కొత్తదనం లేని.. ఆకట్టుకోని.. ‘వి’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.25/5

శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్ పై మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం లో దిల్‌రాజు, శిరీశ్, హ‌ర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
‘అష్టా చ‌మ్మా’ తో నాని ప్ర‌స్థానం మొద‌లైంది. తొలి చిత్రంతోనే నానికి మంచి హిట్‌ అందించారు ద‌ర్శ‌కుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. మ‌ళ్లీ ఆయ‌న డైరెక్ష‌న్‌లోనే నాని 25వ సినిమా చేయ‌డం విశేషం. ఇక‌ ఎప్పుడూ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌కే మొగ్గు చూపే నాని.. ఈ సారి ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌డంతో ‘వి’ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 5న‌ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల అయింది. ఓటీటీలో విడుద‌లైన తొలి భారీ తెలుగు చిత్రం ఇది కావ‌డం విశేషం.
 
కధ… పాత‌బ‌స్తీలో సాధిక్‌, చంద‌న్ అనే రెండు గ్యాంగుల మ‌ధ్య పెద్ద గొడ‌వ జ‌రుగుతుంది. ఆ గొడ‌వ హింసాత్మ‌కంగా మారుతుంటుంది. ఆ స‌మ‌యంలో డి.సి.పి ఆదిత్య‌(సుధీర్‌బాబు) రంగంలోకి దిగి అల్ల‌రి మూక‌ల‌ను ధైర్యంగా ఎదుర్కొంటాడు. గొడవ‌లో సాధిక్‌ను చంపేసిన చంద‌న్‌ను అరెస్ట్ చేయ‌డంతో కేసు క్లోజ్ అవుతుంది. అప్ప‌టి నుండి ఆదిత్య సిటీలో జ‌రిగే దౌర్జ‌న్యాల‌ను అరిక‌డుతూ అంద‌రి చేత శభాష్అనిపించుకోవ‌డ‌మే కాక అవార్లులను కూడా అందుకుంటాడు. అదే స‌మ‌యంలో సైకాల‌జీలో డిగ్రీ తీసుకున్న అపూర్వ రామానుజం(నివేదా థామ‌స్‌) ఆదిత్య క్యారెక్ట‌ర్‌ను బేస్ చేసుకుని ఓ క్రైమ్ న‌వ‌ల‌ను రాయాల‌నుకుని అత‌నితో పరిచ‌యం పెంచుకుంటుంది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారుతుంది. ఈ నేప‌థ్యంలో లంగ‌ర్ హౌస్ ఎస్సై వేద ప్ర‌సాద్‌ను ఎవ‌రో దారుణంగా హ‌త్య చేస్తారు. హ‌త్య చేయ‌డమే కాదు.. ‘వీలైతే నన్ను ప‌ట్టుకో’ అంటూ డీసీపీ ఆదిత్య‌కు ఛాలెంజ్ విసురుతాడు కిల్లర్. త‌న‌కు ఛాలెంజ్ విసిరిన క్రిమిన‌ల్ ప‌ట్టుకోవ‌డానికి రంగంలోకి దిగిన ఆదిత్య ఆధారాలు సేక‌రించే స‌మ‌యంలోనే కిల్ల‌ర్(నాని)… సిటీలోని ప్ర‌ముఖ బిల్డ‌ర్ మ‌ల్లిఖార్జున్‌(మ‌ధుసూద‌న్‌)ను హ‌త్య చేస్తాడు. రెండో హ‌త్య త‌ర్వాత డైరెక్ట్‌గా ఆదిత్య‌కు ఫోన్ చేసిన కిల్ల‌ర్ ఓ క్లూ కూడా ఇస్తాడు. ఆ క్లూను ఛేదించి ముంబై వెళ‌తాడు ఆదిత్య‌. ఆదిత్య అక్క‌డ వెళ్లే లోపు కె.కె అనే ఓ డాన్‌ను చంపేస్తాడు కిల్ల‌ర్‌. కిల్లర్‌ను పట్టుకోవడానికి ఆదిత్య ప్రయత్నం చేసినా.. చివ‌ర‌కు కిల్ల‌ర్ త‌ప్పించుకుంటాడు. అదే సమయంలో ఆదిత్య‌కు కిల్ల‌ర్ ఓ క్లూ ఇస్తాడు. ఆ క్లూ ఆధారంగా ముందుకెళ్లి ఆదిత్య‌కు విష్ణు అనే చిన్న‌నాటి స్నేహితుడు గురించి తెలుసుకునే అవ‌కాశం క‌లుగుతుంది. విష్ణుకి, కిల్ల‌ర్‌కు ఉన్న సంబంధమేంటి? అస‌లు కిల్ల‌ర్ హ‌త్య‌లు చేయ‌డానికి కార‌ణ‌మేంటి? చివ‌ర‌కు ఆదిత్య కిల్ల‌ర్‌ను ప‌ట్టుకుంటాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే…
 
