలో మాట్లాడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ పండించడంలో కూడా నాని సక్సెస్ అయ్యాడు. రాక్‌స్టార్ అర్జున్ పాత్రకు తగ్గ యాటిట్యూడ్‌ను నాని మెయింటెన్ చేశాడు. ఇలా రెండు పాత్రలకు తన నటనలో వైవిధ్యాన్ని చూపించాడు. ఊర్లో నాని స్నేహితులతో నడిచిన కామెడీ ట్రాక్ కూడా బాగా పండింది.ఇక అనుపమ, రుక్సర్ మీర్‌లు వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. వీరి పాత్రలు ఫస్టాఫ్‌లో… మళ్లీ సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కనపడతాయి. అర్జున్ స్నేహితుడిగా బ్రహ్మాజీ కామెడి ప్రేక్షకులను నవ్విస్తుంది. దేవదర్శిని , నాగినీడు, ప్రభాస్ శీను, హరితేజ లాంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చిత్తూరు అందాలను, ఫారెన్ లొకేషన్లను తెరపై బాగా చూపించాడు.కారు చేజ్ బాగా చేశారు. ఊర్లో పాడే పాటలకు , ‘రాక్‌స్టార్’ పాడే పాటలకు రెండింటికి తగ్గట్టుగా హిప్ హాప్ తమిళ మంచి సంగీతాన్ని అందించాడు. హిప్ హాప్ తమిళ ట్యూన్స్‌లో మూడు సాంగ్స్ (దారి చూడు దుమ్ము చూడు…, ఐవాంట్ ఫ్లై, ఉరిమే… సాంగ్స్ ) బావున్నాయి. నేపథ్య సంగీతం, సత్య ఎడిటింగ్ కూడా బాగున్నాయి – ధరణి