విశ్లేషణ… ‘వి’లో ప్ర‌ధానంగా రెండు పాత్ర‌లు క‌నిపిస్తాయి. మిగిలినవ‌న్నీ స‌పోర్టింగ్ పాత్రలే. సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌కు ఛాలెంజ్ విసిరే తెలివైన కిల్ల‌ర్ నాని..‌. సుధీర్ పోషించిన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌. సినిమాను దర్శకుడు సస్పెన్స్‌ తో నడపడానికి కృషి చేసాడు. .అయితే ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి సినిమాను గ్రిప్పింగ్‌గా న‌డపడంలో తొలిభాగం వ‌ర‌కు ‘ఓకే’ అయ్యారు. ద్వితీయార్థం మ‌రింత ర‌క్తిక‌ట్టిస్తార‌నుకుంటే.. అలా జ‌ర‌గ‌లేదు. క‌థ‌నం నెమ్మ‌దించింది. ఎప్పుడైతే సుధీర్‌.. నాని వెంట‌ప‌డ‌టం.. సుధీర్ బాబుకు నానినే క్లూ ఇవ్వ‌డం.. అనే దగ్గరినుండి సినిమా ఆసక్తికరంగా అనిపించ‌లేదు. ఇక నాని చేసిన ఆర్మీ మేజ‌ర్ ఎపిసోడ్‌ బలంగా లేదు. నాని పాత్ర‌ను హైలైట్ చేయ‌డానికి మిగిలిన పాత్ర‌ల‌ను బలహీనం చేసిన‌ భావ‌న క‌లిగింది. అలాగే నాని, అదితిరావు హైద‌రి మ‌ధ్య ఉన్న ల‌వ్ ట్రాక్ గొప్ప‌గా ఏం లేదు. క‌థ బాగానే ఉన్నా క‌థ‌నం అంత బ‌లంగా లేదు. ఫ్లాష్‍బ్యాక్‍ చప్పగా ముగించేసారు. ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి సెకండాఫ్ విష‌యంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బావుండేది.
 
నటన… ‘నేచురల్ స్టార్’ అనిపించుకున్న నాని ఈ సినిమాలో తన పాత్రలో ఆకట్టుకున్నాడు. తన క్లాసిక్ విలనిజమ్ తో నాని కొత్తగా కనిపించాడు.సెకెండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే కీలక సన్నివేశాలలో.. సుదీర్ బాబు క్యారెక్టర్ తో సాగే ట్రాక్ లో.. క్లైమాక్స్ సన్నివేశంలో నాని చాలా బాగా నటించాడు. సినిమాలో సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా సుధీర్‌బాబు ప‌ర్ఫెక్ట్‌గా సూట‌య్యాడు. సుధీర్ న‌ట‌న చాలా బావుంది. లుక్ ప‌రంగా సుధీర్ పడ్డ క‌ష్టాన్ని డైరెక్ట‌ర్ తొలి ఫైట్‌తో తెర‌పై ఆవిష్క‌రించాడు. న‌వ‌లా ర‌చ‌యిత‌గా, డీసీపీ ఆదిత్య ప్రేయ‌సిగా అపూర్వ పాత్ర‌లో నివేదా థామ‌స్ రాణించారు. క‌థ‌కు మూల‌మైన సాహెబ్ పాత్ర‌లో అదితిరావు హైద‌రి బాగా న‌టించారు. రోహిణి, వెన్నెల కిషోర్‌, హ‌రీశ్ ఉత్త‌మన్ త‌దిత‌రులు పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.
 
సాంకేతికం… పి.జి.విందా సినిమాటోగ్రఫీ, త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. అమిత్ త్రివేది సంగీతం అందించిన పాట‌లు పర్వాలేదు. బిశ్వ‌దీప్ చ‌ట‌ర్జీ సౌండ్ డిజైనింగ్ బాగా కుదిరింది. అక్కడక్కడా దర్శకుడు రాసిన  డైలాగ్స్ ఆక‌ట్టు‌కున్నాయి – రాజేష్